Chief Ministers Conference
-
‘థర్డ్ వేవ్’ ముప్పు నివారిద్దాం..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ కోవిడ్–19 పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళనకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కరోనా థర్డ్ వేవ్‌ను నిరోధించడానికి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు సూచించారు. ‘టెస్టు, ట్రాక్, ట్రీట్, టీకా’ అనే వ్యూహంతో ముందుకెళ్లానని పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా తాజా పరిస్థితిపై సమీక్షించారు. గత వారం కొత్త పాజిటివ్ కేసుల్లో 80 శాతం కేసులు, కరోనా మరణాల్లో 84 శాతం మరణాలు ఈ ఆరు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని ప్రస్తావించారు. మహారాష్ట్ర, కేరళలో కేసులు పెరగడం దేశానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు. దేశంలో కరోనా రెండో వేవ్ ప్రారంభం కంటే ముందు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఇలాంటి పరిస్థితే కనిపించిందని వెల్లడించారు. పాజిటివ్ కేసుల తీవ్రత అధికంగా రాష్ట్రాలు మూడో వేవ్ వచ్చే అవకాశం లేకుండా చురుకైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని ప్రధాని తెలిపారు. కఠినంగా వ్యవహరించక తప్పదు కరోనా మహమ్మారి కట్టడి కోసం సూక్ష్మస్థాయి కట్టడి జోన్లపై ప్రత్యేక దృష్టి అవసరమని నరేంద్ర మోదీ అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో జనం గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెంచాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల విషయంలో కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ) పడకలను అందుబాటులోకి తీసుకురావడానికి, కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచడానికి, ఇతర అవసరాల కోసం అన్ని రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.23,000 కోట్ల మేర అత్యవసర కోవిడ్–19 ప్యాకేజీని విడుదల చేసిందని మోదీ గుర్తుచేశారు. పిల్లలను రక్షించుకుందాం.. రాష్ట్రాల్లో వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనలో ఉన్న అంతరాలను పూరించాలని ప్రధాని మోదీ కోరారు. రాష్ట్రాలకు 332 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు కేటాయించామని, వాటిలో ఇప్పటిదాకా కేవలం 53 పూర్తయ్యాయని, మిగిలిన వాటిని కూడా పూర్తి చేయాలని అన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీనియర్ అధికారిని నియమించి, పక్షం రోజుల్లో ప్లాంట్ల ఏర్పాటు పూర్తయ్యేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా వ్యాప్తి నుంచి పిల్లలను రక్షించడానికి కృషి చేయాలన్నారు. ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత రెండు వారాలుగా యూరప్ దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని, అలాగే మనకు తూర్పున ఉన్న బంగ్లాదేశ్, ఇండోనేసియా, థాయ్‌లాండ్, మయన్మార్ వంటి దేశాల్లోనూ కేసుల్లో పెరుగుదల నమోదవుతోందని, ఇది ప్రపంచంతోపాటు మనకు కూడా హెచ్చరిక లాంటిదని పేర్కొన్నారు. కరోనా వైరస్ మన మధ్య నుంచి పూర్తిగా వెళ్లిపోలేదన్న విషయాన్ని ప్రజలకు గుర్తుచేయాలన్నారు. పాజిటివ్ కేసుల పెరుగుదల దీర్ఘకాలం కొనసాగితే కరోనా వైరస్‌లో మ్యుటేషన్ చోటుచేసుకునే అవకాశాలు సైతం పెరుగుతాయని, తద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని అన్నారు.‘‘మీ విస్తృతమైన అనుభవం కరోనా కట్టడిలో ఎంతగానో ఉపయోగపడుతుందని నేను కచ్చితంగా నమ్ముతున్నా. నేను మీకు అందుబాటులో ఉన్నాను. భవిష్యత్తులోనూ ఉంటాను. తద్వారా మనం కలిసికట్టుగా రాష్ట్రాలను కాపాడుకోవచ్చు. ఈ సంక్షోభం నుంచి మానవాళిని కాపాడుకోవచ్చు’’ అని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. వర్చువల్ భేటీలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ. చిత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా సీఎంలు -
సీఎంలతో సమావేశం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా బాధితులకు అవసరమైన ప్రాణవాయువు (ఆక్సిజన్) రవాణాలో వేగం పెంచామని, ఇందులో భాగంగా వైమానిక దళం, రైల్వే శాఖ సేవలను ఉపయోగించుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఉన్న 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ కొరతపై ముఖ్యమంత్రుల విజ్ఞప్తులను మోదీ ఆలకించారు. మనమంతా ఒక్కతాటిపైకి వచ్చి కలిసి పని చేస్తే వనరుల కొరత అనే మాటే ఉండదని తేల్చిచెప్పారు. పారిశ్రామిక ఆక్సిజన్‌ను కూడా తక్షణ అవసరాలకు అనుగుణంగా మెడికల్ ఆక్సిజన్‌గా మార్చి, ఆసుపత్రులకు పంపిస్తున్నట్లు గుర్తుచేశారు. అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్ అవసరాలను తీర్చడానికి రాష్ట్రాలు కలిసి పనిచేయాలని, సమన్వయం చేసుకోవాలని ప్రధాని కోరారు. ఆక్సిజన్, అత్యవసర ఔషధాల అక్రమ నిల్వ, బ్లాక్ మార్కెటింగ్‌పై నిఘా పెట్టాలని రాష్ట్రాలకు సూచించారు. ఆక్సిజన్ ట్యాంకర్లు ఎక్కడా ఆగిపోకుండా పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రాల్లో ఆక్సిజన్ సరఫరా తీరును పరిశీలించేందుకు ఉన్నత స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఆక్సిజన్ ట్యాంకర్ల ప్రయాణ సమయాన్ని, ఖాళీ ట్యాంకర్లు వెనక్కి వచ్చే సమయాన్ని తగ్గించడానికి అన్ని అవకాశాలను పరిశీలించి, అమలు చేస్తున్నామన్నారు. ఏమీ చేయలేకపోతున్నా: కేజ్రీవాల్ ఢిల్లీలో కొనసాగుతున్న కరోనా కల్లోలాన్ని సీఎం కేజ్రీవాల్ ప్రధానికి నివేదించారు. ‘‘పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రజలను వారి చావుకు వారిని వదిలేయలేం. ఢిల్లీ ప్రజల తరపున చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. వెంటనే తగిన చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితి మరింత విషమిస్తుంది. కొన్ని రాష్ట్రాల నుంచి ఢిల్లీకి ఆక్సిజన్ రావాల్సి ఉండగా.. ఆ ట్యాంకర్లను ఇతర రాష్ట్రాల్లో ఆపేస్తున్నారు. ఆయా రాష్ట్రాల సీఎంలకు ఒక్క ఫోన్ చేయండి.ఆ వాహనాలను ఆపొద్దని చెప్పండి. ముఖ్యమంత్రి అయి ఉండీ ఏం చేయలేకపోతున్నా. కరోనా నుంచి దేశాన్ని కాపాడేందుకు ఒక జాతీయ ప్రణాళిక ఉండాలి. ఈ ప్రణాళికలో అన్ని ఆక్సిజన్ ప్లాంట్లను ఆర్మీ రక్షణలో ఉంచాలి’’ అని కోరారు. అయితే, ఈ సమావేశానికి సంబంధించి కేజ్రీవాల్ ప్రసంగాన్ని ఢిల్లీ ప్రభుత్వం మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తప్పుపట్టాయి. గతంలో కూడా సమావేశాలు ప్రసారమయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం గుర్తుచేసింది. ఒకవేళ ఇబ్బంది కలిగించి ఉంటే అందుకు విచారం వ్యక్తంచేస్తున్నామని పేర్కొంది. పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆక్సిజన్ అవసరం చాలా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. డిమాండ్‌ను తీర్చడానికి పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయాలని ఆక్సిజన్ ఉత్పత్తిదారులకు విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆక్సిజన్ ఉత్పత్తిదారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. సవాళ్లతో కూడిన ఈ సమయంలో తగిన పరిష్కార మార్గాలను సూచించాలని కోరారు. ప్రభుత్వం, ఆక్సిజన్ ఉత్పత్తిదారుల మధ్య సమన్వయాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో వైద్య అవసరాలను తీర్చడానికి పారిశ్రామిక ఆక్సిజన్‌ను మళ్లించడం గొప్ప పని అని కొనియాడారు. ఆక్సిజన్ సరఫరా కోసం ఇతర వాయువులను రవాణా చేయడానికి ఉద్దేశించిన ట్యాంకర్లను ఉపయోగించుకోవాలన్నారు. ఆక్సిజన్ చేరవేతకు రైల్వేలు, వైమానిక దళం సేవలను ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని గుర్తుచేశారు. ప్రభుత్వం, రాష్ట్రాలు, పరిశ్రమలు, రవాణాదారులు, అన్ని ఆస్పత్రులు ఏకతాటి పైకి వచ్చి కలిసి పని చేయాలన్నారు. -
మైక్రో కంటైన్మెంట్పై దృష్టి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలకు సూచించారు. చిన్న, చిన్న కంటెయిన్మెంట్ జోన్ల వల్ల వైరస్ వ్యాప్తి తగ్గడంతో పాటు, ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలగబోదని వివరించారు. కొన్ని రాష్ట్రాలు ఒకటి, రెండు రోజులు లాక్డౌన్ విధించడాన్ని ప్రస్తావిస్తూ.. ఆ నిర్ణయం ఎంత మేరకు సత్ఫలితాలనిచ్చిందో సమీక్షించాలని కోరారు. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణలో ఇది ఇబ్బందులు సృష్టించిందేమో పరిశీలించమన్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో పంజాబ్, పశ్చిమబెంగాల్ సçహా పలు రాష్ట్రాలు స్థానికంగా కొన్ని రోజుల పాటు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. వైరస్‌తో పోరు సాగిస్తూనే ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని కోరారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు/ ఆరోగ్యశాఖ మంత్రులతో బుధవారం ప్రధాని వర్చువల్‌గా సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలో దసరా, దీపావళి పండుగలు వస్తున్నాయని, ఆ సమయాల్లో కోవిడ్–19 నిబంధనలు సరిగ్గా అమలయ్యేలా చూడాలని ప్రధాని కోరారు. కరోనా మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు జరపడం, అనుమానితులను గుర్తించడం, చికిత్స అందించడం, వ్యాధిపై ప్రజలకు సరైన సమాచారమివ్వడం.. అనే విషయాలపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. లక్షణాలు లేని వారే అధికంగా ఉంటున్నారని, కోవిడ్ వ్యాధిని కొందరు తేలికగా తీసుకుంటున్నారని మోదీ పేర్కొన్నారు. అందువల్ల సరైన, స్పష్టమైన సమాచారం అందించడం వల్ల ప్రజల్లో వ్యాధికి, నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన అపోహలను తొలగించవచ్చని తెలిపారు. తొలి రోజుల్లో అమలు చేసిన లాక్‌డౌన్‌తో మెరుగైన ఫలితాలను సాధించామన్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 700 జిల్లాల్లో.. ఈ ఏడు రాష్ట్రాల్లోని 60 జిల్లాల్లోనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని మోదీ గుర్తు చేశారు. ఈ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లోని అధికారులతో స్వయంగా మాట్లాడి, పరిస్థితిని సమీక్షించేలా వారం రోజుల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో అధికారుల్లో చైతన్యం మరింత పెరుగుతుందన్నారు. పేదలకు ఉచితంగా చికిత్స అందించే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు సెప్టెంబర్ 25 నాటికి రెండేళ్లు పూర్తవుతాయని, ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 1.25 కోట్ల మంది పేద రోగులు లబ్ధి పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పాల్గొన్నారు. దేశవ్యాప్త యాక్టివ్ కేసుల్లో 63% ఈ ఏడు రాష్ట్రాల్లోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. మొత్తం నిర్ధారిత కేసుల్లో 65.5%, మొత్తం మరణాల్లో 77% ఈ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని వెల్లడించారు. -
27న ముఖ్యమంత్రులతో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27వ తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. దేశంలో కరోనా తాజా పరిస్థితి, బాధితులకు అందుతున్న వైద్య సేవలు, రాష్ట్రాల సన్నద్ధత, వైరస్ నియంత్రణ చర్యలు, అన్‌లాక్ 3.0పై చర్చించనున్నట్లు సమాచారం. భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. -
విజన్ 2050 తయారు చేసుకోవాలి
* ప్రణాళికాసంఘం తంతుగా మారింది: చంద్రబాబు * గత పదేళ్లలో దేశంలోని వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయి సాక్షి, న్యూఢిల్లీ: దేశం అభివృద్ధి పథాన ముందుకు సాగాలంటే విజన్-2050ని తయారుచేసుకుని అమలుచేయాలని, తాను కూడా ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రణాళికాసంఘం నామమాత్రంగా.. కేవలం ఒక తంతులా ఉందని.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ముఖ్యమంత్రుల మండలి వ్యవస్థకు తాము మద్దతిస్తున్నామని, సహకరిస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రణాళికాసంఘం భవిష్యత్తుపై ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ముఖ్యమంత్రుల సదస్సులో తాను వివరించిన అంశాలను.. సమావేశం తర్వాత ప్రధాని నివాసం ఎదుట మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వెల్లడించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ప్రణాళికాసంఘానికి దశ, దిశ లేవు.. ‘‘ఈ రోజు ప్రధానమంత్రి నూతన సంప్రదాయానికి తెరతీశారు. దీన్ని మేం స్వాగతిస్తున్నాం. మద్దతిస్తున్నాం. భవిష్యత్తులో సహకరిస్తాం. ప్రణాళికాసంఘం నామమాత్రంగా ఉంది. కేవలం ఒక తంతులా ఉంది. ఏటా ఓసారి పిలవడం, ఒకసారి బడ్జెట్ పెట్టిన తర్వాత, ఒక్కోసారి బడ్జెట్ పెట్టక ముందు పిలవడం.. ఒక పద్ధతి లేకుండా ప్లానింగ్ కమిషన్ పనిచేసేది. ఒక సరైన విధానం గానీ, ఒక దశ దిశ లేవు. ప్రధానమంత్రి సైతం ముఖ్యమంత్రిగా పనిచేసి క్షేత్ర స్థాయి నుంచి వచ్చారు కాబట్టి ఆయనకు కూడా అనుభవం ఉంది. అందుకే దీన్ని సమర్థవంతంగా పనిచేయించాలి, ప్రత్యామ్నాయ వ్యవస్థగా తేవాలని ఆలోచించారు. ఏటా ప్రణాళిక ఉండాలి... గడిచిన పదేళ్లలో దేశంలోని మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టి, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఆర్థికవ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. మన దగ్గర కావాల్సినన్ని మానవవనరులు ఉన్నాయి. సహజ వనరులున్నాయి. అయితే మన వ్యవస్థలో ఉండే లోపాలవల్ల, మన పాలనలో ఉండే లోపాల వల్ల, సరైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల విజన్ లేకుండా ముందుకు పోవడం వల్ల దెబ్బతిన్నాం. నేను చెప్పిన సలహా ఏంటంటే.. విజన్ 2050 తయారు చేసుకోవాలి. మరో 35 ఏళ్లకు భారతదేశానికో విజన్ తయారు చేయాలి. రాబోయే 2050కి భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలి. అందుకోసం ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ప్రతి ఏటా ప్రణాళిక ఉండాలి. దేశంలో ఉండే ఉత్తమ ఆచరణలను, రాష్ట్రంలో ఉండే ఉత్తమ ఆచరణలను, ప్రపంచంలో ఉండే ఉత్తమ ఆచరణలను తీసుకుని టెక్నాలజీని ఉపయోగించుకుని ఒక మంచి పరిపాలన ద్వారా ముందుకు వెళ్లగలిగితే ఇవన్నీ సాధ్యం. పేదరిక నిర్మూలన జరుగుతుంది. ఆర్థిక అసమానత తగ్గించే అవకాశం ఉంటుంది. సరైన పాలసీలు అమలు చేసుకోగలిగితే భారతదేశం ప్రపంచంలో అగ్రదేశాల్లో ఒకటి, రెండో స్థానాల్లో ఉంటుంది. దాంట్లో అనుమానాల్లేవు. ప్రజల కోసం పనిచేయాలి.. ప్రణాళికాసంఘం స్థానంలో ఒక ముఖ్యమంత్రుల మండలి వ్యవస్థను ఏర్పాటు చేసి సబ్‌కమిటీలు, అదేవిధంగా ఒక సెక్రటేరియట్ పెట్టి దీనికి నాంది పలికితే బాగుంటుందని ప్రధానమంత్రి ప్రతిపాదించారు. దీనిలో ఇంకా కొన్ని విధివిధానాలను రూపొందించుకోవాలి. ప్లానింగ్ కరెక్టుగా చేసుకుని అందరూ భాగస్వాములవ్వాలి. రాజకీయాలకంటే అభివృద్ధి, దేశ భవిష్యత్తు ముఖ్యం. మనకు దేశంలో నాలుగు వ్యవస్థలున్నాయి. 1. ఆర్థిక సంఘం, 2. ప్రణాళికాసంఘం, 3. జాతీయ అభివృద్ధి మండలి, 4. అంతర్రాష్ట్ర మండలి. వీటిలో ప్రణాళికాసంఘం ప్రణాళిక రచిస్తుంది. అర్థికసంఘం అవార్డులు ఇస్తుంది. అయితే ఈ రెండింటికి సంబంధం లేదు. సమన్వయం లేదు. అన్ని వ్యవస్థలు సరిగా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇవి కాకుండా దేశంలో కొన్ని సమస్యలు న్నాయి. దేశంలో అందరం పనిచేసేది ఎన్నికల కోసమే. కానీ, ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పాను. కేంద్ర నిధులను రాష్ట్రాలకు ఇవ్వాలి సహకార సమాఖ్య వ్యవస్థలో ఈ రోజు మనం అనుకున్నవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చే కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని అవసరం లేనివి ఉన్నాయి. కొన్నింటికి పరిమితులు ఉన్నాయి. అవసరం మేరకు మంచి కార్యక్రమాలు పెట్టుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. రెండో అంశం కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే పథకాలు తగ్గించి, ఆ నిధులన్నీ ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రాలకు బదలాయిస్తే మంచి ఫలితాలొస్తాయి.’’ ఇదిలావుంటే.. ప్రధానమంత్రి మోదీతో సమావేశంలో తాను ఏమీ మాట్లాడలేదని.. చివర్లో రెండు నిమిషాలు కలిసినప్పుడు రాష్ట్ర రాజధాని విషయాన్ని చెప్పానని చంద్రబాబు పేర్కొన్నారు. ‘మీరు, కేసీఆర్ గారు ఏవైనా విషయాలు చర్చించారా?’ అన్న విలేకరుల ప్రశ్నకు.. ‘‘భోజనం దగ్గర కూర్చున్నాం. అక్కడ వేరే విషయాలు ఎందుకొస్తాయి..? భోజనం దగ్గర భోజనం విషయాలే ఉంటాయి...’’ అని ఆయన బదులిచ్చారు.