కూడంకుళం నంబర్ వన్!
1000 మెగావాట్లతో విద్యుదుత్పత్తి
దేశంలో అత్యధిక సామర్థ్యం చాటిన
అణువిద్యుత్ ప్లాంటు ఇదే
చెన్నై: తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం(కేఎన్‌పీపీ) పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేసి రికార్డు సృష్టించింది. కేఎన్‌పీపీలోని ఒకటో యూనిట్‌లో శనివారం మధ్యాహ్నం 1:20 గంటల నుంచి వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి మొదలైందని, దేశంలో ఒక అణువిద్యుత్ కేంద్రం ఇంత సామర్థ్యంతో పనిచేయడం ఇదే తొలిసారి అని ప్లాంటు డెరైక్టర్ ఆర్‌ఎస్ సుందర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అణుశక్తి నియంత్రణ మండలి(ఏఈఆర్‌బీ) నిబంధనల ప్రకారం కొన్ని పరీక్షలు చేయాల్సి ఉన్నందున.. ఒకటో యూనిట్‌ను కొంత కాలవ్యవధి వరకూ పనిచేయించి తర్వాత ఆపివేస్తామన్నారు. దేశంలోని ఇతర అణువిద్యుత్ కేంద్రాలు ఇంతవరకూ 540 మెగావాట్లు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు 680 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో మాత్రమే పనిచేశాయని, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న విద్యుత్ కేంద్రాల సామర్థ్యం కూడా 700 మెగావాట్లేనన్నారు. కాగా, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా కూడంకుళం ప్లాంటును మూసివేయాలంటూ రెండేళ్లుగా స్థానిక ప్రజలు పోరాడుతున్న సంగతి తెలిసిందే.
ఇవీ ప్లాంటు ప్రత్యేకతలు:
1. కేఎన్‌పీపీ దేశంలో నిర్మించిన 21వ అణువిద్యుత్ రియాక్టర్. దేశంలో తొలి ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ కూడా ఇదే.
2. రెండు యూనిట్లలోని రియాక్టర్లు అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలతో కూడిన థర్డ్ జనరేషన్ రియాక్టర్లు.
3. రెండు రియాక్టర్లూ వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో పనిచేయగలవు.
4. గత అక్టోబరు నుంచి పనిచేస్తున్న యూనిట్ 1 నుంచి ఇప్పటిదాకా 190 కోట్ల యూనిట్ల విద్యుత్ దక్షిణ గ్రిడ్‌కు అందింది.