‘థర్మల్’ సాక్షిగా.. నం.1 దోపిడీ | The No.1 Exploitation of Thermal power projects! | Sakshi
Sakshi News home page

‘థర్మల్’ సాక్షిగా.. నం.1 దోపిడీ

Published Fri, Jul 22 2016 2:00 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

The No.1 Exploitation of Thermal power projects!



సాక్షి, హైదరాబాద్: ఇల్లు కట్టుకోవాలనుకున్నపుడు ఏం చేస్తాం? ఫలానా చోట అంత తక్కువ రేటుకు చేశారు.. అక్కడ ఇంత తక్కువకు ఈ పనిచేశారు అంటూ ఏకరువు పెట్టి మేిస్త్రీలతో బేరాలాడతాం. మనం పెట్టిన కండిషన్ల మేరకు ఎవరు తక్కువకు చేస్తానంటే వారికి కాంట్రాక్టు అప్పగిస్తాం. కానీ చంద్రబాబునాయుడు మాత్రం కాస్త డిఫరెంట్. ప్రజాధనం ఎంత వృథా అయిపోతున్నా ఆయన బేఫికర్... అస్సలు అవసరమే లేని ప్రాజెక్టులను చేపట్టడం ఆయన స్టయిల్. ప్రభుత్వరంగ సంస్థలు తక్కువకు చేస్తున్నా కాదని ప్రైవేటు కంపెనీలకు పనులు అప్పగించడం ఆయనకు మహా ఇష్టం.దేశంలో ఎక్కడా లేని ధరలను కోట్ చేసినా కళ్లు మూసుకుని ఖరారు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. అవసరమైతే కాంట్రాక్టును ప్యాకేజీలుగా విడగొట్టి మరీ ప్రైవేటు కంపెనీలకు ప్రయోజనం చేకూర్చడంలో ఆయన్ను మించినవారు లేరంటారు. పొరుగు రాష్ట్రాలలో తక్కువకే పనులు జరుగుతున్నా బాబు అస్సలు పట్టించుకోరు. రాష్ర్టంలో ఇటీవల ఖరారు చేసిన రెండు థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. రెండు ప్రాజెక్టులలో కలిపి ప్రైవేటు కంపెనీలకు దోచిపెడుతున్న ప్రజాధనం రూ. 2,392 కోట్లు. అందులో చేతులు మారిన ముడుపులు రూ. 1,150 కోట్లు పైమాటే.. ఈ వ్యవహారాన్ని కాస్త పరిశీలిస్తే నిర్ఘాంతపోయే వాస్తవాలు కళ్లకు కడుతున్నాయి. అవేమిటో చూద్దాం....
 
అవసరమే లేని ఆ రెండు ప్రాజెక్టులు..
రాష్ట్రంలో గడచిన రెండేళ్ళలో విద్యుత్ డిమాండ్ ఏమాత్రం పెరగలేదు. ఉన్న థర్మల్ ప్రాజెక్టుల్లోనే తరచూ ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కొత్తగా కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నంలో ఒక్కొక్కటీ 800 మెగావాట్ల సామర్థ్యంతో కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నంలలో రెండు థర్మల్ ప్లాంట్లు నిర్మించాలని రాష్ర్ట ప్రభుత్వం తలపెట్టింది. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే తరహా ప్రాజెక్టులను చేపడుతున్నాయి. అయితే అవన్నీ నిర్దిష్టమైన ప్రమాణాలతో కాంట్రాక్టులు అప్పగిస్తున్నాయి. సాధ్యమైనంత వరకూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌కే పనులు ఇస్తున్నాయి.  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ కూడా థర్మల్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది.

కేవలం రెండు ప్రైవేటు కంపెనీలకు కాంట్రాక్టులు అప్పగించాలని ముందే నిర్ణయించుకుంది. వాళ్ళే అర్హత పొందేలా నిబంధనలు పెట్టింది. ఈనెల 6న కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం టెండర్లు ఖరారుచేశారు. కృష్ణపట్నంలో టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఇబ్రహీంపట్నంలో బీజీఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ లకు కాంట్రాక్టులు దక్కాయి.
 
దోపిడీ కోసమే ప్యాకేజీల విభజన

మిగతా రాష్ట్రాలన్నీ ఇదే తరహా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా... అవి మాత్రం ఒకే ప్యాకేజీ కింద టెండర్లు పిలిచాయి. ఏపీ మాత్రం ఒకే ప్రాజెక్టును బీటీజీ (బాయిలర్, టర్బైన్, జనరేటర్), బీవోపీ (బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్)లు అంటూ రెండు ప్యాకేజీలుగా విడగొట్టింది. బీటీజీలో యంత్ర పరికరాలే ఉంటాయి. ఇవన్నీ కొనుగోలు చేసేవే. వాటికి నిర్దిష్టమైన ధరలు ఉంటాయి. దోచుకోవడానికి ఇందులో పెద్దగా అవకాశం ఉండదు. అందుకే ఈ పనులను ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించింది.

ఇక బీవోపీ కాంట్రాక్టుల విషయంలో మాత్రం ఏలినవారు మనవారైతే అందినంత దోచుకునేందుకు అవకాశముంటుంది. అందుకే రాష్ర్టప్రభుత్వం ముడుపులిచ్చే వారికే కాంట్రాక్టులు అప్పగించేలా చేసిందన్న విమర్శలున్నాయి. వారికి పోటీ రాకుండా అర్హత నిబంధనలు రూపొందించడం చూస్తే అది నిజమేననిపిస్తుంది. రెండు థర్మల్ ప్రాజెక్టులు నిర్మించిన అనుభవం ఉండాలని, ఇందులో ఒకటి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించి ఉండాలంటూ ఎన్టీపీసీలో కూడా లేని రూల్స్ పెట్టింది. అలాంటి అర్హతా నిబంధనల వల్లే కృష్ణపట్నంలో టాటా, ఇబ్రహీంపట్నంలో బీజీఆర్‌లకు కాంట్రాక్టులు దక్కాయి. పోటీ లేకపోవడంతో ఈ రెండు సంస్థలు చాలా ఎక్కువ మొత్తం కోట్ చేశాయి. జెన్‌కో నియమించిన కన్సల్టెన్సీ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది.
 
ఏ రాష్ట్రంలోనూ లేనంత ఎక్కువ!
టాటా, బీజీఆర్ కంపెనీలు కోట్ చేసిన ధరలు ఏ రాష్ట్రంలోనూ కన్పించడం లేదు.  2014 నుంచి ఇప్పటి వరకూ మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్రలో పలు చోట్ల థర్మల్ ప్రాజెక్టుల కాంట్రాక్టులను ఖరారు చేశారు. ఏపీ కాంట్రాక్టులకు, వీటికి ఎక్కడా పోలిక కన్పించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగూడెం, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులను 800 మెగావాట్ల సామర్థ్యంతో చేపడుతోంది. ఆ రాష్ట్రం ఒకే ప్యాకేజీగా (బీటీజీ, బీవోపీ కలిపే) టెండర్లు పిలిచింది. కొత్తగూడెం కాంట్రాక్టును మెగావాట్ రూ. 4.76 కోట్ల చొప్పున ఇచ్చింది. యాదాద్రిలో చేపట్టే 800 మెగావాట్ల సామర్థ్యం గల ఐదు ప్లాంట్ల పనుల కాంట్రాక్టు మెగావాట్‌కు రూ. 4.48 కోట్లకు చేపట్టేందుకు బీహెచ్‌ఈఎల్ ముందుకొచ్చింది.

జార్ఖండ్‌లోని ఖరాన్‌పుర వద్ద ఎన్టీపీసీ చేపట్టే 660 మెగావాట్ల సామర్థ్యం గల మూడు థర్మల్ ప్రాజెక్టు పనులను బీఈహెచ్‌ఈఎల్‌కు మెగావాట్ రూ. 3.97 కోట్లకే కాంట్రాక్టు ఇచ్చింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన థర్మల్ ప్రాజెక్టుల కాంట్రాక్టులకు భారీ వ్యత్యాసం కన్పిస్తోంది. కృష్ణపట్నంలో బీటీజీ ప్యాకేజీ పనులను బీహెచ్‌ఈఎల్‌కు  మెగావాట్‌కు రూ. 2.88 కోట్లకు ఇచ్చారు. ఇక్కడ బీవోపీ కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు రూ. 3.32 కోట్లకు ఇచ్చారు. ఈ రెండూ కలిపితే కృష్ణపట్నం ప్రాజెక్టు కాంట్రాక్టు మెగావాట్‌కు రూ. 6.20 కోట్లకు చేరింది. ఇబ్రహీంపట్నంలో బీటీజీ కాంట్రాక్టును బీహెచ్‌ఈఎల్‌కు మెగావాట్‌కు 2.88 కోట్లకు, బీవోపీ కాంట్రాక్టును బీజీఆర్ ఎనర్జీ సంస్థకు మెగావాట్‌కు 2.87 కోట్లకు ఇచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టు మెగావాట్‌కు 5.75 కోట్లకు చేరింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువని ఈ మొత్తాలు చూస్తే అర్థమౌతుంది.
ఒకే కంపెనీ... రెండు ధరలు..
ఏపీలోని ఇబ్రహీంపట్నం థర్మల్ (800 మెగావాట్ల) కాంట్రాక్టుకు బీజీఆర్ సంస్థ రూ. 2,307 కోట్లు కోట్ చేసింది. అంటే మెగావాట్‌కు రూ. 2.88 కోట్లు (బీవోపీ ప్యాకేజీ). ఇదే సంస్థ మధ్యప్రదేశ్‌లోని బరేతీలో ఎన్టీపీసీ చేపట్టిన థర్మల్ ప్రాజెక్టు (660 మెగావాట్‌తో నాలుగు ప్లాంట్లు = 2,640 మె.వా) బీవోపీ కాంట్రాక్టును గత ఏడాది ఆగస్టు 14న రూ. 2,196 కోట్లతో టెండర్ దక్కించుకుంది. అంటే మెగావాట్‌కు రూ. 83 లక్షలు అన్న మాట. మధ్యప్రదేశ్‌లో టెండర్ ఖరారు అయిన కేవలం ఐదు నెలల్లోనే (4-12-2015) ఒకే తరహా పనికి దాదాపు రూ. 2కోట్లు ఎక్కువ కోట్ చేసింది. (బరేతీలో మెగావాట్ రూ. 83 లక్షలు... ఏపీలోని ఇబ్రహీంపట్నంలో రూ. 2.88కోట్లు). ఇంత వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తున్నా ఏపీ సర్కారు కావాలని విస్మరించినట్లు అర్ధమౌతోంది. దీన్ని బట్టి చూస్తే ముడుపుల మహిమ ఎలా పనిచేసిందో అర్ధం చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement