సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడ వద్ద అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం సహాయమంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. కొవ్వాడతోపాటు మహారాష్ట్రలోని జైత్‌పూర్, గుజరాత్‌లోని ఛాయ, మిథి విర్ది, పశ్చిమ బెంగాల్‌లోని హరిపూర్, మధ్యప్రదేశ్‌లోని భీమ్‌పూర్‌లలో అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు వివరించారు.
రాజ్యసభలో గురువారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. కొవ్వాడలో 1,208 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు అణు రియాక్టర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దేశంలో ఏడువేల మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పాదన కోసం కర్ణాటక, çహరియాణా, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 10 అణు రియాక్టర్లలను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఆర్థిక, పాలనాపరమైన ఆమోదం ఇచ్చినట్లు తెలిపారు. సమూహం పద్ధతిలో నెలకొల్పే ఈ పది రియాక్టర్ల నిర్మాణం 2031 నాటికి పూర్తవుతుందని చెప్పారు. వీటి నిర్మాణం పూర్తయితే అదనంగా మరో ఏడువేల మెగావాట్ల అణువిద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
సౌర, పవన విద్యుత్ రంగాలకు వెదర్ డేటా
ఇటీవల కాలంలో సౌర, పవన విద్యుత్ రంగాల్లో వాతావరణ సమాచారం వినియోగం విపరీతంగా పెరిగినందున ఆ రంగానికి వెదర్ డేటా కీలకంగా మారిందని సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియొరాలజీ (ఐఐటీఎం), ఇండియన్ మెటియొరాలజికల్ డిపార్ట్‌మెంట్ రూపొందించే వాతావరణ సమాచారాన్ని సౌర, పవన విద్యుత్ రంగాలతోపాటు అనేక రంగాలు వినియోగించుకుంటున్నాయని చెప్పారు.
ఈ సంస్థలన్నీ పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ ఆధీనంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీతో కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధనరంగం వినియోగం కోసం వాతావరణం గురించి ముందస్తు సమాచారం అందించే కేంద్రాలు ఏర్పాటుచేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రసహాయ మంత్రి చెప్పారు.
విదేశీ జైళ్లలో 3,335 మంది మత్స్యకారులు
విదేశీ జైళ్లలో 3,335 మంది భారతీయ మత్స్యకారులు ఉన్నారని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి మురళీధరన్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. 2017లో 1,087 మంది, 2018లో 446 మంది, 2019లో 504 మంది, 2020లో 779 మంది మత్స్యకారులు బందీలయ్యారని చెప్పారు.
సకాలంలో పాస్‌పోర్టుల డెలివరీకి ప్రాధాన్యం
ఆంధ్రప్రదేశ్‌లో పాస్‌పోర్టులను సకాలంలో డెలివరీ చేయడం తమ ప్రాధాన్యత అని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ తెలిపారు. ఇందుకోసం సెలవుల్లో పనిచేయడం ద్వారా ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. బీజేపీ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, భీమవరం, తిరుపతి నగరాల్లో నాలుగు పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలున్నాయని చెప్పారు.
ఇవి విశాఖపట్నం, విజయవాడలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాల పరిధిలో ఉన్నాయన్నారు. విశాఖపట్నం రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఇటీవల ఆర్‌పీవోను నియమించినట్లు చెప్పారు. విశాఖపట్నం ఆర్‌పీవోలో మంజూరైన పోస్టుల సంఖ్య 48 కాగా, వాస్తవసంఖ్య 42గా ఉందని తెలిపారు. విశాఖపట్నం ఆర్‌పీవోలో ప్రస్తుతం 1,926 పాస్‌పోర్ట్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, అందులో 1,283 గత ఏడురోజుల్లో వచ్చాయని వివరించారు.
కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రానికి ఆమోదం
Published Fri, Jul 29 2022 4:17 AM | Last Updated on Fri, Jul 29 2022 10:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment