రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మైక్రో కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలకు సూచించారు. చిన్న, చిన్న కంటెయిన్‌మెంట్ జోన్ల వల్ల వైరస్ వ్యాప్తి తగ్గడంతో పాటు, ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలగబోదని వివరించారు. కొన్ని రాష్ట్రాలు ఒకటి, రెండు రోజులు లాక్‌డౌన్ విధించడాన్ని ప్రస్తావిస్తూ.. ఆ నిర్ణయం ఎంత మేరకు సత్ఫలితాలనిచ్చిందో సమీక్షించాలని కోరారు. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణలో ఇది ఇబ్బందులు సృష్టించిందేమో పరిశీలించమన్నారు.
వైరస్ వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో పంజాబ్, పశ్చిమబెంగాల్ సçహా పలు రాష్ట్రాలు స్థానికంగా కొన్ని రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. వైరస్‌తో పోరు సాగిస్తూనే ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని కోరారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు/ ఆరోగ్యశాఖ మంత్రులతో బుధవారం ప్రధాని వర్చువల్‌గా సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలో దసరా, దీపావళి పండుగలు వస్తున్నాయని, ఆ సమయాల్లో కోవిడ్–19 నిబంధనలు సరిగ్గా అమలయ్యేలా చూడాలని ప్రధాని కోరారు.
కరోనా మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు జరపడం, అనుమానితులను గుర్తించడం, చికిత్స అందించడం, వ్యాధిపై ప్రజలకు సరైన సమాచారమివ్వడం.. అనే విషయాలపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. లక్షణాలు లేని వారే అధికంగా ఉంటున్నారని, కోవిడ్ వ్యాధిని కొందరు తేలికగా తీసుకుంటున్నారని మోదీ పేర్కొన్నారు. అందువల్ల సరైన, స్పష్టమైన సమాచారం అందించడం వల్ల ప్రజల్లో వ్యాధికి, నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన అపోహలను తొలగించవచ్చని తెలిపారు.
తొలి రోజుల్లో అమలు చేసిన లాక్‌డౌన్‌తో మెరుగైన ఫలితాలను సాధించామన్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 700 జిల్లాల్లో.. ఈ ఏడు రాష్ట్రాల్లోని 60 జిల్లాల్లోనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని మోదీ గుర్తు చేశారు. ఈ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లోని అధికారులతో స్వయంగా మాట్లాడి, పరిస్థితిని సమీక్షించేలా వారం రోజుల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో అధికారుల్లో చైతన్యం మరింత పెరుగుతుందన్నారు.
పేదలకు ఉచితంగా చికిత్స అందించే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు సెప్టెంబర్ 25 నాటికి రెండేళ్లు పూర్తవుతాయని, ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 1.25 కోట్ల మంది పేద రోగులు లబ్ధి పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పాల్గొన్నారు. దేశవ్యాప్త యాక్టివ్ కేసుల్లో 63% ఈ ఏడు రాష్ట్రాల్లోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. మొత్తం నిర్ధారిత కేసుల్లో 65.5%, మొత్తం మరణాల్లో 77% ఈ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment