రాష్ట్రంలో సత్ఫలితాలిస్తున్న కాలుష్య నివారణ చర్యలు
పొల్యూషన్ తగ్గించేందుకు 2019లో దేశవ్యాప్తంగా 131 పట్టణాలు ఎంపిక చేసిన కేంద్రం
అందులో 13 ఆంధ్రప్రదేశ్ నుంచే కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు
విజయవాడ సహా ప్రధాన పట్టణాల్లో గణనీయంగా తగ్గుతున్న కాలుష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 13 పట్టణాల్లో వాతావరణ కాలుష్యం తగ్గించడంపై నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్‌సీఏపీ) కింద చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 131 పట్టణాలు, 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వాయుకాలుష్యం తగ్గించే విధంగా 2019లో ఈ కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. 2025–26 నాటికి వాతావరణ కాలుష్యాన్ని ఆయా ప్రాంతాల్లో తగ్గించడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
2023–24లో నమోదైన వాతావరణ కాలుష్యం డేటా ప్రకారం..దేశవ్యాప్తంగా 131 పట్ణణాల్లో అత్యధిక కాలుష్యం నమోదవుతుండగా... అందులో ఏపీ నుంచి 13 ప్రాంతాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే అత్యధికంగా ఢిల్లీ 208 పీఎం10తో తొలి స్థానంలో నిలిచింది. దేశస్థాయిలో విశాఖ 30వ స్థానంలో, కడప 128వ స్థానంలో నిలిచాయి.
కాలుష్యం పెరుగుదలలో పీఎం10 (వాతావరణంలో పీల్చుకునే స్థాయిలో ఉండే 10 మైక్రోమీటర్ల వ్యాసం కలిగిన ముతక కణాలు) స్థాయి 120 పాయింట్లతో ఏపీలో విశాఖ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో రాజమహేంద్రవరం, విజయనగరం, ఏలూరు నిలిచాయి. 42 పీఎం10 స్థాయితో ఏపీలో కడప చివరి స్థానంలో నిలిచింది.
విజయవాడలో తగ్గుముఖం
ఈ పథకం అమలు తర్వాత రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో కాలుష్యం తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎన్‌సీఏపీ చర్యలతో విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు వంటి పట్టణాల్లో కాలుష్యం తగ్గుముఖం పట్టింది. 2022–23లో విజయవాడలో పీఎం10 స్థాయి 90 పాయింట్లుగా ఉంటే అది 2023–24కు 61 పాయింట్లకు చేరింది. ఇదే సమయంలో కడపలో 57 నుంచి 42కు, నెల్లూరులో 56 నుంచి 52కు, కర్నూలులో 64 నుంచి 56కు తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే విశాఖలో వాతావరణ కాలుష్యం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ 2022–23లో పీఎం10 స్థాయి 116 పాయింట్లుగా ఉండగా అది 2023–24 నాటికి 120 పాయింట్లకు పెరిగింది. రాజమహేంద్రవరంలో 68 నుంచి 76, గుంటూరులో 60 నుంచి 61 పాయింట్లకు పెరిగింది. జనాభా పెరుగుదల, పారిశ్రామిక పురోగతి ఎక్కువ అవడం, స్థానికంగా వాతావరణ మార్పులు చోటుచేసుకోవడం తదితర కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో కాలుష్యం పెరుగుతున్నట్లు తెలిపింది.
ఏపీలో ఇప్పటివరకు రూ.109.78 కోట్ల వినియోగం
వాతావరణంలో పీఎం10, పీఎం 2.5 స్థాయిలను ప్రస్తుతమున్న స్థాయి నుంచి 2025–26కి కనీసం 40% తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 131 పట్టణాలకు రూ.19,614 కోట్లను కేటాయించింది. 10 లక్షల కంటే అధిక జనాభా కలిగిన నగరాల్లో ఈ మొత్తాన్ని 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు విడుదల చేస్తుండగా.. మిగిలిన పట్టణాలకు స్థానిక సంస్థల ద్వారా విడుదల చేస్తోంది.
ఈ మొత్తంలో ఇప్పటివరకు రూ.11,211.13 కోట్లను ఖర్చు చేసింది. ఎన్‌సీఏపీ కింద ఏపీ నుంచి ఎంపికైన 13 పట్టణాలకు ఇప్పటివరకు రూ.361.09 కోట్లు విడుదల చేయగా అందులో రూ.109.78 కోట్లను ఖర్చు పెట్టారు. వాతావారణ కాలుష్యానికి కారణమైన రహదారులపై దుమ్ము, వ్యర్థాలను తగలపెట్టడం, వాహన, పారిశ్రామిక కాలుష్యం, నిర్మాణ రంగ వ్యర్థాలు వంటి వాటిని గుర్తించి వాటిని నియంత్రించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment