ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి... ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించుకోండి!
కొత్త పరిశోధన
ఎక్కువ కొవ్వులు, అధిక మాంసాహారం, పొట్టు తీసిన ధాన్యాలు (రిఫైన్డ్ గ్రెయిన్స్) తీసుకునేవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలు వెల్లడించాయి. ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పాటు, ఇతర అనేక క్యాన్సర్లు, వ్యాధులు నివారించడానికి ఆహారంలో ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, తాజాపండ్లు, చేపలు, పొట్టు ఉన్న ఆహారధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనవేత్తలు సలహా ఇస్తున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడిన 926 మంది పురుషులపై ఒక అధ్యయనం నిర్వహిస్తూ, వారి ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
అందులో దాదాపు అందరూ కొవ్వులు, మాంసాహారం, రిఫైన్డ్ ధాన్యాలు తీసుకునేవారే. పైన పేర్కొన్న ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేవారితో పోలిస్తే, మంచి జీవనశైలిని పాటించనివారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు రెండున్నర రెట్లు ఎక్కువ. పొగతాగే అలవాటు మానుకొని, జీవనశైలి మార్పులు చేసుకున్నవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ అవకాశాలు తగ్గాయనీ, ఈ విషయాలన్నింటినీ ‘క్యాన్సర్ ప్రివెన్షన్ రీసెర్చ్’ అనే మెడికల్ జర్నల్‌లో పొందుపరచినట్లుగా హార్వర్డ్ అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు.