‘థర్డ్‌ వేవ్‌’ ముప్పు నివారిద్దాం.. | PM Narendra Modi to hold virtual meet with CMs to review Covid-19 situation | Sakshi
Sakshi News home page

‘థర్డ్‌ వేవ్‌’ ముప్పు నివారిద్దాం..

Published Sat, Jul 17 2021 4:33 AM | Last Updated on Sat, Jul 17 2021 7:41 AM

PM Narendra Modi to hold virtual meet with CMs to review Covid-19 situation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడం ఆందోళనకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కరోనా థర్డ్‌ వేవ్‌ను నిరోధించడానికి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు సూచించారు. ‘టెస్టు, ట్రాక్, ట్రీట్, టీకా’ అనే వ్యూహంతో ముందుకెళ్లానని పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కరోనా తాజా పరిస్థితిపై సమీక్షించారు.

గత వారం కొత్త పాజిటివ్‌ కేసుల్లో 80 శాతం కేసులు, కరోనా మరణాల్లో 84 శాతం మరణాలు ఈ ఆరు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని ప్రస్తావించారు. మహారాష్ట్ర, కేరళలో కేసులు పెరగడం దేశానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు. దేశంలో కరోనా రెండో వేవ్‌ ప్రారంభం కంటే ముందు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఇలాంటి పరిస్థితే కనిపించిందని వెల్లడించారు. పాజిటివ్‌ కేసుల తీవ్రత అధికంగా రాష్ట్రాలు మూడో వేవ్‌ వచ్చే అవకాశం లేకుండా చురుకైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని ప్రధాని తెలిపారు.

కఠినంగా వ్యవహరించక తప్పదు
కరోనా మహమ్మారి కట్టడి కోసం సూక్ష్మస్థాయి కట్టడి జోన్లపై ప్రత్యేక దృష్టి అవసరమని నరేంద్ర మోదీ అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో జనం గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెంచాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల విషయంలో కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌(ఐసీయూ) పడకలను అందుబాటులోకి తీసుకురావడానికి, కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచడానికి, ఇతర అవసరాల కోసం అన్ని రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.23,000 కోట్ల మేర అత్యవసర కోవిడ్‌–19 ప్యాకేజీని విడుదల చేసిందని మోదీ గుర్తుచేశారు.

పిల్లలను రక్షించుకుందాం..
రాష్ట్రాల్లో వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనలో ఉన్న అంతరాలను పూరించాలని ప్రధాని మోదీ కోరారు. రాష్ట్రాలకు 332 పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు కేటాయించామని, వాటిలో ఇప్పటిదాకా కేవలం 53 పూర్తయ్యాయని, మిగిలిన వాటిని కూడా పూర్తి చేయాలని అన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీనియర్‌ అధికారిని నియమించి, పక్షం రోజుల్లో ప్లాంట్ల ఏర్పాటు పూర్తయ్యేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా వ్యాప్తి నుంచి పిల్లలను రక్షించడానికి కృషి చేయాలన్నారు. ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత రెండు వారాలుగా యూరప్‌ దేశాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయని, అలాగే మనకు తూర్పున ఉన్న బంగ్లాదేశ్, ఇండోనేసియా, థాయ్‌లాండ్, మయన్మార్‌ వంటి దేశాల్లోనూ కేసుల్లో పెరుగుదల నమోదవుతోందని, ఇది ప్రపంచంతోపాటు మనకు కూడా హెచ్చరిక లాంటిదని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ మన మధ్య నుంచి  పూర్తిగా వెళ్లిపోలేదన్న విషయాన్ని ప్రజలకు గుర్తుచేయాలన్నారు. పాజిటివ్‌ కేసుల పెరుగుదల దీర్ఘకాలం కొనసాగితే కరోనా వైరస్‌లో మ్యుటేషన్‌ చోటుచేసుకునే అవకాశాలు సైతం పెరుగుతాయని, తద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని అన్నారు.‘‘మీ విస్తృతమైన అనుభవం కరోనా కట్టడిలో ఎంతగానో ఉపయోగపడుతుందని నేను కచ్చితంగా నమ్ముతున్నా. నేను మీకు అందుబాటులో ఉన్నాను. భవిష్యత్తులోనూ ఉంటాను. తద్వారా మనం కలిసికట్టుగా రాష్ట్రాలను కాపాడుకోవచ్చు. ఈ సంక్షోభం నుంచి మానవాళిని కాపాడుకోవచ్చు’’ అని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.   
వర్చువల్‌ భేటీలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ. చిత్రంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా సీఎంలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement