కొవ్వాడలో అణుప్లాంట్‌ను వ్యతిరేకిస్తున్నాం
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటును సీపీఎం వ్యతిరేకిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. మోదీ రెండేళ్ల పాలనలో వైఫల్యాలను ఎండగడుతూ ప్రచురించిన పుస్తకాన్ని ఆయన గురువారం ఇక్కడ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. గుజరాత్‌ను సురక్షితంగా ఉంచి కొవ్వాడను ప్రమాదంలో పడేసేలా అణువిద్యుత్ కేంద్రాన్నిఎవరి ప్రయోజనాల కోసం మార్చారని ప్రశ్నించారు. కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుపై స్థానిక ప్రజలతో చర్చించి, భద్రత చర్యలు తీసుకున్నాకే చేపట్టాలని డిమాండ్ చేశారు. మోదీకి అమెరికా గతంలో పదేళ్ల పాటు వీసా ఇచ్చేందుకు నిరాకరించిందని, దానిని కప్పిపుచ్చుకునేందుకే రెండేళ్లలో నాలుగోసారి ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్లారని ఎద్దేవా చేశారు.
బీజేపీ హిందుత్వ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక మత ఘర్షణలు పెరిగాయని విమర్శించారు. వ్యతిరేక పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ శక్తుల వికాసానికే పనిచేస్తోందని, రెండేళ్లలో సాధారణ ప్రజలకు ఏమీ సాధించలేకపోయినా సంబరాలు మాత్రం జరుపుకుంటోందని విమర్శించారు. కరువు ప్రాంతాల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించినా పట్టించుకోని ప్రభుత్వం ఇది అని ఏచూరి దుయ్యబట్టారు.