2050 నాటికి కర్బన ఉద్గారాల తటస్థీకరణ | G20 leaders struggling to toughen climate goals, draft shows | Sakshi
Sakshi News home page

2050 నాటికి కర్బన ఉద్గారాల తటస్థీకరణ

Published Mon, Nov 1 2021 5:07 AM | Last Updated on Mon, Nov 1 2021 3:32 PM

G20 leaders struggling to toughen climate goals, draft shows - Sakshi

రోమ్‌:  భూగోళంపై జీవజాలం మనుగడకు పెనుముప్పుగా పరిణమిస్తున్న వాతావరణ మార్పుల పట్ల జి–20 దేశాల అధినేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ కాలుష్యం పెరగడంతోపాటు భూమి వేడెక్కడానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలను 2050 నాటికి సున్నా స్థాయికి తీసుకురావాలని తీర్మానించారు. కర్బన ఉద్గారాల తటస్థీకరణ కచ్చితంగా సాధించాలని నిర్ణయానికొచ్చారు.

అంతేకాకుండా విదేశాల్లో బొగ్గు ఆధారిత(థర్మల్‌) విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లకు ఇకపై ఎలాంటి ఆర్థిక సాయం అందించరాదని ప్రతిన బూనారు. కోవిడ్‌–19 మహమ్మారిపై పోరాటంలో వ్యాక్సిన్లే అతిపెద్ద ఆయుధాలని అంగీకరించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సిన్ల పంపిణీని పెంచడానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇటలీ రాజధాని రోమ్‌లో రెండు రోజులపాటు జరిగిన జి–20 శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. సదస్సులో పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఈ తీర్మానాల గురించి వివరిస్తూ ‘రోమ్‌ డిక్లరేషన్‌’ జారీ చేశారు. అవేమిటంటే...

► బొగ్గును మండించి, విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండడంతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీని అడ్డుకోవడానికి విదేశాల్లో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లకు రుణ సాయంనిలిపివేయాలి. కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిరుత్సాహపర్చాలి. ఈ ఏడాది ఆఖరి నుంచే దీన్ని అమల్లోకి తీసుకురావాలి. చైనా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలు ఇప్పటికే ఈ తరహా తీర్మానాలు చేసుకున్నాయి. అయితే, సొంత దేశాల్లో బొగ్గు వాడకం తగ్గించుకోవడంపై జి–20 నేతలు లక్ష్యాలను నిర్దేశించుకోలేదు.

► వాతావరణ మార్పుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద దేశాలకు సాయం చేయడానికి గతంలోనే అంగీకరించినట్లుగా ధనిక దేశాలు ప్రతిఏటా 100 బిలియన్‌ డాలర్లు సమీకరించాలి. పేద దేశాలకు రుణ సాయాన్ని పెంచాలి.

► కర్బన తటస్థీకరణ లేదా ‘నెట్‌ జీరో’ ఉద్గారాల లక్ష్య సాధనకు అందరూ కట్టుబడి ఉండాలి. ఈ శతాబ్ధి మధ్య నాటికి..అంటే 2050 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలి. వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు, వాతావరణం నుంచి తొలగించే ఉద్గారాల మధ్య సమతూకం ఉండడమే కర్బన తటస్థీకరణ. అంటే ఏ మేరకు ఉద్గారాలు విడుదలవుతాయో అంతేస్థాయిలో వాటిని వాతావరణం నుంచి తొలగించాలి.

► 2021 ఆఖరుకల్లా ప్రపంచంలో కనీసం 40% మందికి కరోనా టీకా ఇవ్వాలి. 2022 జూన్‌ ఆఖ రుకి 70% మందికి వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలి. టీకా సరఫరాలో అవరోధాలను తొలగించాలి.

► కరోనాతో నిలిచిపోయిన అంతర్జాతీయ ప్రయాణాలను తగిన రీతిలో పునఃప్రారంభించాలి.

► కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్‌ కార్మికులకు, అంతర్జాతీయ సంస్థలకు, సైంటిస్టులకు కృతజ్ఞతలు.

► ఆహార భద్రతను సాధించాలి. ప్రజలందరికీ అవసరమైన పౌష్టికాహారం అందించాలి. ఈ విషయంలో ఎవరినీ విస్మరించడానికి వీల్లేదు.  


స్పెయిన్‌ ప్రధాని శాంచెజ్‌తో మోదీ భేటీ
భారత్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో మ రిన్ని పెట్టుబడులు పెట్టాలని స్పెయిన్‌కు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఆయన రోమ్‌లో స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో భేటీ అయ్యారు. పరస్పర ప్రయోజనాలున్న జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు.

ఏంజెలా మెర్కెల్‌తో సమావేశం
ప్రధాని మోదీ రోమ్‌లో జర్మనీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌తోనూ సమావేశమయ్యారు. భారత్‌–జర్మనీ నడుమ ద్వైపాక్షిక సంబంధాలపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు. సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతోనూ మోదీ సమావేశమయ్యారు.   
జి–20 భేటీకి హాజరైన నేతలు ఆదివారం రోమ్‌లోని ప్రముఖ ట్రెవి ఫౌంటెయిన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వీరు తమ భుజాలపై నుంచి నాణేన్ని ఫౌంటెయిన్‌లోకి విసిరారు. ఫౌంటెయిన్‌లో పడేలా నాణెం విసిరిన వారు రోమ్‌కు మరోసారి వస్తారనే నమ్మిక ఉంది. భారత ప్రధాని మోదీతోపాటు నాణేన్ని విసిరిన వారిలో స్పెయిన్‌ ప్రధాని శాంచెజ్, ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్, జర్మనీ ఛాన్సెలర్‌ మెర్కెల్, ఇటలీ ప్రధాని ద్రాఘి ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement