Thermal power projects
-
2050 నాటికి కర్బన ఉద్గారాల తటస్థీకరణ
రోమ్: భూగోళంపై జీవజాలం మనుగడకు పెనుముప్పుగా పరిణమిస్తున్న వాతావరణ మార్పుల పట్ల జి–20 దేశాల అధినేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ కాలుష్యం పెరగడంతోపాటు భూమి వేడెక్కడానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలను 2050 నాటికి సున్నా స్థాయికి తీసుకురావాలని తీర్మానించారు. కర్బన ఉద్గారాల తటస్థీకరణ కచ్చితంగా సాధించాలని నిర్ణయానికొచ్చారు. అంతేకాకుండా విదేశాల్లో బొగ్గు ఆధారిత(థర్మల్) విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు ఇకపై ఎలాంటి ఆర్థిక సాయం అందించరాదని ప్రతిన బూనారు. కోవిడ్–19 మహమ్మారిపై పోరాటంలో వ్యాక్సిన్లే అతిపెద్ద ఆయుధాలని అంగీకరించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సిన్ల పంపిణీని పెంచడానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇటలీ రాజధాని రోమ్‌లో రెండు రోజులపాటు జరిగిన జి–20 శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. సదస్సులో పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఈ తీర్మానాల గురించి వివరిస్తూ ‘రోమ్ డిక్లరేషన్’ జారీ చేశారు. అవేమిటంటే... ► బొగ్గును మండించి, విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండడంతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీని అడ్డుకోవడానికి విదేశాల్లో థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు రుణ సాయంనిలిపివేయాలి. కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిరుత్సాహపర్చాలి. ఈ ఏడాది ఆఖరి నుంచే దీన్ని అమల్లోకి తీసుకురావాలి. చైనా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలు ఇప్పటికే ఈ తరహా తీర్మానాలు చేసుకున్నాయి. అయితే, సొంత దేశాల్లో బొగ్గు వాడకం తగ్గించుకోవడంపై జి–20 నేతలు లక్ష్యాలను నిర్దేశించుకోలేదు. ► వాతావరణ మార్పుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద దేశాలకు సాయం చేయడానికి గతంలోనే అంగీకరించినట్లుగా ధనిక దేశాలు ప్రతిఏటా 100 బిలియన్ డాలర్లు సమీకరించాలి. పేద దేశాలకు రుణ సాయాన్ని పెంచాలి. ► కర్బన తటస్థీకరణ లేదా ‘నెట్ జీరో’ ఉద్గారాల లక్ష్య సాధనకు అందరూ కట్టుబడి ఉండాలి. ఈ శతాబ్ధి మధ్య నాటికి..అంటే 2050 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలి. వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు, వాతావరణం నుంచి తొలగించే ఉద్గారాల మధ్య సమతూకం ఉండడమే కర్బన తటస్థీకరణ. అంటే ఏ మేరకు ఉద్గారాలు విడుదలవుతాయో అంతేస్థాయిలో వాటిని వాతావరణం నుంచి తొలగించాలి. ► 2021 ఆఖరుకల్లా ప్రపంచంలో కనీసం 40% మందికి కరోనా టీకా ఇవ్వాలి. 2022 జూన్ ఆఖ రుకి 70% మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి. టీకా సరఫరాలో అవరోధాలను తొలగించాలి. ► కరోనాతో నిలిచిపోయిన అంతర్జాతీయ ప్రయాణాలను తగిన రీతిలో పునఃప్రారంభించాలి. ► కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ కార్మికులకు, అంతర్జాతీయ సంస్థలకు, సైంటిస్టులకు కృతజ్ఞతలు. ► ఆహార భద్రతను సాధించాలి. ప్రజలందరికీ అవసరమైన పౌష్టికాహారం అందించాలి. ఈ విషయంలో ఎవరినీ విస్మరించడానికి వీల్లేదు. స్పెయిన్ ప్రధాని శాంచెజ్‌తో మోదీ భేటీ భారత్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో మ రిన్ని పెట్టుబడులు పెట్టాలని స్పెయిన్‌కు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఆయన రోమ్‌లో స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో భేటీ అయ్యారు. పరస్పర ప్రయోజనాలున్న జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఏంజెలా మెర్కెల్‌తో సమావేశం ప్రధాని మోదీ రోమ్‌లో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తోనూ సమావేశమయ్యారు. భారత్–జర్మనీ నడుమ ద్వైపాక్షిక సంబంధాలపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు. సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతోనూ మోదీ సమావేశమయ్యారు. జి–20 భేటీకి హాజరైన నేతలు ఆదివారం రోమ్‌లోని ప్రముఖ ట్రెవి ఫౌంటెయిన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వీరు తమ భుజాలపై నుంచి నాణేన్ని ఫౌంటెయిన్లోకి విసిరారు. ఫౌంటెయిన్‌లో పడేలా నాణెం విసిరిన వారు రోమ్కు మరోసారి వస్తారనే నమ్మిక ఉంది. భారత ప్రధాని మోదీతోపాటు నాణేన్ని విసిరిన వారిలో స్పెయిన్ ప్రధాని శాంచెజ్, ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్, జర్మనీ ఛాన్సెలర్ మెర్కెల్, ఇటలీ ప్రధాని ద్రాఘి ఉన్నారు. -
‘థర్మల్’ సాక్షిగా.. నం.1 దోపిడీ
-
‘థర్మల్’ సాక్షిగా.. నం.1 దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ఇల్లు కట్టుకోవాలనుకున్నపుడు ఏం చేస్తాం? ఫలానా చోట అంత తక్కువ రేటుకు చేశారు.. అక్కడ ఇంత తక్కువకు ఈ పనిచేశారు అంటూ ఏకరువు పెట్టి మేిస్త్రీలతో బేరాలాడతాం. మనం పెట్టిన కండిషన్ల మేరకు ఎవరు తక్కువకు చేస్తానంటే వారికి కాంట్రాక్టు అప్పగిస్తాం. కానీ చంద్రబాబునాయుడు మాత్రం కాస్త డిఫరెంట్. ప్రజాధనం ఎంత వృథా అయిపోతున్నా ఆయన బేఫికర్... అస్సలు అవసరమే లేని ప్రాజెక్టులను చేపట్టడం ఆయన స్టయిల్. ప్రభుత్వరంగ సంస్థలు తక్కువకు చేస్తున్నా కాదని ప్రైవేటు కంపెనీలకు పనులు అప్పగించడం ఆయనకు మహా ఇష్టం.దేశంలో ఎక్కడా లేని ధరలను కోట్ చేసినా కళ్లు మూసుకుని ఖరారు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. అవసరమైతే కాంట్రాక్టును ప్యాకేజీలుగా విడగొట్టి మరీ ప్రైవేటు కంపెనీలకు ప్రయోజనం చేకూర్చడంలో ఆయన్ను మించినవారు లేరంటారు. పొరుగు రాష్ట్రాలలో తక్కువకే పనులు జరుగుతున్నా బాబు అస్సలు పట్టించుకోరు. రాష్ర్టంలో ఇటీవల ఖరారు చేసిన రెండు థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. రెండు ప్రాజెక్టులలో కలిపి ప్రైవేటు కంపెనీలకు దోచిపెడుతున్న ప్రజాధనం రూ. 2,392 కోట్లు. అందులో చేతులు మారిన ముడుపులు రూ. 1,150 కోట్లు పైమాటే.. ఈ వ్యవహారాన్ని కాస్త పరిశీలిస్తే నిర్ఘాంతపోయే వాస్తవాలు కళ్లకు కడుతున్నాయి. అవేమిటో చూద్దాం.... అవసరమే లేని ఆ రెండు ప్రాజెక్టులు.. రాష్ట్రంలో గడచిన రెండేళ్ళలో విద్యుత్ డిమాండ్ ఏమాత్రం పెరగలేదు. ఉన్న థర్మల్ ప్రాజెక్టుల్లోనే తరచూ ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కొత్తగా కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నంలో ఒక్కొక్కటీ 800 మెగావాట్ల సామర్థ్యంతో కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నంలలో రెండు థర్మల్ ప్లాంట్లు నిర్మించాలని రాష్ర్ట ప్రభుత్వం తలపెట్టింది. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే తరహా ప్రాజెక్టులను చేపడుతున్నాయి. అయితే అవన్నీ నిర్దిష్టమైన ప్రమాణాలతో కాంట్రాక్టులు అప్పగిస్తున్నాయి. సాధ్యమైనంత వరకూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌కే పనులు ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ కూడా థర్మల్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. కేవలం రెండు ప్రైవేటు కంపెనీలకు కాంట్రాక్టులు అప్పగించాలని ముందే నిర్ణయించుకుంది. వాళ్ళే అర్హత పొందేలా నిబంధనలు పెట్టింది. ఈనెల 6న కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం టెండర్లు ఖరారుచేశారు. కృష్ణపట్నంలో టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఇబ్రహీంపట్నంలో బీజీఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ లకు కాంట్రాక్టులు దక్కాయి. దోపిడీ కోసమే ప్యాకేజీల విభజన మిగతా రాష్ట్రాలన్నీ ఇదే తరహా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా... అవి మాత్రం ఒకే ప్యాకేజీ కింద టెండర్లు పిలిచాయి. ఏపీ మాత్రం ఒకే ప్రాజెక్టును బీటీజీ (బాయిలర్, టర్బైన్, జనరేటర్), బీవోపీ (బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్)లు అంటూ రెండు ప్యాకేజీలుగా విడగొట్టింది. బీటీజీలో యంత్ర పరికరాలే ఉంటాయి. ఇవన్నీ కొనుగోలు చేసేవే. వాటికి నిర్దిష్టమైన ధరలు ఉంటాయి. దోచుకోవడానికి ఇందులో పెద్దగా అవకాశం ఉండదు. అందుకే ఈ పనులను ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్కు అప్పగించింది. ఇక బీవోపీ కాంట్రాక్టుల విషయంలో మాత్రం ఏలినవారు మనవారైతే అందినంత దోచుకునేందుకు అవకాశముంటుంది. అందుకే రాష్ర్టప్రభుత్వం ముడుపులిచ్చే వారికే కాంట్రాక్టులు అప్పగించేలా చేసిందన్న విమర్శలున్నాయి. వారికి పోటీ రాకుండా అర్హత నిబంధనలు రూపొందించడం చూస్తే అది నిజమేననిపిస్తుంది. రెండు థర్మల్ ప్రాజెక్టులు నిర్మించిన అనుభవం ఉండాలని, ఇందులో ఒకటి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించి ఉండాలంటూ ఎన్టీపీసీలో కూడా లేని రూల్స్ పెట్టింది. అలాంటి అర్హతా నిబంధనల వల్లే కృష్ణపట్నంలో టాటా, ఇబ్రహీంపట్నంలో బీజీఆర్‌లకు కాంట్రాక్టులు దక్కాయి. పోటీ లేకపోవడంతో ఈ రెండు సంస్థలు చాలా ఎక్కువ మొత్తం కోట్ చేశాయి. జెన్కో నియమించిన కన్సల్టెన్సీ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఏ రాష్ట్రంలోనూ లేనంత ఎక్కువ! టాటా, బీజీఆర్ కంపెనీలు కోట్ చేసిన ధరలు ఏ రాష్ట్రంలోనూ కన్పించడం లేదు. 2014 నుంచి ఇప్పటి వరకూ మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్రలో పలు చోట్ల థర్మల్ ప్రాజెక్టుల కాంట్రాక్టులను ఖరారు చేశారు. ఏపీ కాంట్రాక్టులకు, వీటికి ఎక్కడా పోలిక కన్పించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగూడెం, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులను 800 మెగావాట్ల సామర్థ్యంతో చేపడుతోంది. ఆ రాష్ట్రం ఒకే ప్యాకేజీగా (బీటీజీ, బీవోపీ కలిపే) టెండర్లు పిలిచింది. కొత్తగూడెం కాంట్రాక్టును మెగావాట్ రూ. 4.76 కోట్ల చొప్పున ఇచ్చింది. యాదాద్రిలో చేపట్టే 800 మెగావాట్ల సామర్థ్యం గల ఐదు ప్లాంట్ల పనుల కాంట్రాక్టు మెగావాట్‌కు రూ. 4.48 కోట్లకు చేపట్టేందుకు బీహెచ్ఈఎల్ ముందుకొచ్చింది. జార్ఖండ్‌లోని ఖరాన్పుర వద్ద ఎన్టీపీసీ చేపట్టే 660 మెగావాట్ల సామర్థ్యం గల మూడు థర్మల్ ప్రాజెక్టు పనులను బీఈహెచ్ఈఎల్కు మెగావాట్ రూ. 3.97 కోట్లకే కాంట్రాక్టు ఇచ్చింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన థర్మల్ ప్రాజెక్టుల కాంట్రాక్టులకు భారీ వ్యత్యాసం కన్పిస్తోంది. కృష్ణపట్నంలో బీటీజీ ప్యాకేజీ పనులను బీహెచ్ఈఎల్కు మెగావాట్‌కు రూ. 2.88 కోట్లకు ఇచ్చారు. ఇక్కడ బీవోపీ కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు రూ. 3.32 కోట్లకు ఇచ్చారు. ఈ రెండూ కలిపితే కృష్ణపట్నం ప్రాజెక్టు కాంట్రాక్టు మెగావాట్‌కు రూ. 6.20 కోట్లకు చేరింది. ఇబ్రహీంపట్నంలో బీటీజీ కాంట్రాక్టును బీహెచ్ఈఎల్కు మెగావాట్‌కు 2.88 కోట్లకు, బీవోపీ కాంట్రాక్టును బీజీఆర్ ఎనర్జీ సంస్థకు మెగావాట్‌కు 2.87 కోట్లకు ఇచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టు మెగావాట్‌కు 5.75 కోట్లకు చేరింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువని ఈ మొత్తాలు చూస్తే అర్థమౌతుంది. ఒకే కంపెనీ... రెండు ధరలు.. ఏపీలోని ఇబ్రహీంపట్నం థర్మల్ (800 మెగావాట్ల) కాంట్రాక్టుకు బీజీఆర్ సంస్థ రూ. 2,307 కోట్లు కోట్ చేసింది. అంటే మెగావాట్‌కు రూ. 2.88 కోట్లు (బీవోపీ ప్యాకేజీ). ఇదే సంస్థ మధ్యప్రదేశ్‌లోని బరేతీలో ఎన్టీపీసీ చేపట్టిన థర్మల్ ప్రాజెక్టు (660 మెగావాట్తో నాలుగు ప్లాంట్లు = 2,640 మె.వా) బీవోపీ కాంట్రాక్టును గత ఏడాది ఆగస్టు 14న రూ. 2,196 కోట్లతో టెండర్ దక్కించుకుంది. అంటే మెగావాట్‌కు రూ. 83 లక్షలు అన్న మాట. మధ్యప్రదేశ్‌లో టెండర్ ఖరారు అయిన కేవలం ఐదు నెలల్లోనే (4-12-2015) ఒకే తరహా పనికి దాదాపు రూ. 2కోట్లు ఎక్కువ కోట్ చేసింది. (బరేతీలో మెగావాట్ రూ. 83 లక్షలు... ఏపీలోని ఇబ్రహీంపట్నంలో రూ. 2.88కోట్లు). ఇంత వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తున్నా ఏపీ సర్కారు కావాలని విస్మరించినట్లు అర్ధమౌతోంది. దీన్ని బట్టి చూస్తే ముడుపుల మహిమ ఎలా పనిచేసిందో అర్ధం చేసుకోవచ్చు. -
నేలటూరు తరలింపు పగటికలే!
ముత్తుకూరు : మండలంలో ఏపీ జెన్కో థర్మల్ ప్రాజెక్టు, టీపీసీఐఎల్ థర్మల్ ప్రాజెక్టులకు అతి చేరువలో ఉన్న నేలటూరు పంచాయతీ తరలింపు పగటికలగా మారింది. బూడిద బావులకు సైతం అతి సమీపంలో ఉన్న ఈ పంచాయతీని తరలించాలని 20 నెలలుగా సర్కారు చేస్తున్న ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేదు. ముత్తుకూరు : థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర అవసరాలకు నేలటూరు పంచాయతీలో సుమారు మూడు వేల ఎకరాలు సేకరించారు. నేలటూరులో 263, దళితవాడలో 200, పట్టపుపాళెంలో 386 కలిపి మొత్తం 849 కుటుంబాలున్నాయి. ఈ భూముల సేకరణ వల్ల వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే పేద కుటుంబాలు జీవనోపాధి కోల్పోయాయి. తీరంలో కన్వేయర్ బెల్టులు, సీవాటర్ పంప్‌హౌస్‌ల నిర్మాణం వల్ల సముద్రంలో మత్స్యసంపద కరువై మత్స్యకారులు వేటకు దూరమయ్యారు. ప్రాజెక్టులు ఏర్పాటైనా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మృగ్యమయ్యాయి. తాగునీటికి కొరత ఏర్పడింది. పశువుల మేత దుర్లభం అయింది. భూగర్భ జలాలు పాడయ్యాయి. దీనికితోడు కాలుష్య ప్రమాదం, అంతుబట్టని శబ్దాలు, అంటువ్యాధుల మూలాన ఏడాది నుంచి పంచాయతీ తరలింపుపై స్థానికుల ఆందోళన తీవ్రతరం అయింది. అమలుకాని ప్రతిపాదనలు: గ్రామస్తుల ఆందోళనల ఫలితంగా 10 నెలల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ నేలటూరు, పట్టపుపాళెం, దళితవాడలో సభలు నిర్వహించారు. తరలివెళ్లేందుకు గ్రామస్తుల ఆమోదం తీసుకున్నారు. దీనికి ఎన్ఎన్సీ, టీపీసీఐఎల్, ఏపీజెన్కో, రిలయన్స్ విద్యుత్ ప్రాజెక్టుల ఆర్ధికసాయంతో సురక్షిత భూముల సేకరణ, కాలనీల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం పంచాయతీ అంతా సర్వేలు సాగాయి. సురక్షిత ప్రాంతాలను సూచిస్తూ గ్రామస్తులు వినతిపత్రాలు కూడా అందజేశారు. శ్రీకాంత్ స్థానంలో వచ్చిన కలెక్టర్ జానకి కూడా నాలుగు నెలల క్రితం గ్రామసభలు నిర్వహించారు. అయితే పంచాయతీ తరలింపు మాత్రం స్పష్టమైన రూపానికి రాలేదు. పట్టపుపాళెం తరలింపు కోసం తోటపల్లిగూడూరు మండలంలోని కోడూరు తీరంలో అప్పటి జేసీ రేఖారాణి రూ.కోట్లు ఖర్చు చేసి భూములు కొనుగోలు చేశారు. ఏకపక్షంగా సేకరించిన ఈ భూములు అనువైనవి కావంటూ మత్స్యకారులు నిరాకరించారు. ఫలితంగా దీనికైన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారింది. పంచాయతీ తరలింపు కోసం మొదటి విడతగా తమ వాటా కింద ఏపీ జెన్కో, టీపీసీఐఎల్, ఎన్ సీపీ పవర్ ప్రాజెక్టులో కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి డిపాజిట్ చేశాయి. మరో వైపు టీపీసీఐఎల్ ప్రాజెక్టుకు సేకరించిన భూములకు ఇంకా పరిహారం రాలేదంటూ పైనాపురం పేదలు నిరంతరం ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆందోళన కలిగిస్తున కాలుష్యం: -చీకిరి నరసింహ, దళితవాడ, నేలటూరు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు వల్ల కొందరు పెద్దలు మాత్రమే బాగుపడ్డారు. వందలాది పేద కుటుంబాలు అన్యాయమైపోయాయి. కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. అంటువ్యాధులతో అల్లాడుతున్నాం. గ్రామాన్ని తరలిస్తామని సభలు పెట్టిన అధికారులు ఇప్పుడు పూర్తిగా మరిచిపోయారు. వెంటనే తరలింపు ప్రక్రియ వేగవంతం చేయాలి. పంచాయతీని తరలించాల్సిందే: -ఈపూరు శేషారెడ్డి, సర్పంచ్, నేలటూరు నేలటూరు పంచాయతీని ఎట్టి పరిస్థితుల్లోను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందే. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం అధికమవుతోంది. వ్యాధులు ప్రబలుతున్నట్టు పేదలు ఆందోళన చెందుతున్నారు. యువతకు ఉద్యోగాలు లభించలేదు. చెంతనే ఉన్న యాష్‌పాండ్ వల్ల భూగర్భ జలాలు కలుషితం కానున్నాయి. గ్రామం విడిచిపెట్టి వెళ్లే సురక్షిత ప్రాంతాలను అధికారులకు సూచిం చాం. ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు. పునరావాసానికి భూముల సేకరణ నేలటూరు పంచాయతీని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన భూసేకరణ జరుగుతోందని మండల రెవెన్యూ అధికారులు చెప్పారు. ధనలక్ష్మీపురం వద్ద 30 ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నారు. మాదరాజుగూడూరు వద్ద 30 ఎకరాలు సేకరిస్తున్నారు. తోటపల్లిగూడూరు మండలంలోని కోడూరు వద్ద కూడా 25 ఎకరాలు సేకరిస్తున్నాని తెలిపారు. -
విద్యుత్ మణిహారాలా? మృత్యుపాశాలా?
పాత ప్రభుత్వాల బాటలోనే ప్రకృతి వినాశకరమైన అవే ఇంధన, అభివృద్ధి నమూనాలతో బంగారు తెలంగాణ అసాధ్యం. ప్రపంచమంతా ‘‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ’’ అంటుండగా కాలుష్య కాల సర్పాల్లాంటి థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపన అనాలోచితం. పర్యావరణ అనుకూల విద్యుదుత్పత్తి తప్ప మానవాళికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ‘‘అనంత శక్తి వనరులున్నా యనే ప్రాతిపదికపై అంతులేని వృద్ధితో అందరికీ న్యాయం జరుగుతుందనే ఊహతో మనమీ ప్రపంచాన్ని నిర్మించు కున్నాం. వాస్తవంలోనూ, కలలోనూ కూడా అది ఇక లేదు. మనం మరో భిన్న ప్రపంచాన్ని నిర్మించు కోవాల్సిందే. ఇంత పెద్ద మానవ సమాజాన్ని భరి స్తున్న ప్రపంచం ఇక మిగలదు.’’ -రాబర్ట్ జెన్సన్. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 135 ఏళ్ల క్రితం, 1885లో ప్రపంచ ఉష్ణోగ్రతలను నమోదు చేయడం ప్రారంభమైనప్పటి నుండి ఇదే అత్యధిక స్థాయి. కర్బన ఉద్గారాల విడుదల విపరీతంగా పెరిగి భూతాపం పెరుగుతుండటం వల్ల కలుగుతున్న విపరిణామాల్లో ఇది ఒకటి. ఇటీవల అత్యంత ఉపద్రవకరంగా కాశ్మీర్‌ను ముంచెత్తిన వరదలు, వేలాది మందిని బలిగొన్న ఉత్తరాంచల్ పెను ఉత్పాతం, తాజాగా ఉత్తరాంధ్ర, విశాఖ నగరాలను ధ్వంసించిన హుద్ హుద్ రక్క సులే కాదు, ఫిలిప్పీన్స్‌లో విలయం సృష్టించిన హైయాన్ ఉప్పెన సైతం వాతావరణ మార్పుల ఫలితాలే. రుతువులు గతులు తప్పుతుండగా అకాల వర్షాలు, వరదలు, దుర్భిక్ష క్షామ పరిస్థితులు సర్వసాధారణం అయ్యాయి. అందుకే తెలంగాణ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కరువు తాండవ మాడుతోంది. అన్నదాతల ఆత్మహత్యలు ఆగకుండా సాగుతున్నాయి. ఈ నేపథ్యం నుండి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొరతను అధిగమించడం కోసం గోదావరికి ఇరువేపులా ‘‘విద్యుత్ మణిహారాల’’ లా బొగ్గు ఆధారిత భారీ థర్మల్ కేంద్రాలను నిర్మిం చాలని తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించడం అవసరం. రాష్ట్రం ఇప్పుడున్న, ప్రతి పాదిస్తున్న ఎత్తిపోతల సాగునీటి పథకాలకు సంబంధించి 8 వేల మెగావాట్ల విద్యుత్ లోటును ఎదుర్కొంటోంది. అన్ని రకాల సాగునీటి అవసరాలను కలుపుకుంటే అది 12 వేల మెగా వాట్లు. ఒక్క ప్రాణహిత ఎత్తిపోతల పథకానికే 3,466 మెగావాట్లు అవసరం. దానికి జాతీయ హోదా లభిస్తే తప్ప ప్రభుత్వానికి అది గుదిబండ కాక తప్పదు. దురదృష్టవశాత్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొ నడానికి ప్రపంచ మంతా వినాశకరమైనదిగా ఎంచి, విడనాడుతున్న మార్గాన్ని ఎంచుకుంటోంది. వాతావరణ మార్పుల ఉత్పాతానికి ప్రధాన కారణం బొగ్గు వినియోగం పెరిగిపోవడమే. అమెరి కాలో పర్యావరణ, ప్రజా ఉద్యమాల కారణంగా వందల బొగ్గు విద్యుత్ ప్లాంట్లు మూతపడి, థర్మల్ విద్యుదుత్పత్తి 39 శాతానికి తగ్గింది. 2016 నాటికి మరో 175 ప్లాంట్లు మూతపడనున్నాయి. ప్రపంచం లోనే అతి పెద్ద బొగ్గు వినియోగదారైన చైనా సైతం ఏటా 655 మిలియన్ టన్నుల బొగ్గు వాడకాన్ని తగ్గించుకుంటోంది. కాలుష్య కారక బొగ్గు వినియో గం దిశగా ఇక ఒక్క అడుగైనా ముందుకు సాగ రాదని వాతావార ణ మార్పుల విజ్ఞానం శాసిస్తోంది. పారిశ్రామిక విప్లవం తదుపరి కర్బన ఉద్గారాల వల్ల సగటున భూమి ఉష్ణోగ్రత 0.8 డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకు పెరిగిందని అంచనా. ఇందులో మూడింట రెండు వంతులు 1980 నుండి పెరిగినదే. ఇదే రీతిలో శిలాజ ఇంధనాలను (బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులు) ఖర్చు చేస్తుంటే... ఈ శతాబ్దాంతానికి భూతాపం 2.6 నుండి 4.8 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరి మరల్చరాని పెను వాతావరణ మార్పులకు, ఉత్పా తాలకు దారితీస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చ రిస్తున్నారు. భూతాపాన్ని 2 డిగ్రీల గరిష్ట స్థాయికి కుదించకపోతే మానవాళిసహా జీవావరణ వ్యవస్థ మనుగడకు ముప్పని వారు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఐరోపా దేశాలన్నీ ప్రత్యామ్నాయ, శాశ్వత ఇంధన వనరులైన సౌర, పవన, జల విద్యు దుత్పత్తికి మళ్లుతున్నాయి. సగటున 30 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలుండే జర్మనీ 30 శాతం ఇంధన అవస రాల కోసం సౌర విద్యుత్తుపై ఆధారపడుతోంది. మన దేశంలో ఏడాదికి 280 రోజులకు పైగా 35 నుండి 45 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు నమోద వుతాయి. అలాంటి మనకు సౌర విద్యుత్తు ఎందు కూ పనికిరాకుండా పోతోంది? సువిశాల ప్రాంతా ల్లో సాగుభూములను, గ్రామాలను రుద్ర భూము లుగా మారుస్తూ, బొగ్గు గనులను తోడేసి ముందు తరాలకు హానిని తలపెట్టడం సమంజసమేనా? పాత ప్రభుత్వాల బాటలోనే ప్రకృతి వినాశకరమైన అదే అభివృద్ధి, ఇంధన నమూనాలతో బంగారు తెలం గాణను నిర్మించడం అసాధ్యం. ప్రపంచమం తా ‘‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ’’అంటుండగా కాలుష్య కాల సర్పాల్లాంటి థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపన అనాలోచితం, అనుచితం. ఇప్పటికైనా ఏలికలు మేల్కొని సౌర, పవన, జలశక్తుల వంటి ప్రత్యా మ్నాయ, శాశ్వత ఇంధన వనరుల అభివృద్ధి బాట పట్టాలి. రాష్ట్రంలోని వ్యవసాయ పంపు సెట్లన్నిటినీ సోలార్ పంపు సెట్లుగా మార్చే కృషికి ప్రాధాన్యం ఇవ్వాలి. జర్మనీ, చైనా, అమెరికా, బంగ్లాదేశ్‌లు సరే, గుజరాత్‌ను చూసైనా ప్రతి ఇంటి కప్పుపైనా సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసి, గ్రిడ్‌కు అనుసం ధానిస్తే గృహ అవసరాలతో పాటూ ఇతర అవస రాలకు సైతం విద్యుత్తు లభిస్తుంది. పర్యావరణ, జీవావరణ అనుకూల విద్యుదుత్పత్తి, అభివృద్ధి తప్ప మానవాళి ముందు నేడు వేరే ప్రత్యామ్నా యం లేదు. ఆ సత్యాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. (వ్యాసకర్త తెలంగాణ జల సాధన సమితి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు) -
మళ్లీ సంక్షోభం
- పెరిగిన విద్యుత్ వినియోగం రెండు కేంద్రాల్లో - సాంకేతిక సమస్యలు విచ్చలవిడిగా కోతలు - అయోమయంలో సర్కారు రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ ప్రాజెక్టులు షాక్ ఇచ్చాయి. రెండు విద్యుత్ కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక సమస్య, భానుడి దెబ్బకు పెరిగిన విద్యుత్ వినియోగం వెరసి మళ్లీ సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. నిరంతర విద్యుత్ సరఫరా అమల్లో ఉన్న దృష్ట్యా చాప కింద నీరులా అనధికారిక కోతల వాతను మోగించేపనిలో విద్యుత్ బోర్డు నిమగ్నమైంది. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కొన్నేళ్లుగా అమల్లో ఉన్న విద్యుత్ కోతలు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. కొత్త ప్రాజెక్టుల ద్వారా గత ఏడాది చివర్లో విద్యుత్ ఉత్పత్తి ఆశాజనకంగా మారడంతో కోతల వేళలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. మిగులు విద్యుత్ రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం జయలలిత ముందుకు సాగారు. కొత్త ప్రాజెక్టులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఆశాజనకంగా మారడం, కూడంకులం అణువిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి మెరుగుపడటం వెరసి రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యంగా సీఎం కంకణం కట్టుకున్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి విద్యుత్ వాడకంపై ఉన్న అన్నిరకాల ఆంక్షల్ని ఎత్తివేశారు. నగరాల్లోనే కాదు కుగ్రామాల్లో సైతం నిరంతర విద్యుత్ సరఫరాతో ముందుకు సాగుతున్నారు. తొలి వారం నిరంతర సరఫరా ఆచరణ యోగ్యంగా ఉన్నా క్రమంగా సాంకేతిక సమస్యల్ని ఎత్తిచూపుతూ అప్పుడప్పుడూ సరఫరా నిలుపుదల చేస్తూవచ్చారు. పవర్ షాక్ వేసవి ముగియడంతో విద్యుత్ వాడకం తగ్గుముఖం పడుతుందని, ఉత్పత్తికి తగ్గట్టుగా వినియోగం ఉంటుందన్న ఆశాభావంతో నిరంతర సరఫరా నినాదాన్ని సీఎం జయలలిత తెరపైకి తెచ్చి తప్పులో కాలేశారు. అగ్ని నక్షత్రం ముగిసినా ఎండలు తగ్గడంలేదు. వర్షాలు సంమృద్ధిగా పడాల్సిన పరిస్థితుల్లో భానుడుప్రజల్ని ఇంకా పిప్పి చేస్తున్నాడు. ఈ ప్రభావంతో విద్యుత్ వినియోగం మరింత పెరిగింది. కొన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలినట్టయింది. రాష్ట్రంలో ఈ నెల ఆరంభంలో విద్యుత్ వినియోగం రోజుకు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల మెగావాట్లకు పెరిగింది. ఉత్పత్తి ఆశాజనకంగా ఉండడంతో నిరంతర విద్యుత్ సరఫరాను అమల్లోకి తెచ్చారు. అయితే క్రమంగా భానుడి దెబ్బకు వినియోగం పెరుగుతూ వచ్చింది. గురువారానికి రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 13 వేల ఆరు వందల మెగావాట్లకు చేరింది. వేసవిని తలపించే విధంగా ఎండలు మండుతుండడంతో ఏసీలు, ఫ్యాన్ల వాడకం పెరిగింది. ఈ ప్రభావం విద్యుత్ గండానికి దారి తీసింది. ఉత్తర చెన్నైలోని మూడు యూనిట్ల ద్వారా ఆరు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతూ వచ్చింది. ఇక్కడ అదనంగా ఆరు వందల మెగావాట్లు ఉత్పత్తి చొప్పున రెండు యూనిట్ల ఏర్పాటు పనులు వేగవంతం చేశారు. ఈ పనుల కారణంగా వారం రోజులుగా ఆ మూడు యూనిట్లలతో తాత్కాళికంగా విద్యుత్ సరఫరా నిలుపుదల చేశారు. ప్రస్తుతం ఆ యూనిట్లలో ఉత్పత్తి ప్రక్రియ ఆరంభించే సమయానికి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆరువందల మెగావాట్లు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. తిరువళ్లూరు జిల్లా వళ్లూరు సమీపంలో తలా ఐదు వందల మెగావాట్లు ఉత్పత్తి చొప్పున మూడు యూనిట్లు ఏర్పాటు చేశారు. ఓ యూనిట్లో బ్రాయిలర్ ట్యూబ్‌లు పేలడంతో ఉత్పత్తి ఆగిపోయింది. ఈ రెండు కేంద్రాల్లో తలెత్తిన సమస్యలతో 1100 మెగావాట్ల ఉత్పత్తికి బ్రేక్ పడింది. అలాగే తూత్తుకుడిలో సాంకేతిక కారణాలతో ఉత్పత్తి తగ్గుతుండడం, బయటి రాష్ట్రాల నుంచి విద్యుత్ సరఫరా లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక లైన్ల పనులు ముగిసినా, కేంద్రం నుంచి అనుమతి దక్కక పోవడం వెరసి నిరంతర విద్యుత్ సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. కోతల వాత తాత్కాళికంగా తలెత్తిన సమస్యలతో చాప కింద నీరులా కొతల్ని అమలుచేసే పనిలో విద్యుత్ బోర్డు వర్గాలు పడ్డాయి. నిరంతర విద్యుత్‌సరఫరా అమల్లో ఉన్న దృష్ట్యా, ప్రభుత్వానికి మచ్చ రాని రీతిలో గంట, రెండు గంటల వ్యవధిలో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు చొప్పున కొతల్ని విధించే పనిలోపడ్డారు. చెన్నైను మినహాయించి తక్కిన జిల్లాల్లో ఈ కొతల వాత వాయించే పనిలో అధికారులు ఉన్నారు. అప్పుడప్పుడూ పదిహేను, ఇరవై నిమిషాలు కొత విధించడంతో రోజుకు ఎలాగైనా రెండు నుంచి మూడు గంటల వరకు అనధికారిక కోతలు అమల్లోకి రావడం గమనార్హం. పరిశ్రమలకు, వాణిజ్య కేంద్రాలకు అన్ని రకాల ఆంక్షలు ఎత్తి వేయడంతో విద్యుత్ వినియోగం పెరిగిందని ఓ అధికారి పేర్కొన్నారు. ఎండ దెబ్బతోనే ఈ వినియోగం పెరిగిందని, అదే సమయంలో సాంకేతిక సమస్యలు ఉత్పత్తికి ఆటకంగా మారాయని ఆ అధికారి వివరించారు. వళ్లూరు, ఉత్తర చెన్నైలలో తలెత్తిన సాంకేతిక సమస్యలు రెండు మూడు రోజుల్లో సరి చేస్తామన్నారు. ప్రజలకు నిరంతర విద్యుత్ అందించాలన్న కాంక్ష ప్రభుత్వానికి ఉన్నా, ఎప్పుడు ఎక్కడ సాంకేతిక సమస్య తలెత్తుతుందో, ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడుతాయో చెప్పలేమంటూ ఆ అధికారి పేర్కొనడం బట్టి చూస్తే నిరంతర విద్యుత్ సాధ్యమేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. -
విద్యుత్‌కు బొగ్గు భరోసా!
న్యూఢిల్లీ: విద్యుదుత్పత్తి రంగానికి ప్రభుత్వం కాస్త చేయూతనిచ్చే నిర్ణయం తీసుకుంది. పర్యావరణ అనుమతుల్లో అడ్డుంకుల కారణంగా బొగ్గు గనుల అభివృద్ధి చేపట్టని విద్యుత్ సంస్థలకు బొగ్గు సరఫరాను పెంచేందుకు ఓకే చెప్పింది. ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) గురువారం ఇక్కడ జరిపిన భేటీలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. పర్యావరణ, అటవీశాఖ అనుసరిస్తున్న అనుకూల(గో), నిషేధిత(నో-గో) విధానం కారణంగా మొత్తం 24 విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన బొగ్గు బ్లాకుల అభివృద్ధిలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఇందులో 9 ప్రాజెక్టులకు మరింత బొగ్గును సరఫరా చేయడానికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జీఎంఆర్ రెండు ప్రాజెక్టులు కూడా... కేబినెట్ ఆమోదించిన జాబితాలో స్టెరిలైట్, జీఎంఆర్, కేఎస్కే మహానది పవర్లకు చెందిన రెండేసి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. దీనిప్రకారం పర్యావరణ అనుమతుల జాప్యంతో మైనింగ్ అభివృద్ధి నిలిచిపోయిన పవర్ ప్లాంట్లకు మరో మూడేళ్లపాటు క్రమానుగత(ట్యాపరింగ్) బొగ్గు లింకేజీ విధానం కింద సరఫరా చేయనున్నారు. అయితే ఈ విధానం ప్రకారం ఎంత పరిమాణంలో బొగ్గు సరఫరా చేయాలనేది ఇంధన సరఫరా ఒప్పందాల(ఎఫ్ఎస్ఏ) ద్వారా నిర్ణయించనుండగా.. అదనపు సరఫరా పరిమాణాన్ని లభ్యతకు లోబడి అవగాహన ఒప్పందాల(ఎంఓయూ) ప్రాతిపదికన ఇవ్వనున్నారని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ సరఫరా ప్రక్రియను ప్రతి ఏడాది చివర్లో బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలతోపాటు ప్రణాళిక సంఘం కలిసి సమీక్షించనున్నాయి. రూ. 60 వేల కోట్ల పెట్టుబడులు... ప్రభుత్వం అదనపు బొగ్గు సరఫరాలకు ఓకే చెప్పిన 9 పవర్ ప్రాజెక్టుల ఉత్పత్తి సామర్థ్యం 11 వేల మెగావాట్లుగా అంచనా. వీటికి పెట్టుబడుల మొత్తం దాదాపు రూ.60 వేల కోట్లు. ఈ ప్లాంట్లకు ఇప్పటికే సొంత బొగ్గు సరఫరా బ్లాక్‌లు ఉన్నాయి. అయితే, పర్యావరణ అనుమతుల విషయంలో అడ్డంకులతో ఈ గనుల్లో తవ్వకాలకు వీల్లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం ట్యాపరింగ్ బొగ్గు లింకేజీ కింద మూడేళ్ల సరఫరాలకు బదులు మరో మూడేళ్లు అదనంగా సరఫరా చేయాలని ప్లాంట్లు విజ్ఞప్తి చేశాయి. విద్యుత్ శాఖ కూడా దీనికి సిఫార్సు చేయడంతో కేంద్ర కేబినెట్ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ఎయిరిండియా బోయింగ్‌ల అమ్మకానికి ఓకే.. ఎతిహాద్ ఎయిర్వేస్కు అయిదు బోయింగ్ 777 విమానాలను విక్రయించాలన్న ఎయిరిండియా ప్రతిపాదనను సీసీఈఏ ఆమోదించింది. గత నెలలోనే ఎతిహాద్‌తో డీల్‌ను ఎయిరిండియా ఖరారు చేసుకుంది. ఈ ఒప్పందంతో ఎయిరిండియాకు 30-35 కోట్ల డాలర్ల వరకూ(గరిష్టంగా రూ.2,200 కోట్లు) లభించవచ్చని అంచనా. టర్న్‌ఎరౌండ్ ప్రణాళికలో భాగంగా కంపెనీకి ఉన్న రూ.20,000 కోట్ల రుణ భారంలో కొంత మొత్తాన్ని తీర్చేందుకు వినియోగించనుంది. 11 ఖాయిలా పరిశ్రమలకు రూ.117 కోట్లు ఖాయిలా పడిన 11 ప్రభుత్వరంగ సంస్థ(పీఎస్‌యూ)లకు రూ.116.86 కోట్లను కేటాయించేందుకు సీఈఈఏ ఆమోదం తెలిపింది. వేతనాలు, ఇతర బకాయిల కింద ఈ నిధులను ఆయా సంస్థలు వినియోగించనున్నాయి. ఈ నిధులు అందనున్న పరిశ్రమల్లో హిందుస్తాన్ కేబుల్స్, హెచ్ఎంటీ మిషన్ టూల్స్, హెచ్ఎంటీ(వాచెస్), హెచ్ఎంటీ(చినార్ వాచెస్), నాగాలాండ్ పల్ప్ అండ్ పేపర్, త్రివేణి స్ట్రక్చర్స్, తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్, నాపా లిమిటెడ్, హెచ్ఎంటీ బేరింగ్స్, హిందుస్తాన్ ఫొటో ఫిలిమ్స్, టైర్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యలో పీఎఫ్, గ్రాట్యూటీ, పెన్షన్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్, బోనస్ వంటి చట్టబద్ధ బకాయిలు, వేతన బకాయిల కింద ఈ నిధులను కేంద్రం విడుదల చేస్తుంది.