
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న దీక్షకు విలువలేదని ఆ రాష్ట్ర సీపీఎం కార్యదర్శి మధు అన్నారు. చంద్రబాబుది కేవలం రాజకీయ పోరాటం మాత్రమేనని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ మహాసభల ప్రాంగణంలో మధు విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లు మోదీ ప్రభుత్వంతో అంటకాగి ఇప్పడు కోట్లకు కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టి దీక్షలు చేయటం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.
మొదటి నుంచి విపక్షాలన్ని హోదా కోసం పోరాడుతున్నాయని.. అప్పుడు ఇదే టీడీపీ ప్రభుత్వం పోరాటాలు చేసిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిందని గుర్తు చేశారు. ప్యాకేజీలతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, ధర్నాలు, దీక్షలు అవసరం లేదన్న బాబు.. ఇప్పుడెందుకు దీక్షలు చేస్తున్నారని ప్రశ్నించారు. సీపీఎం, సీపీఐ, జనసేన కలసి ప్రజాసమస్యలపై పోరాడుతాయన్నారు. హోదా, విభజన హామీలు, ఏపీ రాజకీయ పరిస్థితులపై మహాసభల్లో చర్చ జరుగుతుందని.. పొత్తులపై ఎన్నికల సమయంలో చర్చిస్తామని మధు చెప్పారు.