మళ్లీ సంక్షోభం
- పెరిగిన విద్యుత్ వినియోగం రెండు కేంద్రాల్లో
- సాంకేతిక సమస్యలు విచ్చలవిడిగా కోతలు
- అయోమయంలో సర్కారు
రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ ప్రాజెక్టులు షాక్ ఇచ్చాయి. రెండు విద్యుత్ కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక సమస్య, భానుడి దెబ్బకు పెరిగిన విద్యుత్ వినియోగం వెరసి మళ్లీ సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. నిరంతర విద్యుత్ సరఫరా అమల్లో ఉన్న దృష్ట్యా చాప కింద నీరులా అనధికారిక కోతల వాతను మోగించేపనిలో విద్యుత్ బోర్డు నిమగ్నమైంది.
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కొన్నేళ్లుగా అమల్లో ఉన్న విద్యుత్ కోతలు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. కొత్త ప్రాజెక్టుల ద్వారా గత ఏడాది చివర్లో విద్యుత్ ఉత్పత్తి ఆశాజనకంగా మారడంతో కోతల వేళలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. మిగులు విద్యుత్ రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం జయలలిత ముందుకు సాగారు. కొత్త ప్రాజెక్టులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఆశాజనకంగా మారడం, కూడంకులం అణువిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి మెరుగుపడటం వెరసి రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యంగా సీఎం కంకణం కట్టుకున్నారు.
ఈనెల ఒకటో తేదీ నుంచి విద్యుత్ వాడకంపై ఉన్న అన్నిరకాల ఆంక్షల్ని ఎత్తివేశారు. నగరాల్లోనే కాదు కుగ్రామాల్లో సైతం నిరంతర విద్యుత్ సరఫరాతో ముందుకు సాగుతున్నారు. తొలి వారం నిరంతర సరఫరా ఆచరణ యోగ్యంగా ఉన్నా క్రమంగా సాంకేతిక సమస్యల్ని ఎత్తిచూపుతూ అప్పుడప్పుడూ సరఫరా నిలుపుదల చేస్తూవచ్చారు.
పవర్ షాక్
వేసవి ముగియడంతో విద్యుత్ వాడకం తగ్గుముఖం పడుతుందని, ఉత్పత్తికి తగ్గట్టుగా వినియోగం ఉంటుందన్న ఆశాభావంతో నిరంతర సరఫరా నినాదాన్ని సీఎం జయలలిత తెరపైకి తెచ్చి తప్పులో కాలేశారు. అగ్ని నక్షత్రం ముగిసినా ఎండలు తగ్గడంలేదు. వర్షాలు సంమృద్ధిగా పడాల్సిన పరిస్థితుల్లో భానుడుప్రజల్ని ఇంకా పిప్పి చేస్తున్నాడు. ఈ ప్రభావంతో విద్యుత్ వినియోగం మరింత పెరిగింది. కొన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలినట్టయింది.
రాష్ట్రంలో ఈ నెల ఆరంభంలో విద్యుత్ వినియోగం రోజుకు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల మెగావాట్లకు పెరిగింది. ఉత్పత్తి ఆశాజనకంగా ఉండడంతో నిరంతర విద్యుత్ సరఫరాను అమల్లోకి తెచ్చారు. అయితే క్రమంగా భానుడి దెబ్బకు వినియోగం పెరుగుతూ వచ్చింది. గురువారానికి రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 13 వేల ఆరు వందల మెగావాట్లకు చేరింది. వేసవిని తలపించే విధంగా ఎండలు మండుతుండడంతో ఏసీలు, ఫ్యాన్ల వాడకం పెరిగింది. ఈ ప్రభావం విద్యుత్ గండానికి దారి తీసింది.
ఉత్తర చెన్నైలోని మూడు యూనిట్ల ద్వారా ఆరు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతూ వచ్చింది. ఇక్కడ అదనంగా ఆరు వందల మెగావాట్లు ఉత్పత్తి చొప్పున రెండు యూనిట్ల ఏర్పాటు పనులు వేగవంతం చేశారు. ఈ పనుల కారణంగా వారం రోజులుగా ఆ మూడు యూనిట్లలతో తాత్కాళికంగా విద్యుత్ సరఫరా నిలుపుదల చేశారు. ప్రస్తుతం ఆ యూనిట్లలో ఉత్పత్తి ప్రక్రియ ఆరంభించే సమయానికి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆరువందల మెగావాట్లు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.
తిరువళ్లూరు జిల్లా వళ్లూరు సమీపంలో తలా ఐదు వందల మెగావాట్లు ఉత్పత్తి చొప్పున మూడు యూనిట్లు ఏర్పాటు చేశారు. ఓ యూనిట్‌లో బ్రాయిలర్ ట్యూబ్‌లు పేలడంతో ఉత్పత్తి ఆగిపోయింది. ఈ రెండు కేంద్రాల్లో తలెత్తిన సమస్యలతో 1100 మెగావాట్ల ఉత్పత్తికి బ్రేక్ పడింది. అలాగే తూత్తుకుడిలో సాంకేతిక కారణాలతో ఉత్పత్తి తగ్గుతుండడం, బయటి రాష్ట్రాల నుంచి విద్యుత్ సరఫరా లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక లైన్‌ల పనులు ముగిసినా, కేంద్రం నుంచి అనుమతి దక్కక పోవడం వెరసి నిరంతర విద్యుత్ సరఫరా ప్రశ్నార్థకంగా మారింది.
కోతల వాత
తాత్కాళికంగా తలెత్తిన సమస్యలతో చాప కింద నీరులా కొతల్ని అమలుచేసే పనిలో విద్యుత్ బోర్డు వర్గాలు పడ్డాయి. నిరంతర విద్యుత్‌సరఫరా అమల్లో ఉన్న దృష్ట్యా, ప్రభుత్వానికి మచ్చ రాని రీతిలో గంట, రెండు గంటల వ్యవధిలో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు చొప్పున కొతల్ని విధించే పనిలోపడ్డారు. చెన్నైను మినహాయించి తక్కిన జిల్లాల్లో ఈ కొతల వాత వాయించే పనిలో అధికారులు ఉన్నారు. అప్పుడప్పుడూ పదిహేను, ఇరవై నిమిషాలు కొత విధించడంతో రోజుకు ఎలాగైనా రెండు నుంచి మూడు గంటల వరకు అనధికారిక కోతలు అమల్లోకి రావడం గమనార్హం.
పరిశ్రమలకు, వాణిజ్య కేంద్రాలకు అన్ని రకాల ఆంక్షలు ఎత్తి వేయడంతో విద్యుత్ వినియోగం పెరిగిందని ఓ అధికారి పేర్కొన్నారు. ఎండ దెబ్బతోనే ఈ వినియోగం పెరిగిందని, అదే సమయంలో సాంకేతిక సమస్యలు ఉత్పత్తికి ఆటకంగా మారాయని ఆ అధికారి వివరించారు. వళ్లూరు, ఉత్తర చెన్నైలలో తలెత్తిన సాంకేతిక సమస్యలు రెండు మూడు రోజుల్లో సరి చేస్తామన్నారు. ప్రజలకు నిరంతర విద్యుత్ అందించాలన్న కాంక్ష ప్రభుత్వానికి ఉన్నా, ఎప్పుడు ఎక్కడ సాంకేతిక సమస్య తలెత్తుతుందో, ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడుతాయో చెప్పలేమంటూ ఆ అధికారి పేర్కొనడం బట్టి చూస్తే నిరంతర విద్యుత్ సాధ్యమేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.