nuclear power station
-
కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రానికి ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడ వద్ద అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం సహాయమంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. కొవ్వాడతోపాటు మహారాష్ట్రలోని జైత్పూర్, గుజరాత్‌లోని ఛాయ, మిథి విర్ది, పశ్చిమ బెంగాల్‌లోని హరిపూర్, మధ్యప్రదేశ్‌లోని భీమ్‌పూర్‌లలో అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు వివరించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. కొవ్వాడలో 1,208 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు అణు రియాక్టర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దేశంలో ఏడువేల మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పాదన కోసం కర్ణాటక, çహరియాణా, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 10 అణు రియాక్టర్లలను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఆర్థిక, పాలనాపరమైన ఆమోదం ఇచ్చినట్లు తెలిపారు. సమూహం పద్ధతిలో నెలకొల్పే ఈ పది రియాక్టర్ల నిర్మాణం 2031 నాటికి పూర్తవుతుందని చెప్పారు. వీటి నిర్మాణం పూర్తయితే అదనంగా మరో ఏడువేల మెగావాట్ల అణువిద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. సౌర, పవన విద్యుత్ రంగాలకు వెదర్ డేటా ఇటీవల కాలంలో సౌర, పవన విద్యుత్ రంగాల్లో వాతావరణ సమాచారం వినియోగం విపరీతంగా పెరిగినందున ఆ రంగానికి వెదర్ డేటా కీలకంగా మారిందని సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియొరాలజీ (ఐఐటీఎం), ఇండియన్ మెటియొరాలజికల్ డిపార్ట్మెంట్ రూపొందించే వాతావరణ సమాచారాన్ని సౌర, పవన విద్యుత్ రంగాలతోపాటు అనేక రంగాలు వినియోగించుకుంటున్నాయని చెప్పారు. ఈ సంస్థలన్నీ పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ ఆధీనంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీతో కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధనరంగం వినియోగం కోసం వాతావరణం గురించి ముందస్తు సమాచారం అందించే కేంద్రాలు ఏర్పాటుచేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రసహాయ మంత్రి చెప్పారు. విదేశీ జైళ్లలో 3,335 మంది మత్స్యకారులు విదేశీ జైళ్లలో 3,335 మంది భారతీయ మత్స్యకారులు ఉన్నారని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి మురళీధరన్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. 2017లో 1,087 మంది, 2018లో 446 మంది, 2019లో 504 మంది, 2020లో 779 మంది మత్స్యకారులు బందీలయ్యారని చెప్పారు. సకాలంలో పాస్‌పోర్టుల డెలివరీకి ప్రాధాన్యం ఆంధ్రప్రదేశ్‌లో పాస్‌పోర్టులను సకాలంలో డెలివరీ చేయడం తమ ప్రాధాన్యత అని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ తెలిపారు. ఇందుకోసం సెలవుల్లో పనిచేయడం ద్వారా ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. బీజేపీ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, భీమవరం, తిరుపతి నగరాల్లో నాలుగు పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలున్నాయని చెప్పారు. ఇవి విశాఖపట్నం, విజయవాడలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాల పరిధిలో ఉన్నాయన్నారు. విశాఖపట్నం రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఇటీవల ఆర్‌పీవోను నియమించినట్లు చెప్పారు. విశాఖపట్నం ఆర్పీవోలో మంజూరైన పోస్టుల సంఖ్య 48 కాగా, వాస్తవసంఖ్య 42గా ఉందని తెలిపారు. విశాఖపట్నం ఆర్పీవోలో ప్రస్తుతం 1,926 పాస్‌పోర్ట్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, అందులో 1,283 గత ఏడురోజుల్లో వచ్చాయని వివరించారు. -
తేలియాడే అణువిద్యుత్ కేంద్రం
రష్యా: అకడమిక్ లోమనోసోవ్ అనే ఈ నావలో ప్రపంచంలోనే తొలిసారిగా అణువిద్యుత్ కేంద్రాన్ని రూపొందించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని షిప్‌యార్డులో రష్యా ప్రభుత్వ అణుశక్తి కార్పొరేషన్ దీన్ని నిర్మించింది. చుక్టోకాలోని పోర్ట్ ఆఫ్ పెవెక్కు దీన్ని తరలిస్తున్నారు. చుక్టోకాకు వెళ్లాక ఇంధనాన్ని నింపి ఉత్పత్తి ప్రారంభిస్తారు. 2019లో ప్రారంభమయ్యే ఈ కేంద్రం ద్వారా ఏటా 50వేల టన్నుల కార్బన్డయాక్సైడ్ ఉద్గారాన్ని తగ్గించవచ్చు. -
అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం
భారత ప్రభుత్వ మాజీ ఇంధన కార్యదర్శి ఈఏఎస్ శర్మ నెల్లూరు, సిటీ: కావలిలో ఏర్పాటు చేయబోతున్న అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ఉద్యమించాలని భారత ప్రభుత్వ మాజీ ఇంధన కార్యదర్శి ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. నగరంలోని ఇందిరాభవన్‌లో అణువిద్యుత్ కేంద్ర వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో 'అణువిద్యుత్ కేంద్రం–పొంచి ఉన్న ప్రమాదాలు' సదస్సు ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో 18 భాగస్వామ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణువిద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకించడం ఒక్కటే కాదని, దాని వల్ల వచ్చే నష్టాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయన్నారు. శ్రీకాకుళం సోమ్పేటలో బొగ్గు ఆధారిత ప్లాంట్‌కు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించారన్నారు. ఏ ఉద్యమమైనా విజయం సాధించాలంటే మహిళలు ఉద్యమంలో పాల్గొనాలన్నారు. అన్ని వర్గాలను కలుపుకుని ముందకు వెళ్లకపోతే, ఎన్ని సమావేశాలు పెట్టినా ఫలితం ఉండదన్నారు. ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ బాబూరావు మాట్లాడుతూ ప్రకృతి లేకపోతే మనం ఉండవనే విషయం అందరూ మర్చిపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీ మెడికల్ కళాశాల రేడియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసన్, రవికుమార్, శంకరయ్య, జనవిజ్ఞాన వేదిక, ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, లాయర్స్ యూనియన్, యూత్ ఫెడరేషన్, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కూడంకుళం అణు సెగ
భారత్-రష్యా భాగస్వామ్యంలో, రష్యా సరఫరా చేసిన సామగ్రి, సాంకేతిక పరి జ్ఞానంతో నిర్మించిన తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టులోని తొలి యూనిట్ బుధవారం ప్రారంభమైంది. వాస్తవానికి ఈ యూనిట్ 2013 జూలైలోనే పనిచేయడం మొదలెట్టింది. అదే ఏడాది అక్టోబర్‌లో దీన్ని దక్షిణాది గ్రిడ్‌కు అనుసంధానించారు. ఆ తర్వాత ఎన్నో సమస్యలతో కుంటుబడింది. దాదాపు 30 సార్లు అది మొరాయించిందని చెబుతున్నారు. రెండున్నరేళ్లు శ్రమపడితే తప్ప అది మళ్లీ పట్టాలెక్కలేదు. ఈమధ్యే అది స్థిరంగా పనిచేయడం ప్రారంభించింది. బుధ వారం లాంఛనంగా మొదలైన సందర్భంగా ఏర్పాటైన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్లతోపాటు తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత కూడా పాల్గొన్నారు. కూడంకుళంలోనే వెయ్యేసి మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసే మరో అయిదు యూనిట్లు కూడా రాబోతున్నాయి. ‘హరిత ఇంధనం’ మరింతగా సమకూర్చుకోవాలన్న ప్రణాళికలో ఇదంతా భాగమే నని మోదీ చెబితే... ఆందోళన వ్యక్తంచేసిన స్థానికులతో ఓపిగ్గా చర్చించి, వారి భయ సందేహాలను నివృత్తి చేసి, అత్యున్నతశ్రేణి భద్రతా ప్రమాణాలుండేలా చర్యలు తీసుకుని దీనికేర్పడిన ఆటంకాలన్నిటినీ అధిగమించామని జయలలిత వివరిం చారు. అణు విద్యుత్‌ను ‘హరిత ఇంధనం’గా అంగీకరించడానికి అణు విద్యుత్ వ్యతిరేక ఉద్యమకారులు ససేమిరా అంటారు. అలాగే ఆందోళన చేస్తున్న వారితో ప్రభుత్వం ఓపిగ్గా వ్యవహరించిదనడాన్ని కూడా నిజం కాదంటారు. ప్రాజెక్టుకున్నంత చరిత్ర దాని వ్యతిరేక ఉద్యమానికి కూడా ఉంది. పూర్వపు సోవియెట్ యూనియన్‌తో మన దేశానికి మైత్రీబంధం బలంగా ఉన్నప్పుడు 1988లో ఈ ప్రాజెక్టు ఆలోచన మొగ్గతొడిగింది. దీంతోపాటే కేరళలో మరో రెండు ప్రాజెక్టులు పెట్టాలనుకున్నా అక్కడ జరిగిన ఉద్యమంతో 1991నాటికి అవి మూలనబడ్డాయి. దేశ చరిత్రలో ఉద్యమాలకు తలవంచి అణు విద్యుత్ ప్రాజెక్టుల్ని ఆపడం అదే మొదటిసారి. ప్రజా ఉద్యమాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాన్ని మార్చుకోవడం ఈమధ్యకాలంలో లేదు గనుక... బహుశా అదే చివరిసారి కూడా కావచ్చేమో. కూడంకుళం విషయానికే వస్తే ప్రాజెక్టుపై బలహీనంగానైనా మొదటి నుంచీ ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. సునామీ సంభవించినప్పుడు జపాన్‌లోని ఫుకుషిమా అణు రియాక్టర్ ప్రమాదానికి లోనయ్యాక అది మరింత పెరిగింది. 2011నాటికి బలమైన ఉద్యమరూపం తీసుకుంది. అప్పటికి తమిళనాడు డీఎంకే పాలనలో ఉంది. ఈ ఉద్యమానికి జయలలిత కూడా మద్దతు పలికారు. స్థానికుల భయాందోళనలు పారదోలాకే ప్రాజెక్టు ప్రారంభం కావాలన్నది ఆమె డిమాండ్. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి ఆమె పార్టీ అధికారంలోకొచ్చాక తొలి కేబినెట్ భేటీలోనే కూడంకుళం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానించారు కూడా. ఆ తర్వాత వైఖరి మారింది. ఉద్యమం సందర్భంగా 6,000 మందికి పైగా పౌరులపై భారత శిక్షాస్మృతి సెక్షన్లు 121 (ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధానికి దిగడం), 124ఏ (రాజద్రోహం) కింద కేసులు దాఖల య్యాయి. బహుశా దేశవ్యాప్తంగా మావోయిస్టులు, కశ్మీర్ మిలిటెంట్ల విషయంలో కూడా ఇన్ని కేసులుండకపోవచ్చు. ఉద్యమానికి నాయకత్వంవహించిన ఉదయ్ కుమార్‌పైనే 101 కేసులున్నాయి. ఇందులో ఇంతవరకూ వీగిపోయినవి 35. అందుకే ఓపిగ్గా నచ్చజెప్పామన్న జయలలిత మాటలతో ఉద్యమకారులు విభేదిస్తున్నారు. ప్రాజెక్టుపై ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఉంది. స్థానికుల్లో అత్యధి కులు జాలరి వృత్తిపై ఆధారపడి ఉన్నవారు గనుక వారి జీవనోపాధి దెబ్బ తింటుం దన్నది ఉద్యమకారుల వాదన. అణు విద్యుత్ కేంద్రంనుంచి విడుదలయ్యే అణు వ్యర్థాల వల్ల సముద్రంలోని చేపలు, ఇతర జీవాలు చనిపోతాయని వారి భయం. పర్యవసానంగా సముద్రంలో ఎంతో లోపలకు వెళ్తే తప్ప చేపలు లభ్యంకావని, ఇది ప్రాణాలతో చెలగాటమని వారు చెబుతున్న మాట. ఇందుకు సంబంధించి తమిళ నాడు ప్రభుత్వం వారికి ఏం చెప్పిందో, వారి భయాందోళనలను ఎంత వరకూ పారదోలిందో తెలియదు. మత్స్యకారులకు కోల్డ్ స్టోరేజీ నిర్మాణం, పక్కా ఇళ్లు, రోడ్లు వగైరా పథకాలు చేపట్టడం నిజమే. జయలలిత చెప్పిన సామాజిక ఆస్తులు, మౌలిక సదుపాయాలూ ఇవే కావొచ్చు. అయితే సురక్షితమైన చేపల వేటకు దోహద పడే ఇతర అంశాల విషయంలో ప్రభుత్వం ఏం చేసిందో చూడాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యున్నత శ్రేణి భద్రతా ప్రమాణాలు పాటించామని చెబుతున్నా నిపుణుల వాదన వేరేలా ఉంది. యూనిట్ పని మొదలెట్టాక ఇంత వరకూ 825 రోజులు గడవగా అందులో వందశాతం పనిచేసిన 217 రోజుల్లో నిరంతరాయంగా పనిచేసింది 45 రోజులు మాత్రమేనని కొచ్చిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బీటీ పద్మనాభన్ గణాంక సహితంగా వివరిస్తున్నారు. 11 సందర్భాల్లో అయితే అత్యవ సరంగా ఆపేయాల్సివచ్చిందని అంటున్నారు. మన అభివృద్ధిలో ఇంధనం పాత్ర కీలకమైనదే. ప్రధాని అన్నట్టు అది పర్యా వరణానికి అనువైనదిగా ఉండటమూ అవసరమే. అణు విద్యుత్‌పై ప్రజానీకంలో ఉన్నవి అపోహలే అనుకున్నా వాటిని సందేహాతీతంగా తీర్చాల్సిన బాధ్యత పాలకులదే. ఫుకుషిమా తర్వాత జర్మనీలో ఉన్న 17 అణు విద్యుత్కేంద్రాల్లో 8 మూతబడ్డాయి. మిగిలిన కేంద్రాలను 2022కల్లా మూసేయాలని కూడా సంక ల్పించారు. 2010నాటికి ఆ దేశ విద్యుత్ అవసరాల్లో అణు విద్యుత్ శాతం 23 అయితే... పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 17శాతం. 2014లో అణు విద్యుత్ వాటా 16 శాతం, పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 28శాతంగా మారింది. విద్యుత్ అవసరాల్లో 75 శాతం అణు విద్యుత్‌పై ఆధారపడే ఫ్రాన్స్ సైతం మరో పదేళ్లలో దాన్ని సగానికి తగ్గించాలని నిరుడు నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో కూడా అణు విద్యుత్కేంద్రాలు స్థాపించాలన్న ఆలోచన ఉన్న నేపథ్యంలో ఇప్పటికే నిరసనలు రాజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పారదర్శకంగా అన్ని అంశాలనూ తేటతెల్లం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై మరింతగా ఉంది. -
కొవ్వాడలో అణుప్లాంట్‌ను వ్యతిరేకిస్తున్నాం
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటును సీపీఎం వ్యతిరేకిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. మోదీ రెండేళ్ల పాలనలో వైఫల్యాలను ఎండగడుతూ ప్రచురించిన పుస్తకాన్ని ఆయన గురువారం ఇక్కడ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. గుజరాత్‌ను సురక్షితంగా ఉంచి కొవ్వాడను ప్రమాదంలో పడేసేలా అణువిద్యుత్ కేంద్రాన్నిఎవరి ప్రయోజనాల కోసం మార్చారని ప్రశ్నించారు. కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుపై స్థానిక ప్రజలతో చర్చించి, భద్రత చర్యలు తీసుకున్నాకే చేపట్టాలని డిమాండ్ చేశారు. మోదీకి అమెరికా గతంలో పదేళ్ల పాటు వీసా ఇచ్చేందుకు నిరాకరించిందని, దానిని కప్పిపుచ్చుకునేందుకే రెండేళ్లలో నాలుగోసారి ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్లారని ఎద్దేవా చేశారు. బీజేపీ హిందుత్వ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక మత ఘర్షణలు పెరిగాయని విమర్శించారు. వ్యతిరేక పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ శక్తుల వికాసానికే పనిచేస్తోందని, రెండేళ్లలో సాధారణ ప్రజలకు ఏమీ సాధించలేకపోయినా సంబరాలు మాత్రం జరుపుకుంటోందని విమర్శించారు. కరువు ప్రాంతాల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించినా పట్టించుకోని ప్రభుత్వం ఇది అని ఏచూరి దుయ్యబట్టారు. -
అణుపార్కు కాదది.. ఆటంబాంబు
రణస్థలం : అణుపార్కు పెట్టడమంటే ఆటంబాంబు పెట్టడమేనని జైతాపూర్ అణువిద్యుత్ వ్యతిరేక పోరాట సమితి నాయకుడు డాక్టర్ వివేక్ మాంటోరి అన్నారు. ప్రతిపాదిత కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ప్రభావిత గ్రామాలైన కొవ్వాడ, కోటపాలెం, అల్లివలస గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఒక అణు రియాక్టర్ నుంచి ఏడాదికి 50 టన్నుల అణువ్యర్థాలు(ప్లుటోనియం) విడుదలవుతాయని, ఇది వెయ్యి ఆటంబాంబులతో సమానమన్నారు. జిల్లాలో ప్రధానమైన వ్యవసాయం, మత్స్యసంపద, తీరప్రాంతం మొత్తం అణుధార్మికత ప్రభావంతో మొత్తం విషతుల్యమై ప్రజల జీవనమే ప్రశ్నార్థకమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జైతాపూర్‌లో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిఘటించారని, అదే స్ఫూర్తితో ఇక్కడ పోరాడాలని పిలుపునిచ్చారు. కొవ్వాడలో అణుపార్కు ఏర్పాటై.. అందులో ఎటువంటి ప్రమాదం జరిగినా అటు ఒడిశా నుంచి ఇటు కాకినాడ వరకు సమస్త జీవకోటి నాశనమైపోతాయని హెచ్చరించారు. కాగా కొవ్వాడ ప్రాంతం భూకంపాల జోన్లో ఉన్నట్లు జియలాజికల్ సర్వే ఇఫ్ ఇండియా చెప్పిన విషయాన్ని మాంటోరి గుర్తు చేశారు. ఈ అణుపార్కును దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. ఒబామా పర్యటన సందర్భంగా అమెరికా సరఫరా చేసే రియాక్టర్ల వల్ల ప్రమాదం జరిగితే నష్టపరిహారం చెల్లించే బాధ్యత తీసుకోవడానికి ప్రధాని మోదీ ఇటీవలి ఒబామా పర్యటన సందర్భంగా అంగీకరించడం భారత సార్వభౌమత్వానికే ప్రమాదమన్నారు. సీఐటీయు జిల్లా ప్రధాన కారర్యదర్శి డి.గోవిందరావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అణువిద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకించిన బీజేపీ, టీడీపీలు అధికారంలోకి వచ్చిన వెంటనే అణువిద్యుత్‌కు అనుకూలంగా జీవోలు జారీ చేయడం ప్రజలను మోసగించడం కాదా? అని ప్రశ్నించారు. అణుపార్కు రద్దు చేసే వరకు ప్రజల మద్దతుతో పోరాటాలు ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సంజీవని పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షుడు కూన రాము, సీఐటీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.శ్రీనివాసరావు, సీహెచ్ అమ్మినాయుడు, అరబిందో, శ్యాంపిస్టన్స్, యూబీ తదితర సంస్థల కార్మిక సంఘాల నాయకులు కె.గురినాయుడు, ఎస్.సీతారామరాజు, సీహెచ్ సురేష్‌కుమార్, ఎం.శ్రీనివాసరావు, వి.లక్ష్మణరావు, జె. శ్యామలరావు, ఎన్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అణు విద్యుత్ కేంద్రంలో జవాన్ వీరంగం
పళ్లిపట్టు: విచక్షణ కోల్పోయిన ఓ జవాన్ కాల్పుల్లో ముగ్గురు సీఐఎస్ఎఫ్ జవాన్లు మృత్యువాత పడగా, మరో ఇద్దరు తీవ్రగాయూలపాలయ్యూరు. ఈ సంఘటన బుధవారం ఉదయం కాంచీపురం జిల్లా కల్పాక్కంలోని అణు విద్యుత్ కేంద్రంలో చోటు చేసుకుంది. కాంచీపురం జిల్లా కల్పాక్కంలోని అణువిద్యుత్ కేంద్రం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు (సీఐఎస్ఎప్) కట్టుబాటులో ఉంది. బుధవారం వేకువ జామున జవాన్లు రోల్‌కాల్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ విజయప్రతాప్‌సింగ్ బ్యారక్స్‌లో నిద్రిస్తున్న తన పై అధికారి రాజస్థాన్‌కు చెందిన మోహన్ సింగ్ (42)ను చేతిలో ఉన్న 9 ఎమ్ఎమ్ గన్‌తో కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ రోల్‌కాల్ నిర్వహిస్తున్న జవాన్లు ఆందోళనతో సంఘటన స్థలానికి పరుగులు తీశారు. జవానును సమీపిస్తున్న తరుణంలో విజయప్రతాప్ సింగ్ వారిపైనా కాల్పులు జరిపాడు. దీంతో సబ్ ఇన్స్పెక్టర్ గణేశన్(58), హెడ్ కానిస్టేబుల్ సుబ్బురాజ్(54) కూడా మృతి చెందగా, ప్రతాప్‌సింగ్, గోవర్ధన ప్రశాం త్ తదితరులు గాయపడ్డారు. అయినా పైరిం గ్ను విజయ్‌ప్రతాప్‌సింగ్ నిలపకపోవడంతో తక్కిన జవాన్లు చాకచక్యంగా ప్రతాప్‌సింగ్‌ను పట్టుకుని తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. గాయూలపాలైన జవాన్లను వెంటనే చెన్నై కేళంబాక్కంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరిలో గోవర్ధన ప్రతాప్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన జవాన్ల మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరుగులు తీసిన డీఐజీ, ఎస్పీ డీఐజీ సత్యమూర్తి, కాంచీపురం ఎస్పీ విజయకుమార్ తదితరులు సంఘటన ప్రాంతం చేరుకుని కాల్పుల సంఘటన పట్ల విచారణ జరిపా రు. ఇందులో జవాన్ల మధ్య చోటుచేసుకున్న మాటల యుద్ధమే ఫైరింగ్‌కు దారితీసిందని ప్రాథమికంగా తెలిసింది. కాల్పులు జరిపి ముగ్గురు మృతికి కారకుడైన విజయప్రతాప్సింగ్ను కల్పాక్కం పోలీసులు అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సిక్కోల్లో చంద్రబాబు సందడి
