కదలండి... లేవండి...కాస్త నడవండి!
మెన్స్ హెల్త్
‘‘ఆయనకేమండీ... కడుపులో చల్ల కదలకుండా ఫ్యాను కింద కూర్చొని చేసే ఉద్యోగం’’ అంటుంటారు.
కూర్చోవడాన్ని అదృష్టంగా చెబుతుంటారు. అయితే అదే పనిగా కూర్చుంటే దెబ్బై పోతామంటున్నారు ఆరోగ్యనిపుణులు. మధుమేహంతో బాధపడే వారు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఆ సమస్య మరింత ఎక్కువవుతుంది. సీట్లో ఎక్కువగా కూర్చోవడం అనేది... పొగతాగడం కంటే కూడా ప్రమాదమని, గుండెకు సంబంధించి రుగ్మతలు, కిడ్నీ సమస్యలు పెరగడానికి కారణమవుతుందని చెబుతున్నారు.
‘‘అధికంగా కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలను, రోజువారీ వ్యాయమాలు కూడా నివారించలేవు’’ అని బ్రిటన్‌కు చెందిన డా.ఎమ్మ విల్‌మట్ పరిశోధక బృందం హెచ్చరిస్తోంది.
కొన్ని సూచనలు:
సీట్లో నుంచి లేవలేనంత పని ఉండొచ్చు. అంతమాత్రాన సీటుకు అతుక్కుపోవాలని లేదు. ప్రతి అర్ధగంటకు ఒకసారి లేచి కనీసం అయిదు నిమిషాలైనా అటూ ఇటూ నడవడం మంచిది.
కూర్చోవలసిన అవసరం లేకపోయినా...అదో తప్పనిసరి బాధ్యత అన్నట్లుగా కొందరు కుర్చీకి అతుక్కుపోతారు. నిలబడి కూడా మాట్లాడుకోవచ్చు కదా!
రోజువారీ పనిగంటలలో ఎంత సేపు కూర్చున్నాము, ఎంత సేపు నిల్చున్నాము...అనేదాని గురించి అవగాహన ఏర్పరచుకోవాలి. బాలెన్స్ తప్పితే లోటును సరిదిద్దుకోవాలి.