అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం
-
భారత ప్రభుత్వ మాజీ ఇంధన కార్యదర్శి ఈఏఎస్ శర్మ
నెల్లూరు, సిటీ: కావలిలో ఏర్పాటు చేయబోతున్న అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ఉద్యమించాలని భారత ప్రభుత్వ మాజీ ఇంధన కార్యదర్శి ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. నగరంలోని ఇందిరాభవన్‌లో అణువిద్యుత్ కేంద్ర వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో 'అణువిద్యుత్ కేంద్రం–పొంచి ఉన్న ప్రమాదాలు' సదస్సు ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో 18 భాగస్వామ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణువిద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకించడం ఒక్కటే కాదని, దాని వల్ల వచ్చే నష్టాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయన్నారు. శ్రీకాకుళం సోమ్‌పేటలో బొగ్గు ఆధారిత ప్లాంట్‌కు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించారన్నారు. ఏ ఉద్యమమైనా విజయం సాధించాలంటే మహిళలు ఉద్యమంలో పాల్గొనాలన్నారు. అన్ని వర్గాలను కలుపుకుని ముందకు వెళ్లకపోతే, ఎన్ని సమావేశాలు పెట్టినా ఫలితం ఉండదన్నారు. ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ బాబూరావు మాట్లాడుతూ ప్రకృతి లేకపోతే మనం ఉండవనే విషయం అందరూ మర్చిపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీ మెడికల్ కళాశాల రేడియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసన్, రవికుమార్, శంకరయ్య, జనవిజ్ఞాన వేదిక, ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, లాయర్స్ యూనియన్, యూత్ ఫెడరేషన్, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.