జిల్లాలోని రణస్థలం మండలం పతివాడపాలెం, నెలివాడ, దేరసాం గ్రామాల్లో సీఎం చంద్రబాబు గురువారం పర్యటించారు. నెలివాడలో జరిగిన సభలో డ్వాక్రా మహిళలతో కలిసి చిరునవ్వులు చిందించారు. పలు సంఘాలకు రుణాలు మంజూరుచేస్తూ చెక్కులు అందజేశారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో సీఎం పర్యటన ఉత్సాహంగా సాగింది. రణస్థలం/లావేరు: రణస్థలం మండలంలోని కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం వల్ల మంచే జరుగుతుందని, విద్యుత్ కొరత తీరుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు సన్నాహాలను విరమించుకోవాలని, ప్లాంట్ నిర్మాణానికి అనుకూలంగా జారీ అయిన జీవోను రద్దుచేయూలని కొవ్వాడ సర్పంచ్ మైలపల్లి పోలీసుతో పాటు పలువురు మత్స్యకారులు, సీఐటీయూ నాయకులు డి.గోవిందరావు, పి.తేజేశ్వరరావులు సీఎంను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై బాబు స్పందిస్తూ అణువిద్యుత్ కేంద్రం రద్దుకు ప్రయత్నం చేస్తానని, ఒక వేళ సాధ్యం కాకపోతే అణువిద్యుత్ కేంద్రం నిర్వాసితులకు పునరావాసం కోసం మంచి ప్యాకేజీ ఇప్పిస్తామంటూ సీఎం ఉచిత హామీ ఇచ్చారు. పైడిభీమవరంలో కార్మికుల కోసం 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలని సీఎంని కోరారు. అణువిద్యుత్ కేంద్రాన్ని రద్దు చేయాలని కోరుతూ అణుపార్కువ్యతిరేక ఉద్యమ కమిటీ సభ్యులు కూన రామం తదితరులు సీఎంకు వినతి పత్రం ఇచ్చారు. ఐకేపీ వీవోఎ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఉద్యోగులు సంఘం నాయకులు సీఎంకు వినతిపత్రం ఇచ్చారు. -
మళ్లీ సంక్షోభం
- పెరిగిన విద్యుత్ వినియోగం రెండు కేంద్రాల్లో - సాంకేతిక సమస్యలు విచ్చలవిడిగా కోతలు - అయోమయంలో సర్కారు రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ ప్రాజెక్టులు షాక్ ఇచ్చాయి. రెండు విద్యుత్ కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక సమస్య, భానుడి దెబ్బకు పెరిగిన విద్యుత్ వినియోగం వెరసి మళ్లీ సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. నిరంతర విద్యుత్ సరఫరా అమల్లో ఉన్న దృష్ట్యా చాప కింద నీరులా అనధికారిక కోతల వాతను మోగించేపనిలో విద్యుత్ బోర్డు నిమగ్నమైంది. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కొన్నేళ్లుగా అమల్లో ఉన్న విద్యుత్ కోతలు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. కొత్త ప్రాజెక్టుల ద్వారా గత ఏడాది చివర్లో విద్యుత్ ఉత్పత్తి ఆశాజనకంగా మారడంతో కోతల వేళలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. మిగులు విద్యుత్ రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం జయలలిత ముందుకు సాగారు. కొత్త ప్రాజెక్టులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఆశాజనకంగా మారడం, కూడంకులం అణువిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి మెరుగుపడటం వెరసి రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యంగా సీఎం కంకణం కట్టుకున్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి విద్యుత్ వాడకంపై ఉన్న అన్నిరకాల ఆంక్షల్ని ఎత్తివేశారు. నగరాల్లోనే కాదు కుగ్రామాల్లో సైతం నిరంతర విద్యుత్ సరఫరాతో ముందుకు సాగుతున్నారు. తొలి వారం నిరంతర సరఫరా ఆచరణ యోగ్యంగా ఉన్నా క్రమంగా సాంకేతిక సమస్యల్ని ఎత్తిచూపుతూ అప్పుడప్పుడూ సరఫరా నిలుపుదల చేస్తూవచ్చారు. పవర్ షాక్ వేసవి ముగియడంతో విద్యుత్ వాడకం తగ్గుముఖం పడుతుందని, ఉత్పత్తికి తగ్గట్టుగా వినియోగం ఉంటుందన్న ఆశాభావంతో నిరంతర సరఫరా నినాదాన్ని సీఎం జయలలిత తెరపైకి తెచ్చి తప్పులో కాలేశారు. అగ్ని నక్షత్రం ముగిసినా ఎండలు తగ్గడంలేదు. వర్షాలు సంమృద్ధిగా పడాల్సిన పరిస్థితుల్లో భానుడుప్రజల్ని ఇంకా పిప్పి చేస్తున్నాడు. ఈ ప్రభావంతో విద్యుత్ వినియోగం మరింత పెరిగింది. కొన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలినట్టయింది. రాష్ట్రంలో ఈ నెల ఆరంభంలో విద్యుత్ వినియోగం రోజుకు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల మెగావాట్లకు పెరిగింది. ఉత్పత్తి ఆశాజనకంగా ఉండడంతో నిరంతర విద్యుత్ సరఫరాను అమల్లోకి తెచ్చారు. అయితే క్రమంగా భానుడి దెబ్బకు వినియోగం పెరుగుతూ వచ్చింది. గురువారానికి రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 13 వేల ఆరు వందల మెగావాట్లకు చేరింది. వేసవిని తలపించే విధంగా ఎండలు మండుతుండడంతో ఏసీలు, ఫ్యాన్ల వాడకం పెరిగింది. ఈ ప్రభావం విద్యుత్ గండానికి దారి తీసింది. ఉత్తర చెన్నైలోని మూడు యూనిట్ల ద్వారా ఆరు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతూ వచ్చింది. ఇక్కడ అదనంగా ఆరు వందల మెగావాట్లు ఉత్పత్తి చొప్పున రెండు యూనిట్ల ఏర్పాటు పనులు వేగవంతం చేశారు. ఈ పనుల కారణంగా వారం రోజులుగా ఆ మూడు యూనిట్లలతో తాత్కాళికంగా విద్యుత్ సరఫరా నిలుపుదల చేశారు. ప్రస్తుతం ఆ యూనిట్లలో ఉత్పత్తి ప్రక్రియ ఆరంభించే సమయానికి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆరువందల మెగావాట్లు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. తిరువళ్లూరు జిల్లా వళ్లూరు సమీపంలో తలా ఐదు వందల మెగావాట్లు ఉత్పత్తి చొప్పున మూడు యూనిట్లు ఏర్పాటు చేశారు. ఓ యూనిట్లో బ్రాయిలర్ ట్యూబ్‌లు పేలడంతో ఉత్పత్తి ఆగిపోయింది. ఈ రెండు కేంద్రాల్లో తలెత్తిన సమస్యలతో 1100 మెగావాట్ల ఉత్పత్తికి బ్రేక్ పడింది. అలాగే తూత్తుకుడిలో సాంకేతిక కారణాలతో ఉత్పత్తి తగ్గుతుండడం, బయటి రాష్ట్రాల నుంచి విద్యుత్ సరఫరా లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక లైన్ల పనులు ముగిసినా, కేంద్రం నుంచి అనుమతి దక్కక పోవడం వెరసి నిరంతర విద్యుత్ సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. కోతల వాత తాత్కాళికంగా తలెత్తిన సమస్యలతో చాప కింద నీరులా కొతల్ని అమలుచేసే పనిలో విద్యుత్ బోర్డు వర్గాలు పడ్డాయి. నిరంతర విద్యుత్‌సరఫరా అమల్లో ఉన్న దృష్ట్యా, ప్రభుత్వానికి మచ్చ రాని రీతిలో గంట, రెండు గంటల వ్యవధిలో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు చొప్పున కొతల్ని విధించే పనిలోపడ్డారు. చెన్నైను మినహాయించి తక్కిన జిల్లాల్లో ఈ కొతల వాత వాయించే పనిలో అధికారులు ఉన్నారు. అప్పుడప్పుడూ పదిహేను, ఇరవై నిమిషాలు కొత విధించడంతో రోజుకు ఎలాగైనా రెండు నుంచి మూడు గంటల వరకు అనధికారిక కోతలు అమల్లోకి రావడం గమనార్హం. పరిశ్రమలకు, వాణిజ్య కేంద్రాలకు అన్ని రకాల ఆంక్షలు ఎత్తి వేయడంతో విద్యుత్ వినియోగం పెరిగిందని ఓ అధికారి పేర్కొన్నారు. ఎండ దెబ్బతోనే ఈ వినియోగం పెరిగిందని, అదే సమయంలో సాంకేతిక సమస్యలు ఉత్పత్తికి ఆటకంగా మారాయని ఆ అధికారి వివరించారు. వళ్లూరు, ఉత్తర చెన్నైలలో తలెత్తిన సాంకేతిక సమస్యలు రెండు మూడు రోజుల్లో సరి చేస్తామన్నారు. ప్రజలకు నిరంతర విద్యుత్ అందించాలన్న కాంక్ష ప్రభుత్వానికి ఉన్నా, ఎప్పుడు ఎక్కడ సాంకేతిక సమస్య తలెత్తుతుందో, ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడుతాయో చెప్పలేమంటూ ఆ అధికారి పేర్కొనడం బట్టి చూస్తే నిరంతర విద్యుత్ సాధ్యమేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. -
కూడంకుళం నంబర్ వన్!
1000 మెగావాట్లతో విద్యుదుత్పత్తి దేశంలో అత్యధిక సామర్థ్యం చాటిన అణువిద్యుత్ ప్లాంటు ఇదే చెన్నై: తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం(కేఎన్‌పీపీ) పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేసి రికార్డు సృష్టించింది. కేఎన్‌పీపీలోని ఒకటో యూనిట్లో శనివారం మధ్యాహ్నం 1:20 గంటల నుంచి వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి మొదలైందని, దేశంలో ఒక అణువిద్యుత్ కేంద్రం ఇంత సామర్థ్యంతో పనిచేయడం ఇదే తొలిసారి అని ప్లాంటు డెరైక్టర్ ఆర్ఎస్ సుందర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అణుశక్తి నియంత్రణ మండలి(ఏఈఆర్బీ) నిబంధనల ప్రకారం కొన్ని పరీక్షలు చేయాల్సి ఉన్నందున.. ఒకటో యూనిట్‌ను కొంత కాలవ్యవధి వరకూ పనిచేయించి తర్వాత ఆపివేస్తామన్నారు. దేశంలోని ఇతర అణువిద్యుత్ కేంద్రాలు ఇంతవరకూ 540 మెగావాట్లు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు 680 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో మాత్రమే పనిచేశాయని, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న విద్యుత్ కేంద్రాల సామర్థ్యం కూడా 700 మెగావాట్లేనన్నారు. కాగా, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా కూడంకుళం ప్లాంటును మూసివేయాలంటూ రెండేళ్లుగా స్థానిక ప్రజలు పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇవీ ప్లాంటు ప్రత్యేకతలు: 1. కేఎన్‌పీపీ దేశంలో నిర్మించిన 21వ అణువిద్యుత్ రియాక్టర్. దేశంలో తొలి ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ కూడా ఇదే. 2. రెండు యూనిట్లలోని రియాక్టర్లు అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలతో కూడిన థర్డ్ జనరేషన్ రియాక్టర్లు. 3. రెండు రియాక్టర్లూ వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో పనిచేయగలవు. 4. గత అక్టోబరు నుంచి పనిచేస్తున్న యూనిట్ 1 నుంచి ఇప్పటిదాకా 190 కోట్ల యూనిట్ల విద్యుత్ దక్షిణ గ్రిడ్‌కు అందింది. -
నామినేషన్ల పర్వం
చెన్నై, సాక్షి ప్రతినిధి : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా శనివారం తమిళనాడు, పుదుచ్చేరీల్లో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులెవరూ తొలిరోజున నామినేషన్ వేయలేదు. ఈనెల 5వ తేదీన ఎన్నికల షెడ్యూలు విడుదల కాగా ఒకే విడతలో ఈ నెల 24 వ తేదీన పోలింగ్‌ను ముగించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరిం చడం ప్రారంభించారు. ఉత్తర చెన్నై స్థానానికి ఎస్టీపీఐ అభ్యర్థి నిజాంముకై ద్దీన్, కోవై స్థానానికి సీపీఎం అభ్యర్థి పీఆర్ నటరాజన్, దిండుగల్లు స్థానానికి ఉళైప్పాలీ పార్టీ తరపున బాలసుబ్రమణియన్, తంజావూరు స్థానానికి వోలాలర్ మున్నేట్ర మున్నని అభ్యర్థిగా ఎన్ గుణశేఖరన్, కడలూరులో సీపీఐ అభ్యర్థి ఆర్ బాల సుబ్రమణ్యన్ నామినేషన్లు వేశారు. బాహ్య ప్రపంచంలోకి ఉదయకుమార్ కూడంకుళం అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడుపుతున్న ఉదయకుమార్, పుష్పరాయన్, నామినేషన్ల పర్వం జేసురాజన్ ఎన్నికల పుణ్యమా అని రెండున్నరేళ్ల తరువాత బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం వల్ల పర్యావరణ వినాశనం, ప్రజల ప్రాణాలకు విఘాతం అంటూ ఇడిందకరై గ్రామమే కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున పోరాటాలు ప్రారంభించారు. పోలీసుల నిషేధాజ్ఞలను ధిక్కరించి ఆందోళనలు సాగిస్తున్న వీరిపై సుమారు 400 కేసులున్నాయి. ఉద్యమకారులకు గ్రామస్తుల మద్దతు కారణంగా పోలీసులు వారిని అరెస్ట్ చేయలేకపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యనేత ప్రశాంత్‌భూషణ్ ఇటీవల ఉదయకుమార్ తదితరులను కలుసుకుని పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ముగ్గురు ఉద్యమకారులు పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎన్నికల ప్రచారం కోసం గ్రామం విడిచివెళితే అరెస్ట్ చేస్తారన్న సందేహంతో ఇటీవలే ముందస్తు బెయిల్‌కు మధురై హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పట్లో వారిని అరెస్ట్ చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది స్పష్టం చేయడంతో వారంతా బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టారు. కన్యాకుమారి స్థానానికి ఉదయకుమార్, నెల్లైకు ఫాదర్ జేసురాజన్, తూత్తుకూడికి పుష్పరాయన్ శనివారం నామినేషన్లు దాఖలు చేశారు. ముహూర్తాలు పెట్టుకున్న పార్టీలు అన్నాడీఎంకే అభ్యర్థుల 1వ తేదీ మధ్యాహ్నం 1.30 నుండి 3 గంటల లోగా నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎండీఎంకే, ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీల అభ్యర్థులు సైతం అదేరోజున నామినేషన్లు వేస్తారు.కాంగ్రెస్, డీఎంకే అభ్యర్థులు తమ నామినేషన్లు 2వ తేదీ వేయనున్నారు. పీఎంకే, పుదియ తమిళగం పార్టీ 3న, డీఎంకే కూటమిలోని వీసీకే అధినేత తిరుమావళవన్ 4న, బీజేపీ కూటమిలోని డీఎండీకే 5న నామినేషన్ వేసేందుకు సుముహూర్తం పెట్టుకున్నారు. -
‘అణు’వణువు అరిష్టమే
సోవియెట్ రష్యా కాలంలో నిర్మించిన చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రం పరిసరాలు రెండేళ్ల క్రితం పర్యాటక స్థలంగా మారాయి. ఏప్రిల్ 26, 1986లో జరిగిన ఘోర ప్రమాదంతో చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం అతి పెద్ద విషాదాన్ని ప్రపంచ చరిత్రలో మిగి ల్చింది. రోజువారీ విధులు జరుగుతూ ఉండగానే నాలుగో అణురియాక్టర్ పేలింది. హిరోషిమా అణుబాంబు విస్పోటనానికి నాలుగు వందల రెట్లు అధికంగా రేడియేషన్ (సైన్సు పరిభాషలో వికిరణం చెందడం) అణు విద్యుత్ కేంద్రం నుంచి ఆకాశంలోకి విడుదలైంది. సానుకూల దృక్కోణంతో మనిషి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అణుశక్తి లక్ష తునకలు చేసిన మొదటి సందర్భం ఇదే. తరువాత అదే స్థాయిలో అణుశక్తి మానవాళిని భయాందోళనలకు గురిచేసిన ఘటన జపాన్‌లోని ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో జరిగింది. ఈ రెండు దుర్ఘటనలను పరిశీలిస్తే అణుశక్తిని పౌర అవసరాలకు వినియోగించుకునే కార్యక్రమం, అణుయుద్ధం సృష్టించే విధ్వంసం దగ్గరగానే ఉంటాయా? అన్న ప్రశ్న రాకమానదు. మార్చి 11, 2011 నాటి భూకంపం, తరువాత వచ్చిన సునామీ కారణంగా ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రం దారుణంగా దెబ్బతిన్నది. దాయ్ ఇచి ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంగా ప్రసిద్ధి చెం దిన ఈ ఖాయిలా కేంద్రం లీకులతో ఈ ఆగస్టు 19 నుంచి జపాన్ను వణికిస్తున్నది. భూకంపం, దరిమిలా వచ్చిన సునామీతో ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం దాదాపు చతికిలపడింది. కానీ ఇందులో నుం చి వ్యర్థాలనూ, రేడియో ధార్మికతనూ క్రమబద్ధం చేయడానికి ఏర్పాటైన వ్యవస్థ సామర్థ్యం మీద ఇప్పుడు అందరికీ గుబులు రేగుతోంది. ఈ ఆగస్టు 19న రేడియో ధార్మికతతో ఉన్న నీరు కొన్ని తొట్టెల నుంచి జారి భయాం దోళనలకు గురి చేసింది. మరో మూడు తొట్టెల నుంచి కూడా ఇలాంటి నీరు కారుతున్నట్టు అనుమానం ఉందని ప్రస్తుతం ఈ కేంద్రం బాధ్యతలు స్వీకరించిన టోక్యో ఎల క్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) చెబుతోంది. ఆ తొట్టెల దగ్గర రేడియో ధార్మికతను గుర్తించిన తరువాతే టెప్కోకు ఇలాంటి అనుమానం కలిగింది. కానీ ఈ నీరు ఘోర విపత్తుకు దారి తీసే పరిమాణంలో కారడం లేదని మాత్రం టోప్కో చెబుతోంది. న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ చైర్మన్ షుంచి తనాకా మాటలు మాత్రం ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. మొదట గమనించిన లీకు చిన్నదే అయినా, దరిమిలా తలెత్తిన అనుమానాలు ఆందోళన కలిగించేవేనని ఆయన అంగీకరించారు. రేడియో ధార్మికత ప్రబలంగా ఉన్న మూడు వందల టన్నుల నీరు లీకైందనీ, కొంత నీరు భూమి లోపలి పొరలలోకి పోయినా, కొంత సముద్రంలోకి చేరిందన్న అనుమానం ఉం దని టెప్కో చెబుతోంది. ఇంతకీ ఈ నీరు ఆ తొట్టెల నుంచి ఎలా బయటకు వచ్చిందో ఇం తవరకు కనుగొనలేదు. ఆగస్టు 19న ఇదంతా జరిగింది. ఈ నీటిని రియాక్టర్లను చల్లార్చడానికి వినియోగించేవారు. ఇలాంటివి మొత్తం వేయి తొట్టెలు ఉంటాయి. వీటిలోకి రోజుకు రేడియో ధార్మికత వ్యర్థం, అది కలిసిన నీరు నాలుగు వందల టన్నుల వంతున చేరేది. పందొమ్మిదో తేదీతో పాటు, సెప్టెంబర్ 2న కూడా ఇలాంటి లీకేజీ సంభవించడంతో జనంలో భయాందోళనలు మరింత పెరి గాయి. విద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలో ఆ తొట్టెలను హడావిడిగా కట్టడం వల్లనే ఇలాంటి ఉపద్రవానికి కారణమని అనుమానాలు ఉన్నాయి. నిజానికి ఇందులో ఒక్క తొట్టె మాత్రమే సునామీ, భూకంపం వల్ల పాక్షికంగా ధ్వంసమైంది. లీకు జరిగినట్టు అనుమానిస్తున్న తొట్టెల దగ్గర కనుగొన్న రేడియేషన్ ప్రాణాంత కమైనది. గంటకు 1800 మిల్లీ సీవర్ట్స్ వంతున వచ్చే ఆ రేడియేషన్‌లో మనిషి నాలుగు గంటల పాటు ఉంటే మర ణం తప్పదు. నిజానికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం 50 మిల్లీ సీవర్ట్స్ రేడియేషన్ మించి విడుదల కాకూడదు. పాడుబడ్డ అణు విద్యుత్ కేంద్రం నుంచి వెలువడుతున్న కలుషిత జలాలను నిరోధించడానికి జపాన్ తక్షణమే చర్యలు తీసుకుం టుందని ప్రధాని షించో అబే సెప్టెంబర్ 2న ఆదరాబాదరా ప్రకటించారు. చెర్నోబిల్, ఫుకుషిమాల నుంచి ప్రజా రక్షణకు ఉపగ్రహ సాయం తీసుకోవాలని ఉక్రెయిన్, జపాన్ కలిసి ఆగమేఘాల మీద నిర్ణయించుకున్నాయి. హిరోషిమా, నాగసాకి అనుభవాలు ఉన్న జపాన్‌కు అణుశక్తి ప్రభావం ఏమిటో తెలియనది కాదు. రెండో ప్రపంచ యుద్ధం నాటి ఆ బాంబు ఫలితాలను నేటికీ ఆ దేశం అనుభవిస్తున్నది. ఇప్పుడు ఫుకుషిమా రేడి యో ధార్మికత కలిసిన జలం బెడద 2020లో జపాన్‌లో జరిగే ఒలింపిక్ క్రీడోత్సవాల మీద నీలినీడలు ప్రసరింపచేస్తుందని నేతలు భయపడుతున్నారు. చెర్నోబిల్ మాదిరిగానే ఫుకుషిమా విద్యుత్ కేంద్రం కూడా పర్యాటక కేం ద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణుల అభిప్రాయం. కానీ ఈ తరహా పర్యాటకానికి చీకటి పర్యాటకం (డార్క్ టూరిజం) అనే పేరు ఖాయపరుస్తున్నారు. ప్రపంచంలో ఇప్పుడు చాలాచోట్ల ఉన్న అణు విద్యుత్ కేంద్రాలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే చీకటి పర్యాటకం చాలా ఖండాలకు విస్తరింపచేయక తప్పదు. డా. గోపరాజు నారాయణరావు