‘అణు’వణువు అరిష్టమే | chernobyl Atomic power Centre Tragedy | Sakshi
Sakshi News home page

‘అణు’వణువు అరిష్టమే

Published Tue, Sep 3 2013 12:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM

‘అణు’వణువు అరిష్టమే

‘అణు’వణువు అరిష్టమే

సోవియెట్ రష్యా కాలంలో నిర్మించిన చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రం పరిసరాలు రెండేళ్ల క్రితం పర్యాటక స్థలంగా మారాయి. ఏప్రిల్ 26, 1986లో జరిగిన ఘోర ప్రమాదంతో  చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం అతి పెద్ద విషాదాన్ని ప్రపంచ చరిత్రలో మిగి ల్చింది. రోజువారీ విధులు జరుగుతూ ఉండగానే నాలుగో అణురియాక్టర్ పేలింది. హిరోషిమా అణుబాంబు విస్పోటనానికి నాలుగు వందల రెట్లు అధికంగా రేడియేషన్ (సైన్సు పరిభాషలో వికిరణం చెందడం) అణు విద్యుత్ కేంద్రం నుంచి ఆకాశంలోకి విడుదలైంది. సానుకూల దృక్కోణంతో మనిషి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అణుశక్తి లక్ష తునకలు చేసిన మొదటి సందర్భం ఇదే.
 
 తరువాత అదే స్థాయిలో అణుశక్తి మానవాళిని భయాందోళనలకు గురిచేసిన ఘటన జపాన్‌లోని ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో జరిగింది. ఈ రెండు దుర్ఘటనలను పరిశీలిస్తే అణుశక్తిని పౌర అవసరాలకు వినియోగించుకునే కార్యక్రమం, అణుయుద్ధం సృష్టించే విధ్వంసం దగ్గరగానే ఉంటాయా? అన్న ప్రశ్న రాకమానదు. మార్చి 11, 2011 నాటి భూకంపం, తరువాత వచ్చిన సునామీ కారణంగా ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రం దారుణంగా దెబ్బతిన్నది. దాయ్ ఇచి  ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంగా ప్రసిద్ధి చెం దిన ఈ ఖాయిలా కేంద్రం లీకులతో ఈ ఆగస్టు 19  నుంచి జపాన్‌ను వణికిస్తున్నది.
 భూకంపం, దరిమిలా వచ్చిన సునామీతో ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం దాదాపు చతికిలపడింది. కానీ ఇందులో నుం చి వ్యర్థాలనూ, రేడియో ధార్మికతనూ క్రమబద్ధం చేయడానికి ఏర్పాటైన వ్యవస్థ సామర్థ్యం మీద ఇప్పుడు అందరికీ గుబులు రేగుతోంది. ఈ ఆగస్టు 19న రేడియో ధార్మికతతో ఉన్న నీరు కొన్ని తొట్టెల నుంచి జారి భయాం దోళనలకు గురి చేసింది. మరో మూడు తొట్టెల నుంచి కూడా ఇలాంటి నీరు కారుతున్నట్టు అనుమానం ఉందని ప్రస్తుతం ఈ కేంద్రం బాధ్యతలు స్వీకరించిన టోక్యో ఎల క్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) చెబుతోంది. ఆ తొట్టెల దగ్గర రేడియో ధార్మికతను గుర్తించిన తరువాతే టెప్కోకు ఇలాంటి అనుమానం కలిగింది. కానీ ఈ నీరు ఘోర విపత్తుకు దారి తీసే పరిమాణంలో కారడం లేదని మాత్రం టోప్కో చెబుతోంది.
 
 న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ చైర్మన్ షుంచి తనాకా మాటలు మాత్రం ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. మొదట గమనించిన లీకు చిన్నదే అయినా, దరిమిలా తలెత్తిన అనుమానాలు ఆందోళన కలిగించేవేనని ఆయన అంగీకరించారు. రేడియో ధార్మికత ప్రబలంగా ఉన్న మూడు వందల టన్నుల నీరు లీకైందనీ, కొంత నీరు భూమి లోపలి పొరలలోకి పోయినా, కొంత సముద్రంలోకి చేరిందన్న అనుమానం ఉం దని టెప్కో చెబుతోంది. ఇంతకీ ఈ నీరు ఆ తొట్టెల నుంచి ఎలా బయటకు వచ్చిందో ఇం తవరకు కనుగొనలేదు. ఆగస్టు 19న ఇదంతా జరిగింది. ఈ నీటిని రియాక్టర్లను చల్లార్చడానికి వినియోగించేవారు. ఇలాంటివి మొత్తం వేయి తొట్టెలు ఉంటాయి. వీటిలోకి రోజుకు రేడియో ధార్మికత వ్యర్థం, అది కలిసిన నీరు నాలుగు వందల టన్నుల వంతున చేరేది. పందొమ్మిదో తేదీతో పాటు, సెప్టెంబర్ 2న కూడా ఇలాంటి లీకేజీ సంభవించడంతో జనంలో భయాందోళనలు మరింత పెరి గాయి. విద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలో  ఆ తొట్టెలను హడావిడిగా కట్టడం వల్లనే ఇలాంటి ఉపద్రవానికి కారణమని అనుమానాలు ఉన్నాయి. నిజానికి ఇందులో ఒక్క తొట్టె మాత్రమే సునామీ, భూకంపం వల్ల పాక్షికంగా ధ్వంసమైంది. లీకు జరిగినట్టు అనుమానిస్తున్న  తొట్టెల దగ్గర కనుగొన్న రేడియేషన్ ప్రాణాంత కమైనది. గంటకు 1800 మిల్లీ సీవర్ట్స్ వంతున వచ్చే ఆ రేడియేషన్‌లో మనిషి నాలుగు గంటల పాటు ఉంటే మర ణం తప్పదు. నిజానికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం 50 మిల్లీ సీవర్ట్స్ రేడియేషన్ మించి విడుదల కాకూడదు.
 
 పాడుబడ్డ అణు విద్యుత్ కేంద్రం నుంచి వెలువడుతున్న కలుషిత జలాలను నిరోధించడానికి జపాన్ తక్షణమే చర్యలు తీసుకుం టుందని ప్రధాని షించో అబే సెప్టెంబర్ 2న ఆదరాబాదరా ప్రకటించారు. చెర్నోబిల్, ఫుకుషిమాల నుంచి ప్రజా రక్షణకు ఉపగ్రహ సాయం తీసుకోవాలని ఉక్రెయిన్, జపాన్ కలిసి ఆగమేఘాల మీద నిర్ణయించుకున్నాయి. హిరోషిమా, నాగసాకి అనుభవాలు ఉన్న జపాన్‌కు అణుశక్తి ప్రభావం ఏమిటో తెలియనది కాదు. రెండో ప్రపంచ యుద్ధం నాటి ఆ బాంబు ఫలితాలను నేటికీ ఆ దేశం అనుభవిస్తున్నది. ఇప్పుడు ఫుకుషిమా రేడి యో ధార్మికత కలిసిన జలం బెడద 2020లో జపాన్‌లో జరిగే ఒలింపిక్ క్రీడోత్సవాల మీద నీలినీడలు ప్రసరింపచేస్తుందని నేతలు భయపడుతున్నారు. చెర్నోబిల్ మాదిరిగానే ఫుకుషిమా విద్యుత్ కేంద్రం కూడా పర్యాటక కేం ద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణుల అభిప్రాయం. కానీ ఈ తరహా పర్యాటకానికి చీకటి పర్యాటకం (డార్క్ టూరిజం) అనే పేరు ఖాయపరుస్తున్నారు. ప్రపంచంలో ఇప్పుడు చాలాచోట్ల ఉన్న అణు విద్యుత్ కేంద్రాలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే చీకటి పర్యాటకం చాలా ఖండాలకు విస్తరింపచేయక తప్పదు.
 డా. గోపరాజు నారాయణరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement