అదిరిందయ్యా సూర్యం
మండుతున్న ఎండలు
మంగళవారం 35.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
మరింత పెరగనున్నట్టు సంకేతాలు
ఫిబ్రవరి మూడో వారంలోనే భయపెడుతున్న భానుడు
సిటీబ్యూరో:నగరంలో అప్పుడే వేసవి ప్రభావం కనిపిస్తోంది. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఫిబ్రవరి మూడోవారంలోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం సిటీజనులకు ఆందోళన కలిగి స్తోంది. సాధారణంగా మార్చి తొలివారం నుంచి ఎండ తీవ్రత పెరుగుతుంది. కానీ మంగళవారం నగరంలో గరిష్టంగా 35.5 డిగ్రీలు, కనిష్టంగా 16.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ కాలుష్యం పెరగడం... గాలిలో తేమ శాతం తగ్గడం.. శీతాకాలంలో ఆశించిన మేర వర్షపాతం నమోదు కాకపోవడం ఎండ తీవ్రతకు కారణాలని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ శాస్త్రవేత్త సీతారాం ‘సాక్షి’కి తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరి మూడో వారంలో గరిష్టంగా 34.4 డిగ్రీలు... 2013 ఫిబ్రవరి 28న 35.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2005 ఫిబ్రవరి 16న 37.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పదేళ్ల తరవాత మళ్లీ ఇప్పుడు 35 డిగ్రీలకు మించి నమోదవడం విశేషం. ఈసారి మార్చి ఒకటి నుంచి మే 31 వరకు పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని... వేడిగాలులు సిటీజనులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మే నెలలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 45 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
ఇదిలాఉండగా ఉదయం స్వల్పంగా చలి, మధ్యాహ్నం అత్యధిక ఎండ వేడిమి ఉన్నందున ఇంటి నుంచిబయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బయటికి వెళ్లేటప్పుడు గొడుగు తీసుకెళ్లాలని, క్యాప్, చలువ కళ్లద్దాలు వాడాలని సూచిస్తున్నారు.
కొబ్బరి బోండాలు, లస్సీ వంటి శీతల పానీయాలతో పాటు పుచ్చకాయ వంటి పండ్లను అల్పాహారంగా తీసుకోవాలని చెబుతున్నారు. చర్మ సంరక్షణకు సన్‌స్క్రీన్ లోషన్లు వాడాలని సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు ఎండలో బయటికి వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు. చిన్నారుల విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.