విద్యుత్ మణిహారాలా? మృత్యుపాశాలా?
పాత ప్రభుత్వాల బాటలోనే ప్రకృతి వినాశకరమైన అవే ఇంధన, అభివృద్ధి నమూనాలతో బంగారు తెలంగాణ అసాధ్యం. ప్రపంచమంతా ‘‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ’’ అంటుండగా కాలుష్య కాల సర్పాల్లాంటి థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపన అనాలోచితం. పర్యావరణ అనుకూల విద్యుదుత్పత్తి తప్ప మానవాళికి వేరే ప్రత్యామ్నాయం లేదు.
‘‘అనంత శక్తి వనరులున్నా యనే ప్రాతిపదికపై అంతులేని వృద్ధితో అందరికీ న్యాయం జరుగుతుందనే ఊహతో మనమీ ప్రపంచాన్ని నిర్మించు కున్నాం. వాస్తవంలోనూ, కలలోనూ కూడా అది ఇక లేదు. మనం మరో భిన్న ప్రపంచాన్ని నిర్మించు కోవాల్సిందే. ఇంత పెద్ద మానవ సమాజాన్ని భరి స్తున్న ప్రపంచం ఇక మిగలదు.’’ -రాబర్ట్ జెన్సన్.
ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 135 ఏళ్ల క్రితం, 1885లో ప్రపంచ ఉష్ణోగ్రతలను నమోదు చేయడం ప్రారంభమైనప్పటి నుండి ఇదే అత్యధిక స్థాయి. కర్బన ఉద్గారాల విడుదల విపరీతంగా పెరిగి భూతాపం పెరుగుతుండటం వల్ల కలుగుతున్న విపరిణామాల్లో ఇది ఒకటి. ఇటీవల అత్యంత ఉపద్రవకరంగా కాశ్మీర్‌ను ముంచెత్తిన వరదలు, వేలాది మందిని బలిగొన్న ఉత్తరాంచల్ పెను ఉత్పాతం, తాజాగా ఉత్తరాంధ్ర, విశాఖ నగరాలను ధ్వంసించిన హుద్ హుద్ రక్క సులే కాదు, ఫిలిప్పీన్స్‌లో విలయం సృష్టించిన హైయాన్ ఉప్పెన సైతం వాతావరణ మార్పుల ఫలితాలే. రుతువులు గతులు తప్పుతుండగా అకాల వర్షాలు, వరదలు, దుర్భిక్ష క్షామ పరిస్థితులు సర్వసాధారణం అయ్యాయి.
అందుకే తెలంగాణ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కరువు తాండవ మాడుతోంది. అన్నదాతల ఆత్మహత్యలు ఆగకుండా సాగుతున్నాయి. ఈ నేపథ్యం నుండి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొరతను అధిగమించడం కోసం గోదావరికి ఇరువేపులా ‘‘విద్యుత్ మణిహారాల’’ లా బొగ్గు ఆధారిత భారీ థర్మల్ కేంద్రాలను నిర్మిం చాలని తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించడం అవసరం. రాష్ట్రం ఇప్పుడున్న, ప్రతి పాదిస్తున్న ఎత్తిపోతల సాగునీటి పథకాలకు సంబంధించి 8 వేల మెగావాట్ల విద్యుత్ లోటును ఎదుర్కొంటోంది. అన్ని రకాల సాగునీటి అవసరాలను కలుపుకుంటే అది 12 వేల మెగా వాట్లు. ఒక్క ప్రాణహిత ఎత్తిపోతల పథకానికే 3,466 మెగావాట్లు అవసరం. దానికి జాతీయ హోదా లభిస్తే తప్ప ప్రభుత్వానికి అది గుదిబండ కాక తప్పదు. దురదృష్టవశాత్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొ నడానికి ప్రపంచ మంతా వినాశకరమైనదిగా ఎంచి, విడనాడుతున్న మార్గాన్ని ఎంచుకుంటోంది.
