Mens health
-
పురుషులకే క్యాన్సర్ ముప్పు అధికం.. ఈ పరీక్షలు తప్పనిసరి.. లక్షణాలేంటంటే?
యువతలో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలలో స్నేహితులు, సరదాలు, ఎక్కువ. ఈ క్రమంలో సరదగా, టైమ్‌పాస్‌గా మొదలయ్యే స్మోకింగ్, గుట్కా, ఆల్కహాల్ వంటి దురలవాట్లు, బయటతిండి తినడం కూడా వాళ్లలోనే ఎక్కువ. బయటి ఆహారం అందంగా కనిపించడానికి వాటిల్లో నూనెలు, ఉప్పుకారాలు ఎక్కువగా వాడటమే కాకుండా కొన్ని ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్, కెమికల్స్, వాడిన నూనెలే మళ్లీ మళ్లీ వాడుతుంటారు. ఇవి క్యాన్సర్ కారకాలు కావచ్చు. దురలవాట్లు, బయటి తిండి ఎక్కువగా తీసుకోవడం, వృత్తిపరమైన కారణాలు, ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవడం, వాతావరణ కాలుష్యానికి గురవ్వడం, నైట్‌డ్యూటీలు, ఏసీ రూముల్లో నిద్రలేకుండా పనిచేయడం, శారీరక శ్రమ చాలా తక్కువగా ఉండటం ఇలా కారణాలు ఏమైతేనేం... మొత్తంగా చూస్తే పురుషులు స్త్రీలకంటే క్యాన్సర్‌కు ఎక్కువగా గురవుతారని మనం గమనించగలం. పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్ తప్పితే ఇంక ఏవి తీసుకున్నా స్త్రీలకంటే పురుషుల్లోనే ఎక్కువ. కారణాలు... ఉప్పు కారాలు, పచ్చళ్లు, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం, ఇంకా దురలవాట్లు ఉండటం వంటి అంశాలు పొట్టకు సంబంధించిన క్యాన్సర్‌కు గురిచేస్తుంటాయి. అందుకే భారతదేశంలోని పురుషులు జీర్ణవ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ల బారిన పడటం ఎక్కువ అని గణాంకాలు తెలియజేస్తున్నాయి. మన దేశంలోని పురుషులు నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్ క్యాన్సర్లకు గురవడం చాలా ఎక్కువగా గమనిస్తుంటాం. అలవాట్లు, జీవనశైలి, ఆహారం ఆరోగ్యకరంగా లేకపోవడంతో పాటు పురుషుల్లో వారి వృత్తిపరమైన కారణాలూ ఉంటాయి. ఆస్బెస్టాస్ కంపెనీలో పనిచేసేవారు, అల్యూమినియమ్ కంపెనీల్లో పనిచేసేవారు, ఆల్కహాలిక్ బేవరేజెస్, పొగాకు ఉత్పత్తుల కంపెనీ, రేడియమ్ ఉత్పత్తులు, రేడియో న్యూక్లైడ్, చెక్కపొడి, గామారేడియేషన్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారికి ఊపిరితిత్తులు – హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్... ఇతర వృత్తుల వారి కంటే ఎక్కువగా వచ్చే ముప్పు ఉంటుంది. ఎండకు ఎక్కువగా తిరగడం లేదా ఎండ అస్సలు తగలకుండా ఏసీ రూముల్లో అలా గంటల తరబడి కూర్చుని పనిచేయడం, నైట్‌డ్యూటీలు, పెస్టిసైడ్స్, కెమికల్స్‌కు మగవారే ఎక్కువగా గురవుతారు కాబట్టి వారికి క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. సాధారణంగా పురుషులు... అమ్మ లేదా భార్య ఏవి పెడితే అవి తింటూ ఉంటారు. వారు దగ్గరగా లేనప్పుడు లేదా బయటకు వెళ్లినప్పుడు తేలికగా దొరికే జంక్‌ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఫలితంగా ఊబకాయం ముప్పు కూడా ఉంటుంది. ఇది క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. నిర్ధారణ పరీక్షలు... పురుషుల్లో వయసు పైబడ్డాక సాధారణంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ముందుగానే తెలుసుకోడానికి పీఎస్ఏ (ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్) అనే రక్తపరీక్షను 50 ఏళ్లు పైబడ్డాక చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు... వీర్యంలో, అలాగే మూత్రంలో రక్తం కనిపించడం, నడుము, తుంటి, పక్కటెముకల నొప్పులు, మూత్రసంబంధ సమస్యల వంటి లక్షణాలతో కనిపించేసరికి... దశ ముదిరిపోయి ఎముకలకు కూడా పాకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పీఎస్ఏ పరీక్షలో యాంటిజెన్ పెరగడాన్ని గమనిస్తే ఇతర పరీక్షలు, డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ (డీఆర్ఈ), ప్రోస్టేట్ బయాప్సీతో పాటు అవసరమైతే అల్ట్రాసౌండ్, బోన్‌స్కాన్, సీటీ స్కాన్, ఎమ్మారై, బయాప్సీ వంటి పరీక్షలు చేస్తారు. యాభై ఏళ్లు పైబడిన పురుషుల్లో లక్షణాలు ఉన్నా లేకున్నా పీఎస్ఏ, డీఆర్ఈ పరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహా మేరకు ఎంతకాలం తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకుంటే మంచిదో తెలుసుకోవాలి. పీఎస్ఏ పరీక్షల్లో మార్పులు ఎలా ఉంటున్నాయి, ఇంకా ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలనే విషయాల మీద అవగాహన పెంపొందించుకోవడం తప్పనిసరి. పురుషుల్లో ఈ కింది లక్షణాలను నిర్లక్ష్యం చేయడం తగదు. 1. తగ్గని దగ్గు; ఆ దగ్గుతో పాటు రక్తం పడటం. 2. ఆకలి తగ్గడం, బరువు తగ్గడం 3. అంతుపట్టని జ్వరం, స్పష్టమైన కారణం లేకుండా ఆకస్మికంగా బరువు తగ్గడం 4. మూత్రం ఆగి ఆగి రావడం, రక్తం కనిపించడం 5. మలవిసర్జనలో రక్తస్రావం 6. తీవ్రమైన అజీర్తి 7. గొంతునొప్పి, ఘనపదార్థాలు తీసుకోలేకపోవడం 8. నోటిలో మానని పుండ్లు 9. ఎముకల్లో నొప్పులు. పై లక్షణాలను ఇన్ఫెక్షన్స్ అనీ, పైల్స్ అనీ, రోగనిరోధక శక్తి తగ్గిందనీ, స్మోకింగ్ వల్ల కొద్దిగా దగ్గు వస్తూ ఉండటం మామూలేనంటూ నిర్లక్ష్యం చేయడం జరుగుతుంటుంది. కానీ వయసు కాస్త పైబడి, దురలవాట్లు ఉండి, లక్షణాలు కనిపిస్తే మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పురుషుల్లో ఎక్కువగా కనిపించే నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్, ప్రోస్టేట్ క్యాన్సర్లకు సంబంధించిన హెచ్చరికలు కావచ్చు. కాబట్టి ఆ మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ, క్యాన్సర్లపై అవగాహన పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. -
ఎమోషనల్ ఈటింగ్‌కు దూరంగా ఉండండి!
