యువతలో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలలో స్నేహితులు, సరదాలు, ఎక్కువ. ఈ క్రమంలో సరదగా, టైమ్‌పాస్‌గా మొదలయ్యే స్మోకింగ్, గుట్కా, ఆల్కహాల్ వంటి దురలవాట్లు, బయటతిండి తినడం కూడా వాళ్లలోనే ఎక్కువ. బయటి ఆహారం అందంగా కనిపించడానికి వాటిల్లో నూనెలు, ఉప్పుకారాలు ఎక్కువగా వాడటమే కాకుండా కొన్ని ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్, కెమికల్స్, వాడిన నూనెలే మళ్లీ మళ్లీ వాడుతుంటారు. ఇవి క్యాన్సర్ కారకాలు కావచ్చు.
దురలవాట్లు, బయటి తిండి ఎక్కువగా తీసుకోవడం, వృత్తిపరమైన కారణాలు, ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవడం, వాతావరణ కాలుష్యానికి గురవ్వడం, నైట్‌డ్యూటీలు, ఏసీ రూముల్లో నిద్రలేకుండా పనిచేయడం, శారీరక శ్రమ చాలా తక్కువగా ఉండటం ఇలా కారణాలు ఏమైతేనేం... మొత్తంగా చూస్తే పురుషులు స్త్రీలకంటే క్యాన్సర్‌కు ఎక్కువగా గురవుతారని మనం గమనించగలం. పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్ తప్పితే ఇంక ఏవి తీసుకున్నా స్త్రీలకంటే పురుషుల్లోనే ఎక్కువ.
కారణాలు...
ఉప్పు కారాలు, పచ్చళ్లు, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం, ఇంకా దురలవాట్లు ఉండటం వంటి అంశాలు పొట్టకు సంబంధించిన క్యాన్సర్‌కు గురిచేస్తుంటాయి. అందుకే భారతదేశంలోని పురుషులు జీర్ణవ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ల బారిన పడటం ఎక్కువ అని గణాంకాలు తెలియజేస్తున్నాయి. మన దేశంలోని పురుషులు నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్ క్యాన్సర్లకు గురవడం చాలా ఎక్కువగా గమనిస్తుంటాం.
అలవాట్లు, జీవనశైలి, ఆహారం ఆరోగ్యకరంగా లేకపోవడంతో పాటు పురుషుల్లో వారి వృత్తిపరమైన కారణాలూ ఉంటాయి. ఆస్‌బెస్టాస్ కంపెనీలో పనిచేసేవారు, అల్యూమినియమ్ కంపెనీల్లో పనిచేసేవారు, ఆల్కహాలిక్ బేవరేజెస్, పొగాకు ఉత్పత్తుల కంపెనీ, రేడియమ్ ఉత్పత్తులు, రేడియో న్యూక్లైడ్, చెక్కపొడి, గామారేడియేషన్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారికి ఊపిరితిత్తులు – హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్... ఇతర వృత్తుల వారి కంటే ఎక్కువగా వచ్చే ముప్పు ఉంటుంది.
ఎండకు ఎక్కువగా తిరగడం లేదా ఎండ అస్సలు తగలకుండా ఏసీ రూముల్లో అలా గంటల తరబడి కూర్చుని పనిచేయడం, నైట్‌డ్యూటీలు, పెస్టిసైడ్స్, కెమికల్స్‌కు మగవారే ఎక్కువగా గురవుతారు కాబట్టి వారికి క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. సాధారణంగా పురుషులు... అమ్మ లేదా భార్య ఏవి పెడితే అవి తింటూ ఉంటారు. వారు దగ్గరగా లేనప్పుడు లేదా బయటకు వెళ్లినప్పుడు తేలికగా దొరికే జంక్‌ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఫలితంగా ఊబకాయం ముప్పు కూడా ఉంటుంది. ఇది క్యాన్సర్ ముప్పును పెంచుతుంది.
నిర్ధారణ పరీక్షలు...
పురుషుల్లో వయసు పైబడ్డాక సాధారణంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ముందుగానే తెలుసుకోడానికి పీఎస్‌ఏ (ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్) అనే రక్తపరీక్షను 50 ఏళ్లు పైబడ్డాక చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు... వీర్యంలో, అలాగే మూత్రంలో రక్తం కనిపించడం, నడుము, తుంటి, పక్కటెముకల నొప్పులు, మూత్రసంబంధ సమస్యల వంటి లక్షణాలతో కనిపించేసరికి... దశ ముదిరిపోయి ఎముకలకు కూడా పాకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పీఎస్‌ఏ పరీక్షలో యాంటిజెన్ పెరగడాన్ని గమనిస్తే ఇతర పరీక్షలు, డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ (డీఆర్‌ఈ), ప్రోస్టేట్ బయాప్సీతో పాటు అవసరమైతే అల్ట్రాసౌండ్, బోన్‌స్కాన్, సీటీ స్కాన్, ఎమ్మారై, బయాప్సీ వంటి పరీక్షలు చేస్తారు.
యాభై ఏళ్లు పైబడిన పురుషుల్లో లక్షణాలు ఉన్నా లేకున్నా పీఎస్‌ఏ, డీఆర్‌ఈ పరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహా మేరకు ఎంతకాలం తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకుంటే మంచిదో తెలుసుకోవాలి.
పీఎస్‌ఏ పరీక్షల్లో మార్పులు ఎలా ఉంటున్నాయి, ఇంకా ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలనే విషయాల మీద అవగాహన పెంపొందించుకోవడం తప్పనిసరి.
పురుషుల్లో ఈ కింది లక్షణాలను నిర్లక్ష్యం చేయడం తగదు.
1. తగ్గని దగ్గు; ఆ దగ్గుతో పాటు రక్తం పడటం.
2. ఆకలి తగ్గడం, బరువు తగ్గడం
3. అంతుపట్టని జ్వరం, స్పష్టమైన కారణం లేకుండా ఆకస్మికంగా బరువు తగ్గడం
4. మూత్రం ఆగి ఆగి రావడం, రక్తం కనిపించడం
5. మలవిసర్జనలో రక్తస్రావం
6. తీవ్రమైన అజీర్తి
7. గొంతునొప్పి, ఘనపదార్థాలు తీసుకోలేకపోవడం
8. నోటిలో మానని పుండ్లు
9. ఎముకల్లో నొప్పులు.
పై లక్షణాలను ఇన్ఫెక్షన్స్ అనీ, పైల్స్ అనీ, రోగనిరోధక శక్తి తగ్గిందనీ, స్మోకింగ్ వల్ల కొద్దిగా దగ్గు వస్తూ ఉండటం మామూలేనంటూ నిర్లక్ష్యం చేయడం జరుగుతుంటుంది. కానీ వయసు కాస్త పైబడి, దురలవాట్లు ఉండి, లక్షణాలు కనిపిస్తే మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పురుషుల్లో ఎక్కువగా కనిపించే నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్, ప్రోస్టేట్ క్యాన్సర్లకు సంబంధించిన హెచ్చరికలు కావచ్చు. కాబట్టి ఆ మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ, క్యాన్సర్లపై అవగాహన పెంపొందించుకోవడం చాలా ముఖ్యం.
Comments
Please login to add a commentAdd a comment