ముత్తుకూరు : మండలంలో ఏపీ జెన్‌కో థర్మల్ ప్రాజెక్టు, టీపీసీఐఎల్ థర్మల్ ప్రాజెక్టులకు అతి చేరువలో ఉన్న నేలటూరు పంచాయతీ తరలింపు పగటికలగా మారింది. బూడిద బావులకు సైతం అతి సమీపంలో ఉన్న ఈ పంచాయతీని తరలించాలని 20 నెలలుగా సర్కారు చేస్తున్న ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేదు.
ముత్తుకూరు : థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర అవసరాలకు నేలటూరు పంచాయతీలో సుమారు మూడు వేల ఎకరాలు సేకరించారు. నేలటూరులో 263, దళితవాడలో 200, పట్టపుపాళెంలో 386 కలిపి మొత్తం 849 కుటుంబాలున్నాయి. ఈ భూముల సేకరణ వల్ల వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే పేద కుటుంబాలు జీవనోపాధి కోల్పోయాయి. తీరంలో కన్వేయర్ బెల్టులు, సీవాటర్ పంప్‌హౌస్‌ల నిర్మాణం వల్ల సముద్రంలో మత్స్యసంపద కరువై మత్స్యకారులు వేటకు దూరమయ్యారు. ప్రాజెక్టులు ఏర్పాటైనా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మృగ్యమయ్యాయి. తాగునీటికి కొరత ఏర్పడింది. పశువుల మేత దుర్లభం అయింది. భూగర్భ జలాలు పాడయ్యాయి. దీనికితోడు కాలుష్య ప్రమాదం, అంతుబట్టని శబ్దాలు, అంటువ్యాధుల మూలాన ఏడాది నుంచి పంచాయతీ తరలింపుపై స్థానికుల ఆందోళన తీవ్రతరం అయింది.
అమలుకాని ప్రతిపాదనలు:
గ్రామస్తుల ఆందోళనల ఫలితంగా 10 నెలల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ నేలటూరు, పట్టపుపాళెం, దళితవాడలో సభలు నిర్వహించారు. తరలివెళ్లేందుకు గ్రామస్తుల ఆమోదం తీసుకున్నారు. దీనికి ఎన్‌ఎన్‌సీ, టీపీసీఐఎల్, ఏపీజెన్‌కో, రిలయన్స్ విద్యుత్ ప్రాజెక్టుల ఆర్ధికసాయంతో సురక్షిత భూముల సేకరణ, కాలనీల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం పంచాయతీ అంతా సర్వేలు సాగాయి. సురక్షిత ప్రాంతాలను సూచిస్తూ గ్రామస్తులు వినతిపత్రాలు కూడా అందజేశారు.
శ్రీకాంత్ స్థానంలో వచ్చిన కలెక్టర్ జానకి కూడా నాలుగు నెలల క్రితం గ్రామసభలు నిర్వహించారు. అయితే పంచాయతీ తరలింపు మాత్రం స్పష్టమైన రూపానికి రాలేదు. పట్టపుపాళెం తరలింపు కోసం తోటపల్లిగూడూరు మండలంలోని కోడూరు తీరంలో అప్పటి జేసీ రేఖారాణి రూ.కోట్లు ఖర్చు చేసి భూములు కొనుగోలు చేశారు. ఏకపక్షంగా సేకరించిన ఈ భూములు అనువైనవి కావంటూ మత్స్యకారులు నిరాకరించారు. ఫలితంగా దీనికైన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారింది.
పంచాయతీ తరలింపు కోసం మొదటి విడతగా తమ వాటా కింద ఏపీ జెన్‌కో, టీపీసీఐఎల్, ఎన్ సీపీ పవర్ ప్రాజెక్టులో కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి డిపాజిట్ చేశాయి. మరో వైపు టీపీసీఐఎల్ ప్రాజెక్టుకు సేకరించిన భూములకు ఇంకా పరిహారం రాలేదంటూ పైనాపురం పేదలు నిరంతరం ఆందోళన చేస్తూనే ఉన్నారు.
ఆందోళన కలిగిస్తున కాలుష్యం:
-చీకిరి నరసింహ, దళితవాడ, నేలటూరు
థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు వల్ల కొందరు పెద్దలు మాత్రమే బాగుపడ్డారు. వందలాది పేద కుటుంబాలు అన్యాయమైపోయాయి. కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. అంటువ్యాధులతో అల్లాడుతున్నాం. గ్రామాన్ని తరలిస్తామని సభలు పెట్టిన అధికారులు ఇప్పుడు పూర్తిగా మరిచిపోయారు. వెంటనే తరలింపు ప్రక్రియ వేగవంతం చేయాలి.
పంచాయతీని తరలించాల్సిందే:
-ఈపూరు శేషారెడ్డి, సర్పంచ్, నేలటూరు
నేలటూరు పంచాయతీని ఎట్టి పరిస్థితుల్లోను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందే. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం అధికమవుతోంది. వ్యాధులు ప్రబలుతున్నట్టు పేదలు ఆందోళన చెందుతున్నారు. యువతకు ఉద్యోగాలు లభించలేదు. చెంతనే ఉన్న యాష్‌పాండ్ వల్ల భూగర్భ జలాలు కలుషితం కానున్నాయి. గ్రామం విడిచిపెట్టి వెళ్లే సురక్షిత ప్రాంతాలను అధికారులకు సూచిం చాం. ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు.
పునరావాసానికి భూముల సేకరణ
నేలటూరు పంచాయతీని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన భూసేకరణ జరుగుతోందని మండల రెవెన్యూ అధికారులు చెప్పారు. ధనలక్ష్మీపురం వద్ద 30 ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నారు. మాదరాజుగూడూరు వద్ద 30 ఎకరాలు సేకరిస్తున్నారు. తోటపల్లిగూడూరు మండలంలోని కోడూరు వద్ద కూడా 25 ఎకరాలు సేకరిస్తున్నాని తెలిపారు.
నేలటూరు తరలింపు పగటికలే!
Published Fri, Aug 7 2015 2:12 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM
Advertisement
Advertisement