What Is Prostate Cancer In Telugu: Symptoms And Causes, Treatment Details - Sakshi
Sakshi News home page

Prostate Cancer: మూత్రంలో ఇబ్బందా? పరీక్ష చేయించుకోండి

Published Tue, Jul 27 2021 3:39 PM | Last Updated on Tue, Jul 27 2021 6:16 PM

What Is The Main Symptoms And Causes Of Prostate Cancer In telugu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మగవారిలో ప్రోస్టేట్‌ గ్రంథికి సోకే క్యాన్సర్‌ను ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ అంటారు. మనకు వీర్యంలో కనబడే ద్రవాన్ని ఇది తయారుచేస్తుంది. వీర్యకణాలను మోసుకెళ్లడానికి ఈ ద్రవం ఉపయోగపడుతుంది. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ నెమ్మదిగా పెరుగుతుంది. మొదటిదశలో ఇది ప్రోస్టేట్‌ గ్రంథికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చికిత్స అవసరం అతి తక్కువగా ఉంటుంది లేదా కొందరి లో చికిత్స చేయాల్సిన అవసరమే రాకపోవచ్చు. 

కానీ కొన్ని రకాల ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వేగంగా విస్తరిస్తుంది. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను ముందుగానే... అంటే గ్రంథికి పరిమితమైన దశలోనే గుర్తిస్తే చికిత్స సులువవుతుంది. అయితే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ప్రారంభదశలో... దానికి సంబంధించిన ఎలాంటి లక్షణాలూ బయటపడకపోవచ్చు. వ్యాధి తీవ్రమైన దశలో మూత్ర విసర్జనలో ఇబ్బంది, మూత్రం లో లేదా వీర్యంలో రక్తం పడటం, మూత్రం ధారగా రాకపోవడం, కాళ్లవాపు, ఎముకలలో నొప్పి, పొత్తికడుపులో ఇబ్బంది... వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ రావడానికి ఖచ్చితమైన కారణాలు చెప్పలేం. వయసు పైబడటం, కుటుంబంలో ఎవరికైనా ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఉండటం, స్థూలకాయం వంటి ప్రోస్టేట్‌కు కారణాలు కావచ్చు. పురుషులు తమ 50 ఏటికి చేరగానే క్రమం తప్పకుండా ప్రోస్టేట్‌ స్క్రీనింగ్‌ చేయించుకోవడం మంచిది. 

డిజిటల్‌ రెక్టల్‌ ఎగ్జామ్‌ (డీఆర్‌ఈ), ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటిజన్‌ (పీఎస్‌ఏ) పరీక్షల ద్వారా ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చు. ఈ పరీక్షలలో రిపోర్ట్‌ ‘అబ్‌నార్మల్‌’గా వస్తే, అల్ట్రాసౌండ్, బయాప్సీ పరీక్షలు చేయించుకోవాలి, బయాప్సీలో పాజిటివ్‌గా వస్తే గ్రేడింగ్‌ చేయించుకోవాలి. అంటే వ్యాధి తీవ్రత ఏ దశలో ఉందో గుర్తించాలి. 

వ్యాప్తిని గుర్తించడం 
క్యాన్సర్‌ వ్యాధి ప్రోస్టేట్‌ గ్రంథిని దాటి ఇతర అవయవాలకూ వ్యాప్తి చెందిందా అని అనుమానం వస్తే సీటీ స్కాన్, ఎమ్మారై వంటి మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. 

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ దశలు (స్టేజ్‌లు) 
స్టేజ్‌ – 1 : మొదటి స్టేజ్‌లో ఉందంటే క్యాన్సర్‌ చాలా ప్రాథమిక దశలో ఉందని అర్థం.  
స్టేజ్‌ – 2 : ఈ దశలో క్యాన్సర్‌ సులభంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రోస్టేట్‌ గ్రంథికే పరిమితమై ఉంటుంది. 
స్టేజ్‌ – 3 : ఈ దశలో క్యాన్సర్‌... ప్రోస్టేట్‌ గ్రంథిని దాటి వీర్యవాహికలు లేదా సమీపంలోని ఇతర కణాజాలానికి పాకి ఉండవచ్చు. 
స్టేజ్‌ – 4 : ఈ దశలో లింఫ్‌ గ్రంథులు, ఎముకలు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు పాకి ఉంటుంది. 

చికిత్స వెంటనే అవసరం పడకపోవచ్చు... 
క్యాన్సర్‌ మొదటిదశలో ఉన్నవారికి వెంటనే చికిత్స చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో అప్రమత్తతో వేచిచూడాల్సిందిగా డాక్టర్లు రోగులకు సూచిస్తారు. అంటే క్రమం తప్పకుండా రక్తపరీక్షలు, పురీషనాళ పరీక్షలు, అవసరమైతే బయాప్సీ వంటివి చేయించుకుంటూ శరీరంలో కలిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అప్రమత్తతతో వేచిచూడటం అనేది క్యాన్సర్‌ చాలా నెమ్మదిగా వృద్ధిచెందుతున్నవారికీ, క్యాన్సర్‌ లక్షణాలు బయటపడని వారికి డాక్టర్లు సూచిస్తారు. క్యాన్సర్‌ వృద్ధి చెందుతున్నట్లు గమనిస్తే శస్త్రచికిత్స, రేడియోథెరపీ వంటి చికిత్స పద్ధతులను ఉపయోగిస్తారు. 

రేడియేషన్‌ థెరపీ : ఇందులో అధికశక్తి కలిగిన రేడియోధార్మిక కిరణాలు ఉపయోగించి క్యాన్సర్‌ కణాలను నిర్మూలిస్తారు. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌లో రెండు రకాలుగా రేడియేషన్‌ ఇస్తారు. శరీరం బయట నుంచి రేడియోధార్మికతను ఇవ్వడం, శరీరం లోపలే రేడియోధార్మిక కిరణాలు ప్రసరించేలా ఏర్పాటు చేయడం (బాకీథెరపీ). 

హార్మోన్‌ థెరపీ : ఇందులో శరీరంలోని టెస్టోస్టెరాన్‌ ఉత్పత్తిని నిలిపివేస్తారు. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌లో క్యాన్సర్‌ కణాలు టెస్టోస్టెరాన్‌ మీద ఆధారపడి వృద్ధి చెందుతుంటాయి. దాని సరఫరాను నిలిపివేయడం వల్ల క్యాన్సర్‌ కణాల వృద్ధి మందగించడం గానీ, అవి చనిపోవడంగానీ జరుగుతుంది. హార్మోన్‌ థెరపీని వివిధ రకాలుగా ఇవ్వవచ్చు. మందులతో టెస్టోస్టెరాన్‌ ఉత్పత్తిని నిలిపివేయడం.. వృషణాలు టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. అవి టెస్టోస్టెరాన్‌ను ఉత్పిత్తి చేయకుండా కొన్ని రకాల మందుల ద్వారా నిరోధించవచ్చు. టెస్టోస్టెరాన్‌ను క్యాన్సర్‌ కణాలకు అందకుండా చేయడం... ‘యాంటీ–యాండ్రోజన్‌’ మందుల ద్వారా టెస్టోస్టెరాన్‌ క్యాన్సర్‌ కణాలకు అందకుండా చేయవచ్చు. 

వృషణాలను తొలగించడం : రెండు వృషణాలను తొలగించడం ద్వారా శరీరంలో టెస్టోస్టెరాన్‌ పరిమాణాన్ని తగ్గించవచ్చు. ఇది కూడా హార్మోన్‌ థెరపీలాంటిదే. ఈ పద్ధతిలో టెస్టోస్టెరాన్‌ స్థాయిని వేగంగా తగ్గించవచ్చు. అయితే దీన్ని క్యాన్సర్‌ అడ్వాన్స్‌ స్టేజ్‌లో ఉన్నవారికి మాత్రమే ఉపయోగిస్తారు. క్యాన్సర్‌ ప్రాథమిక దశలో ఉన్నవారికి హార్మోన్‌ థెరపీ సరిపోతుంది. వృషణాలను తొలగించాల్సిన అవసరం ఉండదు. హార్మోన్‌ థెరపీ వల్ల క్యాన్సర్‌ కణుతులు కుంచించుకుపోతాయి. ఆ తర్వాత రేడియేషన్‌ చికిత్స చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. 

శస్త్రచికిత్స: శస్త్రచికిత్సలో ప్రోస్టేట్‌ గ్రంథిని, దాని చుట్టుపక్కల కణాజాలాన్ని, లింఫ్‌ గ్రంథుల్లో కొంతభాగాన్ని తొలగిస్తారు. అయితే దీనివల్ల అంగస్తంభన సమస్య. మూత్ర విసర్జనలో సమస్యలు తలెత్తవచ్చు. 

కీమోథెరపీ : ఇందులో మందుల ద్వారా క్యాన్సర్‌ కణాలను చంపడానికి ప్రయత్నిస్తారు. కీమోథెరపీలో మందులను ఇంజెక్షన్‌ల రూపంలో గానీ, మాత్రల రూపంలో గానీ ఇస్తారు. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ బాగా ముదిరి, శరీరంలోని ఇతర భాగాలకు పాకినట్లయితే కీమోథెరపీ ఇస్తారు. 

నిత్యం వ్యాయామం చేయడం, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం, దురలవాట్లకు దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement