మన మానవాళి విస్తరిస్తోందంటే దానికి తోడ్పడే గ్రంథుల్లో కీలకమైనది ప్రోస్టేట్. కేవలం పురుషులలో మాత్రమే ఉంటూ పునరుత్పత్తికి తోడ్పడే ఈ గ్రంథే లేకపోతే సంతానమే లేదు. వృషణాలు వీర్యకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ వీర్యకణాలు ఈదడానికి కావాల్సిన ద్రవాన్ని ఉత్పత్తి చేసే ఈ ప్రోస్టేట్ గ్రంథి... చాలామందిలో వాళ్ల 50వ ఏళ్ల వయసు తర్వాత అమాంతం పెరిగిపోయి కొన్ని అనర్థాలను తెచ్చిపెడుతుంది. అవేమిటో, వాటిని అధిగమించాల్సిన మార్గమేమిటో వివరించే కథనమిది.
ప్రోస్టేట్ సాధారణంగా 18–22 గ్రాముల బరువుంటుంది. కానీ 50 ఏళ్లు దాటిన కొందరిలో ఇది అకస్మాత్తుగా సైజు పెరిగిపోయే అవకాశం ఉంది. మానవ శరీర నిర్మాణం ఎంత సంక్లిష్టంగా ఉంటుందంటే... మూత్రంనాళం చుట్టూతా ఈ ప్రోస్టేట్ గ్రంథి ఆవరించి ఉండటంతో... ఇది హఠాత్తుగా సైజ్ పెరగడంతో ఆ నాళం నొక్కుకుపోయి... క్రితం రోజుదాకా సాఫీగా వచ్చిన మూత్రం అకస్మాత్తుగా ఆగిపోయి, లోపల ఎంతగానో మూత్రం వస్తున్నట్లు అనిపిస్తున్నా, ఎంతగా ముక్కుతున్నా రాక బెంబేలెత్తిస్తుంది.
అలాంటి సమయాల్లో అత్యవసరంగా హాస్పిటల్‌కు వెళ్లాల్సిన స్థితిలో ‘ప్రోస్టేట్ పెరుగుదల’ (ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్) తెలుస్తుంది. కొందరిలో మాత్రమే ఇలా పెరిగిపోయే ఈ గ్రంథి సైజు... ఎందుకంత హఠాత్తుగా పెరిగిపోతుందనేది ఇప్పటికీ వైద్యవర్గాలకు తెలియని రహస్యమే. అది వయసు పెరగడం వల్ల వచ్చే అనేక పరిణామాల్లో అదీ ఒకటిగా భావిస్తున్నారు.
రెండు రకాలుగా పెరుగుదల:
ప్రోస్టేట్ పెరుగుదల రెండు రకాలుగా ఉంటుంది. సైజు పెరిగినప్పటికీ ఆ కణాల్లో ఏదీ ప్రమాదకరం కాకుండా కేవలం సైజు మాత్రమే పెరుగుతుంది. ఇలాంటి పెరుగుదలను ‘బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా’ అంటారు.
ఇక రెండోది క్యాన్సర్ కణాల వల్ల సంభవిస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ కారణంగా ఆ గ్రంథి సైజు పెరుగుతుంది. ఇది ప్రమాదకరం. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా.
లక్షణాలు: ప్రోస్టేట్ పెరుగుదలలో రెండు విధాలుగా లక్షణాలు కనిపిస్తాయి. మొదటిది స్టోరేజీ... అంటే మూత్రం భర్తీ అవడం వల్ల కనిపించే లక్షణాలు. రెండోది వాయిడింగ్... అంటే మూత్రపు సంచి (బ్లాడర్) ఖాళీ కావడానికి సంబంధించిన లక్షణాలు.
స్టోరేజీ:
రాత్రివేళల్లో మామూలు కంటే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సిరావడం.
పగటివేళల్లో కూడా చాలా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సిరావడం.
మూత్రం ఏమాత్రం ఆపుకోలేకపోవడం.
మూత్రవిసర్జనపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం.
వాయిడింగ్:
► మూత్రవిసర్జన కోసం నిలబడ్డ తర్వాత ఎంతోసేపటికి గాని మూత్రపు ధార మొదలుకాకపోవడం.
► మూత్రపుధార మెల్ల మెల్లగా, ఆగుతూ ఆగుతూ వస్తుండటం.
► మూత్రపు సంచి (బ్లాడర్) ఖాళీ కావడానికి చాలా సమయం తీసుకోవడం.
► మూత్రవిసర్జన అన్నది ఎప్పటిలా సాఫీగా కాకుండా చాలా శ్రమతో, బాధతో జరుగుతున్నట్లుగా అనిపించడం.
► మూత్రవిసర్జనలో నొప్పి.
► మూత్రవిసర్జన ముగిసే సమయానికి ముక్కి ముక్కి పోయాల్సిరావడం.
► ఆ తర్వాత కూడా మూత్రం ఎంతోకొంత లోపలే ఉండిపోవడం (లేదా అలా ఉండిపోయిన ఫీలింగ్ ఉండటం).
► ఒక్కోసారి మూత్రపు ధారలో రక్తపు చారిక కనిపించడం (మూత్రంలో లేదా బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇది కనిపిస్తుంది).
నివారణ:
ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ నివారణ పూర్తిగా మన అదుపులో ఉండదు. అయితే కొన్ని సాధారణ జాగ్రత్తల ద్వారా ప్రోస్టేట్ సమస్యలను కొంతవరకు నివారించవచ్చు. అవి...
► మూత్రవిసర్జన ఫీలింగ్ రాగానే... ఆపుకోకుండా వెంటనే మూత్రవిసర్జన చేసేయాలి.
► కెఫిన్ మోతాదులు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింకులూ, కాఫీ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.
► నిద్రకు ఉపక్రమించబోయే ముందర 2 – 3 గంటల ముందుగా మాత్రమే నీళ్లు తాగడం / ద్రవాహారాలు తీసుకోవడం.
► డాక్టర్ సలహా లేకుండా అలర్జీల కోసం / ఊపిరితిత్తుల్లోకి గాలి సాఫీగా ప్రవహించేలా చేసే డీ–కంజెస్టెంట్స్ లేదా యాంటీహిస్టమైన్ మందులు తీసుకోకపోవడం. ► ఇవి బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా ముప్పును పెంచే అవకాశం ఉంది.
►చాలా చల్లని వాతావరణంలో మనల్ని మనం వెచ్చగా ఉంచుకోవడం (చలి వాతావరణం ఈ సమస్యను మరింత పెంచుతుంది).
► చురుగ్గా ఉండాలి. ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
► పొత్తికడుపు కండరాలపై నియంత్రణను పెంచే ‘కెగెల్స్ ఎక్సర్‌సైజ్’లు ప్రాక్టీస్ చేయడం కొంతవరకు మేలు చేస్తుంది.
► శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవడం.
చికిత్స:
ప్రోస్టేట్ గ్రంథికి వచ్చిన సమస్య, పెరుగుదలకు కారణాలూ, దాని తీవ్రతా, లక్షణాలూ... బాధితులు ఎదుర్కొనే సమస్యలను బట్టి చికిత్స ఉంటుంది. ఉదాహరణకు...
►ప్రోస్టెటైటిస్ : ప్రోస్టేట్ గ్రంథికి వచ్చే ఇన్ఫెక్షన్‌ను ప్రోస్టెటైటిస్ అంటారు. మిగతా ఇన్ఫెక్షన్‌ల లాగానే దీనికి యాంటిబయాటిక్స్‌తో చికిత్స చేస్తే పూర్తిగా తగ్గుతుంది. కాకపోతే కాస్త ఎక్కువ కాలం పాటు ఈ చికిత్స చేయాల్సి ఉంటుంది.
► మూత్రాన్ని ఏమాత్రం ఆపుకోలేకపోవడం, మూత్రధారలో రక్తపు చారిక, పెరిగిన ప్రోస్టేట్ గ్రంథి అన్నివైపుల నుంచి నొక్కేయడం వల్ల మూత్రం లోపలే ఉండిపోవడం, మాటిమాటికీ వచ్చే ఇన్ఫెక్షన్లూ, కిడ్నీ దెబ్బతినడం వంటి సమస్యల్ని తొలుత మందులతో అదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పటికీ మందులతో అదుపు సాధ్యం కాకపోతే అప్పుడు శస్త్రచికిత్స అవసరమవుతుంది.
► ప్రోస్టేట్ పెరిగిన పరిమాణం, దాని ఆకృతి వంటి అంశాలను బట్టి వేర్వేరు రకాల ప్రక్రియలు (ప్రొసీజర్స్) అవసరమవుతాయి. వీటన్నింటిలో బినైన ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా సమస్య కోసం సాధారణంగా ‘ట్రాన్స్ యురెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్’(టీయూఆర్‌పీ) అనే శస్త్రచికిత్స ప్రక్రియను అనుసరిస్తుంటారు.
► కొందరిలో లేజర్ సహాయంతో ‘లేజర్ ప్రోస్టెక్టమీ’ చేస్తుంటారు. మామూలు శస్త్రచికిత్సతో పోలిస్తే దీనిలో కొన్ని ప్రయోజనాలు ఎక్కువ. రక్తాన్ని పలచబార్చే మందులు వాడుతున్నవారికీ, ప్రోస్టేట్ సైజు విపరీతంగా పెరిగినవారు, గుండె సమస్యలున్నవారికీ లేజర్ సహాయంతో చేసే చికిత్స వల్ల ప్రయోజనాలుంటాయి.
ఉదాహరణకు
► రక్తస్రావం చాలా తక్కువ
►హాస్పిటల్‌లో ఉండాల్సిన వ్యవధి కూడా తక్కువ కావడం
► త్వరగా కోలుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటాయి.
పై అంశాలను దృష్టిలో ఉంచుకుని... మూత్రవిసర్జన కోసం చాలాసేపు టాయ్‌లెట్‌లో గడపాల్సి వస్తున్నా, ధార సరిగా లేకపోయినా, విసర్జన తర్వాత కొంత మిగిలిపోయినట్లు అనిపిస్తున్నా... ఒకసారి యూరాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకుని, అవసరాన్ని బట్టి తగిన చికిత్స తీసుకోవడం మేలు.
సమస్య నిర్ధారణ ఇలా
► ఈ సమస్య నిర్ధారణ కోసం వైద్యులు ‘డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్’ (డీఆర్‌ఈ) ద్వారా ప్రోస్టేట్ పెరిగినదీ, లేనిదీ తెలుసుకుంటారు. దాంతో పాటు...
► మైక్రోస్కోప్ సహాయంతో ఏవైనా ఇన్ఫెక్షన్స్‌ను అన్వేషిస్తూ చేసే మూత్రపరీక్ష
► యూరిన్ కల్చర్ ఎగ్జామినేషన్
► మూత్ర ప్రవాహ వేగం (యూరనరీ ఫ్లో / యూరోఫ్లోమెట్రీ)
► పొత్తికడుపు భాగంలో నిర్వహించే ఆల్ట్రాసౌండ్ స్కానింగ్. ఈ పరీక్ష ద్వారా మూత్రపిండాలు (కిడ్నీ), యురేటర్ (మూత్రపిండం నుంచి మూత్రపు సంచి వరకు ఉండే ట్యూబ్) , మూత్రపు సంచి (బ్లాడర్)ల పరిమాణంతో పాటు మూత్రపు సంచిలో మూత్రం మిగిలిపోతోందా అన్న విషయాలు తెలుస్తాయి.
► బ్లడ్ యూరియా, క్రియాటినైన్ పరీక్షలు.
డా. వి. చంద్రమోహన్,
సీనియర్ యూరాలజిస్ట్, యూరో సర్జన్
Comments
Please login to add a commentAdd a comment