భారత్-రష్యా భాగస్వామ్యంలో, రష్యా సరఫరా చేసిన సామగ్రి, సాంకేతిక పరి జ్ఞానంతో నిర్మించిన తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టులోని తొలి యూనిట్ బుధవారం ప్రారంభమైంది. వాస్తవానికి ఈ యూనిట్ 2013 జూలైలోనే పనిచేయడం మొదలెట్టింది. అదే ఏడాది అక్టోబర్‌లో దీన్ని దక్షిణాది గ్రిడ్‌కు అనుసంధానించారు. ఆ తర్వాత ఎన్నో సమస్యలతో కుంటుబడింది. దాదాపు 30 సార్లు అది మొరాయించిందని చెబుతున్నారు. రెండున్నరేళ్లు శ్రమపడితే తప్ప అది మళ్లీ పట్టాలెక్కలేదు. ఈమధ్యే అది స్థిరంగా పనిచేయడం ప్రారంభించింది.
బుధ వారం లాంఛనంగా మొదలైన సందర్భంగా ఏర్పాటైన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతోపాటు తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత కూడా పాల్గొన్నారు. కూడంకుళంలోనే వెయ్యేసి మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసే మరో అయిదు యూనిట్లు కూడా రాబోతున్నాయి. ‘హరిత ఇంధనం’ మరింతగా సమకూర్చుకోవాలన్న ప్రణాళికలో ఇదంతా భాగమే నని మోదీ చెబితే... ఆందోళన వ్యక్తంచేసిన స్థానికులతో ఓపిగ్గా చర్చించి, వారి భయ సందేహాలను నివృత్తి చేసి, అత్యున్నతశ్రేణి భద్రతా ప్రమాణాలుండేలా చర్యలు తీసుకుని దీనికేర్పడిన ఆటంకాలన్నిటినీ అధిగమించామని జయలలిత వివరిం చారు. అణు విద్యుత్‌ను ‘హరిత ఇంధనం’గా అంగీకరించడానికి అణు విద్యుత్ వ్యతిరేక ఉద్యమకారులు ససేమిరా అంటారు. అలాగే ఆందోళన చేస్తున్న వారితో ప్రభుత్వం ఓపిగ్గా వ్యవహరించిదనడాన్ని కూడా నిజం కాదంటారు.
ప్రాజెక్టుకున్నంత చరిత్ర దాని వ్యతిరేక ఉద్యమానికి కూడా ఉంది. పూర్వపు సోవియెట్ యూనియన్‌తో మన దేశానికి మైత్రీబంధం బలంగా ఉన్నప్పుడు 1988లో ఈ ప్రాజెక్టు ఆలోచన మొగ్గతొడిగింది. దీంతోపాటే కేరళలో మరో రెండు ప్రాజెక్టులు పెట్టాలనుకున్నా అక్కడ జరిగిన ఉద్యమంతో 1991నాటికి అవి మూలనబడ్డాయి. దేశ చరిత్రలో ఉద్యమాలకు తలవంచి అణు విద్యుత్ ప్రాజెక్టుల్ని ఆపడం అదే మొదటిసారి. ప్రజా ఉద్యమాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాన్ని మార్చుకోవడం ఈమధ్యకాలంలో లేదు గనుక... బహుశా అదే చివరిసారి కూడా కావచ్చేమో. కూడంకుళం విషయానికే వస్తే ప్రాజెక్టుపై బలహీనంగానైనా మొదటి నుంచీ ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. సునామీ సంభవించినప్పుడు జపాన్‌లోని ఫుకుషిమా అణు రియాక్టర్ ప్రమాదానికి లోనయ్యాక అది మరింత పెరిగింది. 2011నాటికి బలమైన ఉద్యమరూపం తీసుకుంది.
అప్పటికి తమిళనాడు డీఎంకే పాలనలో ఉంది. ఈ ఉద్యమానికి జయలలిత కూడా మద్దతు పలికారు. స్థానికుల భయాందోళనలు పారదోలాకే ప్రాజెక్టు ప్రారంభం కావాలన్నది ఆమె డిమాండ్. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి ఆమె పార్టీ అధికారంలోకొచ్చాక తొలి కేబినెట్ భేటీలోనే కూడంకుళం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానించారు కూడా. ఆ తర్వాత వైఖరి మారింది. ఉద్యమం సందర్భంగా 6,000 మందికి పైగా పౌరులపై భారత శిక్షాస్మృతి సెక్షన్లు 121 (ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధానికి దిగడం), 124ఏ (రాజద్రోహం) కింద కేసులు దాఖల య్యాయి. బహుశా దేశవ్యాప్తంగా మావోయిస్టులు, కశ్మీర్ మిలిటెంట్ల విషయంలో కూడా ఇన్ని కేసులుండకపోవచ్చు. ఉద్యమానికి నాయకత్వంవహించిన ఉదయ్ కుమార్‌పైనే 101 కేసులున్నాయి. ఇందులో ఇంతవరకూ వీగిపోయినవి 35. అందుకే ఓపిగ్గా నచ్చజెప్పామన్న జయలలిత మాటలతో ఉద్యమకారులు విభేదిస్తున్నారు.
ప్రాజెక్టుపై ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఉంది. స్థానికుల్లో అత్యధి కులు జాలరి వృత్తిపై ఆధారపడి ఉన్నవారు గనుక వారి జీవనోపాధి దెబ్బ తింటుం దన్నది ఉద్యమకారుల వాదన. అణు విద్యుత్ కేంద్రంనుంచి విడుదలయ్యే అణు వ్యర్థాల వల్ల సముద్రంలోని చేపలు, ఇతర జీవాలు చనిపోతాయని వారి భయం. పర్యవసానంగా సముద్రంలో ఎంతో లోపలకు వెళ్తే తప్ప చేపలు లభ్యంకావని, ఇది ప్రాణాలతో చెలగాటమని వారు చెబుతున్న మాట. ఇందుకు సంబంధించి తమిళ నాడు ప్రభుత్వం వారికి ఏం చెప్పిందో, వారి భయాందోళనలను ఎంత వరకూ పారదోలిందో తెలియదు. మత్స్యకారులకు కోల్డ్ స్టోరేజీ నిర్మాణం, పక్కా ఇళ్లు, రోడ్లు వగైరా పథకాలు చేపట్టడం నిజమే. జయలలిత చెప్పిన సామాజిక ఆస్తులు, మౌలిక సదుపాయాలూ ఇవే కావొచ్చు. అయితే సురక్షితమైన చేపల వేటకు దోహద పడే ఇతర అంశాల విషయంలో ప్రభుత్వం ఏం చేసిందో చూడాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యున్నత శ్రేణి భద్రతా ప్రమాణాలు పాటించామని చెబుతున్నా నిపుణుల వాదన వేరేలా ఉంది. యూనిట్ పని మొదలెట్టాక ఇంత వరకూ 825 రోజులు గడవగా అందులో వందశాతం పనిచేసిన 217 రోజుల్లో నిరంతరాయంగా పనిచేసింది 45 రోజులు మాత్రమేనని కొచ్చిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బీటీ పద్మనాభన్ గణాంక సహితంగా వివరిస్తున్నారు. 11 సందర్భాల్లో అయితే అత్యవ సరంగా ఆపేయాల్సివచ్చిందని అంటున్నారు.
మన అభివృద్ధిలో ఇంధనం పాత్ర కీలకమైనదే. ప్రధాని అన్నట్టు అది పర్యా వరణానికి అనువైనదిగా ఉండటమూ అవసరమే. అణు విద్యుత్‌పై ప్రజానీకంలో ఉన్నవి అపోహలే అనుకున్నా వాటిని సందేహాతీతంగా తీర్చాల్సిన బాధ్యత పాలకులదే. ఫుకుషిమా తర్వాత జర్మనీలో ఉన్న 17 అణు విద్యుత్కేంద్రాల్లో 8 మూతబడ్డాయి. మిగిలిన కేంద్రాలను 2022కల్లా మూసేయాలని కూడా సంక ల్పించారు. 2010నాటికి ఆ దేశ విద్యుత్ అవసరాల్లో అణు విద్యుత్ శాతం 23 అయితే... పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 17శాతం. 2014లో అణు విద్యుత్ వాటా 16 శాతం, పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 28శాతంగా మారింది. విద్యుత్ అవసరాల్లో 75 శాతం అణు విద్యుత్‌పై ఆధారపడే ఫ్రాన్స్ సైతం మరో పదేళ్లలో దాన్ని సగానికి తగ్గించాలని నిరుడు నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో కూడా అణు విద్యుత్కేంద్రాలు స్థాపించాలన్న ఆలోచన ఉన్న నేపథ్యంలో ఇప్పటికే నిరసనలు రాజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పారదర్శకంగా అన్ని అంశాలనూ తేటతెల్లం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై మరింతగా ఉంది.
కూడంకుళం అణు సెగ
Published Thu, Aug 11 2016 12:23 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement