సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యాన్ని 30% మేర తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. విశాఖ, విజయవాడ నగరాల్లో గాలిలో ఉన్న కాలుష్యం అంతకంతకు పెరుగుతోన్న నేపథ్యంలో దాన్ని తగ్గించేందుకు రెండేళ్లుగా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే విశాఖ మునిసిపల్ కార్పొరేషన్.. ఏయూ, ఐఐటీ (కాన్పూర్), అమెరికాకు చెందిన డ్యూక్ వర్సిటీలతో కలిసి కాలుష్య నియంత్రణకు ప్రణాళిక తయారు చేసింది. విజయవాడ కార్పొరేషన్ కూడా ఐఐటీ (తిరుపతి) భాగస్వామ్యంతో ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
శ్రీకాకుళం,విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు నగరాల్లో ఈ తరహా ప్రణాళికలను రూపొందించారు. ఇందుకోసం ఆ నగరాలకు ప్రభుత్వం ఏటా రూ.2 కోట్ల చొప్పున మూడేళ్లు కేటాయిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు నగరపాలక సంస్థలు ఏయూ ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ ప్రణాళికలు రూపొందించాయి. గుంటూరు, ఒంగోలు, నెల్లూరు నగరాలకు ఐఐటీ (తిరుపతి) సహకారంతో, చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు నగరాలకు నేషనల్ సెంటర్ ఫర్ అట్మోస్ఫియరిక్ రీసెర్చ్ (తిరుపతి) ద్వారా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రణాళికలను బట్టి గాలి కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
వాయు కాలుష్య పర్యవేక్షణ
వాయు కాలుష్య నియంత్రణ కోసం ఈ నగరాల్లో రూ.35 కోట్లతో కంటిన్యూస్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ, విజయవాడ నగరాల్లో 5 చొప్పున, 11 మునిసి పాల్టీల్లో ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తున్నారు. వీటిద్వారా గాలి కాలుష్యాన్ని ఆన్‌లైన్‌లో పర్యవేక్షించడం, ప్రజలకు దానిపై డిజిటల్‌గా చూపించడంపై అవగాహన కల్పించనున్నారు. కొత్తగా ఏర్పాటైన ప్రతి జిల్లా కేంద్రంలోను ఒక స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 35 స్టేషన్లలో గాలి కాలుష్యాన్ని పర్యవేక్షించనున్నారు.
వ్యర్థాల నుంచి ఇంధనం తయారీకి చర్యలు
కార్పొరేషన్లు, మునిసిపాల్టీల నుంచి వచ్చే వ్యర్థాల నుంచి ఇంధనాన్ని తయారు చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంటోంది. అక్కడి నుంచి వచ్చే మురుగునీటిని ప్రస్తుతం 89 సివేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేస్తుండగా మరికొన్ని ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్లాస్టిక్, ఈ–పరిశ్రమల వ్యర్థాల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’..
Comments
Please login to add a commentAdd a comment