మెన్స్ హెల్త్ బొజ్జ రావడం, రాకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బొజ్జ మీ వైపు కన్నెత్తి కూడా చూడదు... ప్లేట్ పరిమాణం మీద దృష్టి పెట్టండి. ఒక అధ్యయనం ప్రకారం ప్లేట్ పరిమాణాన్ని బట్టి కూడా మనం తినే తిండి ఆధారపడి ఉంటుంది. పెద్ద ప్లేటులో తిన్నప్పుడు కాస్త గట్టిగానే లాగిస్తాం. అలాకాక తక్కువ, ఎక్కువ కాని ప్లేట్‌ను ఎంచుకోవడం మంచిది. బాగా పొద్దుపోయాక భోజనం చేయవద్దు. మరీ ఆకలిగా ఉంటే పండ్లుగానీ, స్నాక్స్ గానీ తినడం మంచిది. భోజనం చేసిన సమయానికి, బెడ్ మీద చేరే సమయానికి కనీసం మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ‘ఎమోషనల్ ఈటింగ్’కు దూరంగా ఉండండి. కొందరు విచారంలో ఉన్నప్పుడుగానీ, సంతోషంగా ఉన్నప్పుడుగానీ, కోపంగా ఉన్నప్పుడుగానీ సాధారణం కంటే చాలా ఎక్కువగా తింటారు. దీన్నే ‘ఎమోషనల్ ఈటింగ్’ అంటారు. దీనికి దూరంగా ఉండడం మంచిది. భావోద్వేగాలకు గురైనప్పుడు వెంటనే గ్లాస్ నీళ్లు తాగండి. కొద్దిసేపు నడవండి. ఫ్యాట్ ఫుడ్స్ ఏమిటి, లో-ఫ్యాట్ ఫుడ్స్ ఏమిటి? అనే దాని మీద అవగాహన ఉండాలి. నిద్రలేమి, తక్కువ నిద్రపోవడం లాంటి సమస్య వల్ల కూడా పొట్ట పెరుగుతుంది. -
పుషప్స్
మెన్స్ హెల్త్ పుషప్‌లను ఫిట్‌నెస్‌కు తిరుగులేని కొలమానం అంటుంటారు. ఫుషప్లు చేయడం మంచిదేగానీ... చాలా ఎక్కువగా చేయాలనే ఆరాటం వల్ల లేని సమస్యలు తలకెత్తుకోవాల్సి వస్తుంది. రోజుకు ఎన్ని పుషప్స్ చేస్తున్నామనేదానికంటే, ఎంత ఖచ్చితంగా(పర్ఫెక్ట్) చేస్తున్నామనేదే ముఖ్యం. మనం సరైన పద్ధతిలో చేస్తున్నపుడు తల నుంచి కాలి వేలి వరకు కండరాలు కదులుతాయి. పుషప్‌లు చేస్తున్న సమయంలో టేబుల్ క్లాక్‌ను దగ్గర పెట్టుకోండి. ‘నిన్నటితో పోలిస్తే వేగంగా చేస్తున్నామా? వేగం తగ్గిందా?’ ఇలాంటి విషయాలను బేరీజు వేసుకోవచ్చు. -
బంగాళదుంపల్లో...బంగారం నువ్వేలే!
మెన్స్ హెల్త్ బంగాళదుంపలు తినడం రుచికి మాత్రమే కాదు... ఆరోగ్యానికి కూడా చాలామంచిదని పౌష్టికాహార నిపుణులు చెబుతారు. మీరు తీసుకొనే ఆహారంలో బంగాళదుంపలు ఎంత శాతం తీసుకుంటున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. వీలైతే రోజూ తినండి. వీటి వల్ల ఉపయోగాలు..... విటమిన్ బి6 - బంగాళదుంపలలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. - ఇది గుండెపోటు రాకుండా నివారిస్తుంది. విటమిన్ సి - దంతాలు, ఎముకలు, జీర్ణక్రియ... మొదలైన వాటిలో కీలక పాత్ర పోషించే విటమిన్- సి బంగాళదుంపలలో పుష్కలం. - చర్మసంరక్షణకు, ఒత్తిడి నుంచి విముక్తి కావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. విటమిన్ డి - సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్లు రాకుండా అడ్డుకునే ’విటమిన్-డి’ బంగాళదుంపలలో ఉంటుంది. - గుండె, నరాలు, దంతాలు, చర్మానికి ఈ విటమిన్ మేలు చేస్తుంది. ఐరన్... అమోఘం - శరీరంలో ముఖ్య విధులు నిర్వహించే ఐరన్‌కు బంగాళదుంపలలో కొదవలేదు. -
కదలండి... లేవండి...కాస్త నడవండి!
మెన్స్ హెల్త్ ‘‘ఆయనకేమండీ... కడుపులో చల్ల కదలకుండా ఫ్యాను కింద కూర్చొని చేసే ఉద్యోగం’’ అంటుంటారు. కూర్చోవడాన్ని అదృష్టంగా చెబుతుంటారు. అయితే అదే పనిగా కూర్చుంటే దెబ్బై పోతామంటున్నారు ఆరోగ్యనిపుణులు. మధుమేహంతో బాధపడే వారు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఆ సమస్య మరింత ఎక్కువవుతుంది. సీట్లో ఎక్కువగా కూర్చోవడం అనేది... పొగతాగడం కంటే కూడా ప్రమాదమని, గుండెకు సంబంధించి రుగ్మతలు, కిడ్నీ సమస్యలు పెరగడానికి కారణమవుతుందని చెబుతున్నారు. ‘‘అధికంగా కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలను, రోజువారీ వ్యాయమాలు కూడా నివారించలేవు’’ అని బ్రిటన్‌కు చెందిన డా.ఎమ్మ విల్మట్ పరిశోధక బృందం హెచ్చరిస్తోంది. కొన్ని సూచనలు: సీట్లో నుంచి లేవలేనంత పని ఉండొచ్చు. అంతమాత్రాన సీటుకు అతుక్కుపోవాలని లేదు. ప్రతి అర్ధగంటకు ఒకసారి లేచి కనీసం అయిదు నిమిషాలైనా అటూ ఇటూ నడవడం మంచిది. కూర్చోవలసిన అవసరం లేకపోయినా...అదో తప్పనిసరి బాధ్యత అన్నట్లుగా కొందరు కుర్చీకి అతుక్కుపోతారు. నిలబడి కూడా మాట్లాడుకోవచ్చు కదా! రోజువారీ పనిగంటలలో ఎంత సేపు కూర్చున్నాము, ఎంత సేపు నిల్చున్నాము...అనేదాని గురించి అవగాహన ఏర్పరచుకోవాలి. బాలెన్స్ తప్పితే లోటును సరిదిద్దుకోవాలి. -
ఒకటి కాదు... రెండుసార్లు!
విశేషం సిద్ధార్థ మల్హోత్రా తెలుసుకదా? అదేనండీ...కరణ్ జోహర్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాలో కథానాయకుడిగా నటించాడు. ఫిబ్రవరి 2007 ‘మెన్స్ హెల్త్’ పత్రికకు కవర్ మోడల్‌గా పనిచేసిన సిద్ధార్థ....కొంత కాలానికి ముంబాయికి వచ్చి ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ సినిమాకు కరణ్ దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. ఆ తరువాత హీరో కూడా అయ్యాడు. ఏప్రిల్ 2014 ‘మెన్స్ హెల్త్’ కోసం తాజాగా మరోసారి మోడల్ అవతారం ఎత్తాడు. ‘‘ఈ ఏడు సంవత్సరాల్లో చాలా మార్పులు వచ్చాయి. మొదట్లో ఫోటో షూట్ చేయాల్సి వచ్చినప్పుడు నేను చేయగలనా అని సందేహించాను. ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో ఆత్మవిశ్వాసం వచ్చింది’’ అంటున్నాడు సిద్ధార్థ. విశేషం ఏమిటంటే ‘మెన్స్ హెల్త్’ కవర్ పేజీ మోడల్‌గా రెండు సార్లు చేసిన తొలి వ్యక్తి...సిద్ధార్థ మల్హోత్రా! -
ఆరోగ్యమైనా, ఆనందమైనా మగాళ్లకే ఎక్కువ!
సర్వే స్త్రీలతో పోలిస్తే పురుషులు ఆరోగ్యం, ఆనందం విషయంలో మెరుగైన స్థానంలో ఉన్నారని ఒక కొత్త సర్వే చెబుతోంది. ఈ సర్వే ప్రకారం... మహిళలతో పోలిస్తే పురుషులు చాలా తక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. 60 శాతం మంది పురుషులు నెలకు ఒకసారి మాత్రమే ఒత్తిడికి గురవుతున్నారు. 70 శాతం మంది పురుషులు తాము అరుదుగా మాత్రమే నిరాశ నిస్పృహలకు లోనవుతున్నామనీ, మానసిక స్థితిలో మార్పుకు గురవుతామనీ చెప్పారు. మహిళలో మాత్రం సగం మంది కనీసం నెలకు ఒకసారి డిప్రెషన్ బారిన పడతామని చెప్పారు. మహిళలతో పోల్చితే తలనొప్పి, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు పురుషులలో తక్కువగా ఉన్నాయి. మహిళల్లో సగం మందికి పైగా నెలలో చాలాసార్లు ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ‘‘మహిళలు ఆరోగ్యస్పృహతో ఉంటారు అనేది ఒక సాధారణ అభిప్రాయం. కానీ, సర్వేను బట్టి చూస్తే, పురుషులతో పోలిస్తే స్త్రీలు ఎక్కువగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారనే విషయం అర్థమవుతోంది. నిద్రలేమి, ఆందోళన, మానసిక, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో మహిళలు బాధ పడుతున్నారు’’ అంటున్నారు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఇంగ్లండ్‌కు చెందిన న్యూట్రీషియన్ నిపుణులు పెట్రిక్ హోల్ఫోర్డ్.