న్యూఢిల్లీ: ప్రపంచమంతా కోవిడ్ వైరస్ గుప్పిట్లో చిక్కుకుపోయిన నేపథ్యంలో ఈ తరహా ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన నియమావళి, విధానాల రూపకల్పనపై దృష్టి సారించాలని జీ–20 దేశాలను ప్రధాని మోదీ కోరారు. ఈ సమ యంలో ఆర్థిక లక్ష్యాలు కాకుండా మానవతా దృక్పథంతో అంతర్జాతీయ సమన్వయం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జీ–20 దేశాల అధినేతలతో ప్రధాని మోదీ ఈ మేరకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వంటి సంస్థల సామర్థ్యాన్ని కూడా పెంచేందుకు కృషి చేయాలని కోరారు. ఈ వైరస్ కారణంగా ఎదురయ్యే ఆర్థిక కష్టాలను, ముఖ్యంగా పేదదేశాల ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు జీ–20 దేశాలు కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సర్వ మానవజాతి శ్రేయస్సు కోసం నూతన ప్రపంచీకరణ అవసరమని పేర్కొంటూ.. వైద్య పరిశోధన ఫలాలు అన్ని దేశాలకు సమానంగా అందే విధంగా ఉండాలన్నారు.
5 ట్రిలియన్ డాలర్లు
కోవిడ్–19పై ప్రపంచదేశాలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా జీ–20 దేశాలు 5 ట్రిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి ఈ నిధులను విడుదల చేస్తామని పేర్కొన్నాయి. సౌదీ అరేబియా రాజు సల్మాన్ అధ్యక్షత వహించిన జీ–20 దేశాల అత్యవసర వీడియోకాన్ఫరెన్స్ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధరల పోరుకు ముగింపు పలకాలని సౌదీ, రష్యాలకు ట్రంప్ సూచించారు. ఈ ఉమ్మడి సంక్షోభంపై ఐక్యంగా పోరాడతామని సమావేశం తర్వాత నేతలు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment