చిన్న పరిశ్రమలకు విద్యుత్ ని‘బంధనాలు’!
- 30 ఏళ్ల కిందటి ఫిక్స్‌డ్ చార్జీ విధానాలే నేటికీ అమలు
- వినియోగం జరగకున్నా కనీస చార్జీలు వసూలు
- హెచ్‌టీ కేటగిరీలో చేర్చడంతో భారం రెండింతలు
- విద్యుత్ సరఫరా మెరుగైనా పీక్ అవర్స్ సర్‌చార్జీ మోత
సాక్షి, హైదరాబాద్ : గతంలో విద్యుత్ కోతలతో కొట్టుమిట్టాడిన చిన్న పరిశ్రమలు.. ఇప్పుడు విద్యుత్ సంస్థల కాలం చెల్లిన నిబంధనల చట్రంలో విలవిల్లాడుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 25 వేలకుపైగా సూక్ష్మ, లఘు పరిశ్రమల్లో ఎక్కువ శాతం విద్యుత్ ఫిక్స్‌డ్ చార్జీల రూపంలో పెనుభారాన్ని మోస్తున్నాయి. సుమారు 30 ఏళ్ల కింద విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్న కాలంలో విద్యుత్ సంస్థలు నష్టాల బారిన పడకుండా ఈ ‘ఫిక్స్‌డ్ చార్జీల’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ వినియోగం పెరగడంతో లాభ నష్టాలను బేరీజు వేసుకుని యూనిట్ ధరను నిర్ణయిస్తున్నారు.
అయినా ఫిక్స్‌డ్ చార్జీలను వసూలు చేయడంతో నష్టపోతున్నామని చిన్న పరిశ్రమల యజమానులు వాపోతున్నారు. ఫిక్స్‌డ్ చార్జీల విధానాన్ని ఉపసంహరించాలని, అవసరమైతే యూనిట్ ధరను స్వల్పంగా పెంచాలని కోరుతున్నారు. యంత్రాల మరమ్మతులు, కార్మికుల సమస్యలు, జాబ్ ఆర్డర్లు లేకపోవడం వంటి కారణాలతో పరిశ్రమలను మూసి ఉంచినా.. ఫ్యాక్టరీ విద్యుత్ వినియోగ సామర్థ్యంలో 80 శాతం వరకు బిల్లులు చెల్లించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. వినియోగించే విద్యుత్‌కు మాత్రమే బిల్లు ఇవ్వాలని కోరుతున్నారు.
కేటగిరీ మార్పుతో మరింత భారం!
చిన్న తరహా పరిశ్రమలకు గతంలో కనెక్షన్ సామర్థ్యంతో సంబంధం లేకుండా లోటెన్షన్ (ఎల్‌టీ) కేటగిరీ కింద విద్యుత్ సరఫరా జరిగేది. పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని తర్వాత కాలంలో చిన్నతరహా పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఎల్‌టీ 3బి అనే నూతన కేటగిరీని సృష్టించారు. రూ.5 కోట్లలోపు పెట్టుబడులున్న పరిశ్రమలను చిన్నతరహా పరిశ్రమలుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే 2013-14లో విద్యుత్ సంస్థలు చిన్నతరహా పరిశ్రమలను హెచ్‌టీ కేటగిరీలోకి మార్చాయి. ఎల్‌టీ కేటగిరీలో కేవీఏ (కిలో ఓల్ట్ ఆంపియర్)కు రూ.53 కాగా.. హెచ్‌టీ కేటగిరీలో రూ.370 కావడం గమనార్హం. ఇక హెచ్‌టీ కేటగిరీ చార్జీలను 2016 జూలై నుంచి పెంచడంతో చిన్న పరిశ్రమలపై మరింత భారం పడింది.
సర్‌చార్జీ మోత
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉన్న 2010-13 మధ్యకాలంలో సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య విద్యుత్ వినియోగించే పరిశ్రమలపై సర్‌చార్జీ విధించారు. తర్వాత విద్యుత్ ఆంక్షలు ఎత్తేసినా సర్‌చార్జీల విధింపు కొనసాగుతోంది. ఇక తొలుత సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య సమయాన్ని మాత్రమే పీక్ అవర్స్‌గా గుర్తించగా.. ఆ తర్వాత దానికి ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య సమయాన్ని కూడా జోడించారు. దీంతో పీక్ అవర్స్ ఏకంగా 8 గంటలు ఉండడంతో సర్‌చార్జీ భారం పెరిగిందని చిన్న పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక మరోవైపు విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉన్న కాలంలో ఆంక్షలను ఉల్లంఘించి విద్యుత్‌ను వినియోగించిన పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను నిలిపివేసింది. ఇటీవల పారిశ్రామికవర్గాల విజ్ఞప్తుల మేరకు రూ.135 కోట్ల ప్రోత్సాహకాల నిధుల విడుదలకు సీఎం ఆదేశించడం కాస్త ఊరట అని పరిశ్రమల వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.