విజన్ 2050 తయారు చేసుకోవాలి
* ప్రణాళికాసంఘం తంతుగా మారింది: చంద్రబాబు
* గత పదేళ్లలో దేశంలోని వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయి
సాక్షి, న్యూఢిల్లీ: దేశం అభివృద్ధి పథాన ముందుకు సాగాలంటే విజన్-2050ని తయారుచేసుకుని అమలుచేయాలని, తాను కూడా ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రణాళికాసంఘం నామమాత్రంగా.. కేవలం ఒక తంతులా ఉందని.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ముఖ్యమంత్రుల మండలి వ్యవస్థకు తాము మద్దతిస్తున్నామని, సహకరిస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రణాళికాసంఘం భవిష్యత్తుపై ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ముఖ్యమంత్రుల సదస్సులో తాను వివరించిన అంశాలను.. సమావేశం తర్వాత ప్రధాని నివాసం ఎదుట మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వెల్లడించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
ప్రణాళికాసంఘానికి దశ, దిశ లేవు..
‘‘ఈ రోజు ప్రధానమంత్రి నూతన సంప్రదాయానికి తెరతీశారు. దీన్ని మేం స్వాగతిస్తున్నాం. మద్దతిస్తున్నాం. భవిష్యత్తులో సహకరిస్తాం. ప్రణాళికాసంఘం నామమాత్రంగా ఉంది. కేవలం ఒక తంతులా ఉంది. ఏటా ఓసారి పిలవడం, ఒకసారి బడ్జెట్ పెట్టిన తర్వాత, ఒక్కోసారి బడ్జెట్ పెట్టక ముందు పిలవడం.. ఒక పద్ధతి లేకుండా ప్లానింగ్ కమిషన్ పనిచేసేది. ఒక సరైన విధానం గానీ, ఒక దశ దిశ లేవు. ప్రధానమంత్రి సైతం ముఖ్యమంత్రిగా పనిచేసి క్షేత్ర స్థాయి నుంచి వచ్చారు కాబట్టి ఆయనకు కూడా అనుభవం ఉంది. అందుకే దీన్ని సమర్థవంతంగా పనిచేయించాలి, ప్రత్యామ్నాయ వ్యవస్థగా తేవాలని ఆలోచించారు.
ఏటా ప్రణాళిక ఉండాలి...
గడిచిన పదేళ్లలో దేశంలోని మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టి, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఆర్థికవ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. మన దగ్గర కావాల్సినన్ని మానవవనరులు ఉన్నాయి. సహజ వనరులున్నాయి. అయితే మన వ్యవస్థలో ఉండే లోపాలవల్ల, మన పాలనలో ఉండే లోపాల వల్ల, సరైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల విజన్ లేకుండా ముందుకు పోవడం వల్ల దెబ్బతిన్నాం. నేను చెప్పిన సలహా ఏంటంటే.. విజన్ 2050 తయారు చేసుకోవాలి. మరో 35 ఏళ్లకు భారతదేశానికో విజన్ తయారు చేయాలి. రాబోయే 2050కి భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలి. అందుకోసం ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ప్రతి ఏటా ప్రణాళిక ఉండాలి. దేశంలో ఉండే ఉత్తమ ఆచరణలను, రాష్ట్రంలో ఉండే ఉత్తమ ఆచరణలను, ప్రపంచంలో ఉండే ఉత్తమ ఆచరణలను తీసుకుని టెక్నాలజీని ఉపయోగించుకుని ఒక మంచి పరిపాలన ద్వారా ముందుకు వెళ్లగలిగితే ఇవన్నీ సాధ్యం. పేదరిక నిర్మూలన జరుగుతుంది. ఆర్థిక అసమానత తగ్గించే అవకాశం ఉంటుంది. సరైన పాలసీలు అమలు చేసుకోగలిగితే భారతదేశం ప్రపంచంలో అగ్రదేశాల్లో ఒకటి, రెండో స్థానాల్లో ఉంటుంది. దాంట్లో అనుమానాల్లేవు.
ప్రజల కోసం పనిచేయాలి..
ప్రణాళికాసంఘం స్థానంలో ఒక ముఖ్యమంత్రుల మండలి వ్యవస్థను ఏర్పాటు చేసి సబ్‌కమిటీలు, అదేవిధంగా ఒక సెక్రటేరియట్ పెట్టి దీనికి నాంది పలికితే బాగుంటుందని ప్రధానమంత్రి ప్రతిపాదించారు. దీనిలో ఇంకా కొన్ని విధివిధానాలను రూపొందించుకోవాలి. ప్లానింగ్ కరెక్టుగా చేసుకుని అందరూ భాగస్వాములవ్వాలి. రాజకీయాలకంటే అభివృద్ధి, దేశ భవిష్యత్తు ముఖ్యం. మనకు దేశంలో నాలుగు వ్యవస్థలున్నాయి. 1. ఆర్థిక సంఘం, 2. ప్రణాళికాసంఘం, 3. జాతీయ అభివృద్ధి మండలి, 4. అంతర్రాష్ట్ర మండలి. వీటిలో ప్రణాళికాసంఘం ప్రణాళిక రచిస్తుంది. అర్థికసంఘం అవార్డులు ఇస్తుంది. అయితే ఈ రెండింటికి సంబంధం లేదు. సమన్వయం లేదు. అన్ని వ్యవస్థలు సరిగా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇవి కాకుండా దేశంలో కొన్ని సమస్యలు న్నాయి. దేశంలో అందరం పనిచేసేది ఎన్నికల కోసమే. కానీ, ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పాను.
కేంద్ర నిధులను రాష్ట్రాలకు ఇవ్వాలి
సహకార సమాఖ్య వ్యవస్థలో ఈ రోజు మనం అనుకున్నవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చే కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని అవసరం లేనివి ఉన్నాయి. కొన్నింటికి పరిమితులు ఉన్నాయి. అవసరం మేరకు మంచి కార్యక్రమాలు పెట్టుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. రెండో అంశం కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే పథకాలు తగ్గించి, ఆ నిధులన్నీ ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రాలకు బదలాయిస్తే మంచి ఫలితాలొస్తాయి.’’
ఇదిలావుంటే.. ప్రధానమంత్రి మోదీతో సమావేశంలో తాను ఏమీ మాట్లాడలేదని.. చివర్లో రెండు నిమిషాలు కలిసినప్పుడు రాష్ట్ర రాజధాని విషయాన్ని చెప్పానని చంద్రబాబు పేర్కొన్నారు. ‘మీరు, కేసీఆర్ గారు ఏవైనా విషయాలు చర్చించారా?’ అన్న విలేకరుల ప్రశ్నకు.. ‘‘భోజనం దగ్గర కూర్చున్నాం. అక్కడ వేరే విషయాలు ఎందుకొస్తాయి..? భోజనం దగ్గర భోజనం విషయాలే ఉంటాయి...’’ అని ఆయన బదులిచ్చారు.