సిక్కోల్లో చంద్రబాబు సందడి
జిల్లాలోని రణస్థలం మండలం పతివాడపాలెం, నెలివాడ, దేరసాం గ్రామాల్లో సీఎం చంద్రబాబు గురువారం పర్యటించారు. నెలివాడలో జరిగిన సభలో డ్వాక్రా మహిళలతో కలిసి చిరునవ్వులు చిందించారు. పలు సంఘాలకు రుణాలు మంజూరుచేస్తూ చెక్కులు అందజేశారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో సీఎం పర్యటన ఉత్సాహంగా సాగింది.
రణస్థలం/లావేరు: రణస్థలం మండలంలోని కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం వల్ల మంచే జరుగుతుందని, విద్యుత్ కొరత తీరుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు సన్నాహాలను విరమించుకోవాలని, ప్లాంట్ నిర్మాణానికి అనుకూలంగా జారీ అయిన జీవోను రద్దుచేయూలని కొవ్వాడ సర్పంచ్ మైలపల్లి పోలీసుతో పాటు పలువురు మత్స్యకారులు, సీఐటీయూ నాయకులు డి.గోవిందరావు, పి.తేజేశ్వరరావులు సీఎంను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై బాబు స్పందిస్తూ అణువిద్యుత్ కేంద్రం రద్దుకు ప్రయత్నం చేస్తానని, ఒక వేళ సాధ్యం కాకపోతే అణువిద్యుత్ కేంద్రం నిర్వాసితులకు పునరావాసం కోసం మంచి ప్యాకేజీ ఇప్పిస్తామంటూ సీఎం ఉచిత హామీ ఇచ్చారు. పైడిభీమవరంలో కార్మికుల కోసం 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మించాలని సీఎంని కోరారు. అణువిద్యుత్ కేంద్రాన్ని రద్దు చేయాలని కోరుతూ అణుపార్కువ్యతిరేక ఉద్యమ కమిటీ సభ్యులు కూన రామం తదితరులు సీఎంకు వినతి పత్రం ఇచ్చారు. ఐకేపీ వీవోఎ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఉద్యోగులు సంఘం నాయకులు సీఎంకు వినతిపత్రం ఇచ్చారు.