వాతావరణ మార్పుల ఉత్పాతానికి ప్రధాన కారణం బొగ్గు వినియోగం పెరిగిపోవడమే. అమెరి కాలో పర్యావరణ, ప్రజా ఉద్యమాల కారణంగా వందల బొగ్గు విద్యుత్ ప్లాంట్లు మూతపడి, థర్మల్ విద్యుదుత్పత్తి 39 శాతానికి తగ్గింది. 2016 నాటికి మరో 175 ప్లాంట్లు మూతపడనున్నాయి. ప్రపంచం లోనే అతి పెద్ద బొగ్గు వినియోగదారైన చైనా సైతం ఏటా 655 మిలియన్ టన్నుల బొగ్గు వాడకాన్ని తగ్గించుకుంటోంది. కాలుష్య కారక బొగ్గు వినియో గం దిశగా ఇక ఒక్క అడుగైనా ముందుకు సాగ రాదని వాతావార ణ మార్పుల విజ్ఞానం శాసిస్తోంది. పారిశ్రామిక విప్లవం తదుపరి కర్బన ఉద్గారాల వల్ల సగటున భూమి ఉష్ణోగ్రత 0.8 డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకు పెరిగిందని అంచనా. ఇందులో మూడింట రెండు వంతులు 1980 నుండి పెరిగినదే. ఇదే రీతిలో శిలాజ ఇంధనాలను (బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులు) ఖర్చు చేస్తుంటే... ఈ శతాబ్దాంతానికి భూతాపం 2.6 నుండి 4.8 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరి మరల్చరాని పెను వాతావరణ మార్పులకు, ఉత్పా తాలకు దారితీస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చ రిస్తున్నారు. భూతాపాన్ని 2 డిగ్రీల గరిష్ట స్థాయికి కుదించకపోతే మానవాళిసహా జీవావరణ వ్యవస్థ మనుగడకు ముప్పని వారు స్పష్టం చేస్తున్నారు.
అందుకే ఐరోపా దేశాలన్నీ ప్రత్యామ్నాయ, శాశ్వత ఇంధన వనరులైన సౌర, పవన, జల విద్యు దుత్పత్తికి మళ్లుతున్నాయి. సగటున 30 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలుండే జర్మనీ 30 శాతం ఇంధన అవస రాల కోసం సౌర విద్యుత్తుపై ఆధారపడుతోంది. మన దేశంలో ఏడాదికి 280 రోజులకు పైగా 35 నుండి 45 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు నమోద వుతాయి. అలాంటి మనకు సౌర విద్యుత్తు ఎందు కూ పనికిరాకుండా పోతోంది? సువిశాల ప్రాంతా ల్లో సాగుభూములను, గ్రామాలను రుద్ర భూము లుగా మారుస్తూ, బొగ్గు గనులను తోడేసి ముందు తరాలకు హానిని తలపెట్టడం సమంజసమేనా? పాత ప్రభుత్వాల బాటలోనే ప్రకృతి వినాశకరమైన అదే అభివృద్ధి, ఇంధన నమూనాలతో బంగారు తెలం గాణను నిర్మించడం అసాధ్యం.
ప్రపంచమం తా ‘‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ’’అంటుండగా కాలుష్య కాల సర్పాల్లాంటి థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపన అనాలోచితం, అనుచితం. ఇప్పటికైనా ఏలికలు మేల్కొని సౌర, పవన, జలశక్తుల వంటి ప్రత్యా మ్నాయ, శాశ్వత ఇంధన వనరుల అభివృద్ధి బాట పట్టాలి. రాష్ట్రంలోని వ్యవసాయ పంపు సెట్లన్నిటినీ సోలార్ పంపు సెట్లుగా మార్చే కృషికి ప్రాధాన్యం ఇవ్వాలి. జర్మనీ, చైనా, అమెరికా, బంగ్లాదేశ్‌లు సరే, గుజరాత్‌ను చూసైనా ప్రతి ఇంటి కప్పుపైనా సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసి, గ్రిడ్‌కు అనుసం ధానిస్తే గృహ అవసరాలతో పాటూ ఇతర అవస రాలకు సైతం విద్యుత్తు లభిస్తుంది. పర్యావరణ, జీవావరణ అనుకూల విద్యుదుత్పత్తి, అభివృద్ధి తప్ప మానవాళి ముందు నేడు వేరే ప్రత్యామ్నా యం లేదు. ఆ సత్యాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.
(వ్యాసకర్త తెలంగాణ జల సాధన సమితి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు)