మా అన్నయ్య వయసు 48 ఏళ్లు. కొద్దికాలంగా ప్రోస్టేట్ సమస్యతో బాధపడుతున్నాడు. ఈమధ్య తరచూ యూరిన్ సమస్యలు ఎక్కువకావడం, జ్వరం కూడా ఎక్కువగా రావడంతో పెద్దాసుపత్రిలో చూపించాం. అన్ని రకాల పరీక్షలు చేసి ప్రోస్టేట్ క్యాన్సర్ అని చెప్పారు. ఎడమ కిడ్నీలోని కొంతభాగానికి కూడా క్యాన్సర్ సోకిందరి పరీక్షల్లో తేలింది. రొబోటిక్ వైద్య విధానంలో ‘ప్రోస్టెక్టమీ’, ‘నెఫ్రెక్టమీ’ శస్త్రచికిత్స చేయించాలని ఇక్కడి డాక్టర్లు చెపా్పరు.
దయచేసి మాకు ఈ వ్యాధి గురించి, దాంతో పాటు ఈ శస్త్రచికిత్సల గురించి వివరంగా తెలియజేయండి. మా అన్నయ్యకు ఇంకా చాలా జీవితం ఉంది. ఈ వయసులోనే ప్రోస్టేట్ గ్రంథిని తొలగిస్తే తర్వాత వచ్చే దుష్ఫలితాలు, వ్యంధ్వత్వం వంటివి ఏమైనా వస్తాయా? అలాగే ఇంత పెద్ద సర్జరీ చేయడం వల్ల ప్రాణహాని ఏదైనా ఉంటుందా అని మా కుటుంబం మొత్తం చాలా ఆందోళన పడుతున్నాం. దయచేసి అన్నీ వివరంగా తెలపగలరు.
ముందుగా మీరు అడిగిన వివరాల ప్రకారం వరసగా మీకు సమాధానం ఇస్తాను. మీరు సర్జరీ విషయంలో ఎక్కువగా ఆందోళన చెందవద్దు. మీ కుటుంబసభ్యులకు కూడా భయపడొద్దని చెప్పండి. ప్రోస్టేట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్‌లకు ఇప్పుడు అత్యాధునికమైన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రోస్టేట్ గ్రంథిలో సమస్యలున్నప్పుడు... మరీ ముఖ్యంగా క్యాన్సర్ ఉన్నప్పుడు దాన్ని తొలగించాల్సి వస్తుంది. ఈ శస్త్రచికిత్సను ‘రాడికల్ ప్రోస్టెక్టమీ’ అంటారు. లాపరోస్కోపీ ద్వారా ప్రోస్టేట్‌ను తొలగించేసమయంలో దాని చుట్టుపక్కల ఉన్న చిన్న నాడులు సరిగా కనిపించక పొరబాటున అవి తెగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల వ్యంధత్వం వచ్చే అవకాశాలుంటాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ తొలగిపోయి, ప్రాణాపాయం తప్పిపోయినప్పటికీ వాళ్లు ఇంపొటెంట్ కావడం చాలా బాధాకరంగా ఉంటుంది. అలాంటపుపడు ఈ సమస్య రాకుండా సర్జరీ చేయడం రొబోటిక్స్ ద్వారా సాధ్యమవుతుంది. లోపల ఉన్న శరీర భాగాలు పదివంతులు ఎక్కువ పెద్దగా కనిపించడం వల్ల చిన్న చిన్న నాడులు సైతం స్పష్టంగా కనిపిస్తుంటాయి. కాబట్టి అవి తెగిపోకుండా జాగ్రత్తగా సర్జరీ చేయడం సాధ్యమవుతుంది.
ఇక కిడ్నీ ట్యూమర్లు / క్యాన్సర్లు / పెద్ద పెద్ద ట్యూమర్లు ఉంటే కొన్ని సందర్భాల్లో కిడ్నీ మొత్తాన్ని తీసేయాల్సి వస్తుంది. ఇలా తొలగించే ప్రక్రియను ‘రాడికల్ నెఫ్రెక్టమీ’ అంటారు. కానీ చిన్నసైజు ట్యూమర్లు ఉన్నప్పుడు కణితి వరకు మాత్రమే తీసేసి, మిగిలిన కిడ్నీని కాపాడవచ్చు. దీన్ని ‘పార్షియల్ నెఫ్రెక్టమీ’ అంటారు. ఓపెన్, లాపరోస్కోపీ, రొబోటిక్ సర్జరీ ఇలా అన్ని ప్రక్రియల ద్వారా కూడా పార్షియల్ నెఫ్రెక్టమీ చేయవచ్చు. కానీ రొబోటిక్స్ ద్వారా మరింత సమర్థంగా ఈ శస్త్రచికిత్స చేయడం సాధ్యమవుతుంది. ట్యూమర్‌ను తొలగించే సమయంలో కిడ్నీని కట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు రక్తం ఎక్కువగా పోతుంది. ఇది అరగంట కన్నా ఎక్కువ సేపు జరిగితే కిడ్నీ డ్యామేజీ అవుతుంది. కానీ రొబోటిక్స్ ద్వారా కిడ్నీ కట్ చేయడం, కుట్లు వేయడం చాలా తొందరగా అయిపోతాయి. కాబట్టి అధిక రక్తస్రావం ఉండదు. కిడ్నీ దెబ్బతినేందుకు ఆస్కారం ఉండదు. ఇప్పుడు రొబోటిక్స్ శస్త్రచికిత్సల గురించి సవివరంగా చెబుతాను. ఇప్పుడు ఎన్నో రకాల కిడ్నీ సమస్యలకు సురక్షితమైన పరిష్కారం చూపిస్తున్నది రొబోటిక్ సర్జరీ. వైద్యరంగంలో ఎన్ని మార్పులు వచ్చినా పేషెంట్ సేఫ్టీయే చివరి లక్ష్యంగా ఉంటుంది.
మొదట్లో సర్జరీ అంటే పెద్ద కోత పెట్టి చేసే ఓపెన్ సర్జరీయే. గుండె, ఊపిరితిత్తులకు సంబంధించివైతే ఛాతీ తెరచి సర్జరీ చేయాలి. పొట్టలోని అవయవాలకు సంబంధించినదైతే పొట్టపై గాటు పెట్టాలి. కానీ లాపరోస్కోపిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చిన తర్వాత పెద్ద కోత అవసరం లేకుండానే మూడు, నాలుగు రంధ్రాలు మాత్రమే పెట్టి చేసే కీహోల్ సర్జరీ రోగులకు వరప్రదాయని అయ్యింది. కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్లకు కూడా లాపరోస్కోపీ చేసేవారు. ఇలా లాపరోస్కోపీ అందుబాటులోకి వచ్చిన తర్వాత శరీరాన్ని కోసే బాధ తప్పింది. కేవలం చిన్న చిన్న గాట్లతో రంధ్రాలు చేసి లోపలికి కెమెరా, లాపరోస్కోపిక్ పరికరాన్ని పంపి సర్జరీ చేయవచ్చు. లోపలి అవయవాలను స్క్రీన్ మీద స్పష్టంగా చూడవచ్చు. వాటిని తెర మీద చూస్తూ లోపల సర్జరీ చేయవచ్చు. లాపరోస్కోపిక్ పరికరం 2డి విజన్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల లోపలి అవయవాలను 2 డైమన్షనల్‌గా చూపిస్తుంది. కోత ఉండదు కాబట్టి రక్తస్రావమై రక్తం నష్టపోయే అవకాశం ఉండదు. హాస్పిటల్ కూడా మూడు, నాలుగు రోజులుంటే చాలు. త్వరగా కోలుకుంటారు. అయితే కొన్ని ప్రొసిజర్లలో లాపరోస్కోపీ చేయడం కష్టం.
కిడ్నీలో ట్యూమర్ ఉంటే కణితి వరకే తీసేసి మిగిలింది కుట్లు వేయాలి. ఇది లాపరోస్కోపీలో కష్టం. దీనికి చాలా నైపుణ్యం అవసరం. ఎంతో అనుభవం కావాలి. స్థూలకాయం ఉన్నవాళ్లలో కూడా లాపరోస్కోపీతో ఆపరేషన్ ఇంకా కష్టమవుతుంది. ఇక రోబోతో చేసే సర్జరీకి రోబో చేతుల సహాయంతోనే డాక్టర్లు సర్జరీ చేయిస్తారు. తెరమీద లోపలి అవయవాలను చూస్తూ రోబో పరికరాన్ని ఎటు ఎలా తిప్పాలనేది డాక్టర్ కంట్రోల్ చేస్తుంటారు. అందుకు అనుగుణంగా రోబో చేతులు చకచకా ఆపరేషన్ చేసేస్తుంటాయి. రొబోటిక్ సర్జరీకి కూడా పెద్ద కోత పెట్టాల్సిన అవసరం ఉండదు. దీనికి కూడా లాపరోస్కోపీ లాగానే కేవలం ఒక సెం.మీ. గాట్లు... మూడ్నాలుగు పెట్టాల్సి ఉంటుంది. లాపరోస్కోపీ ద్వారా చేయలేని సర్జరీలను రోబోతో చేయవచ్చు.
పైగా రోబో యంత్రానికి 3డి విజన్ ఉంటుంది. అందుకే లోపలి అవయవాలను 3 డైమన్షనల్‌గా చూడవచ్చు. ఓపెన్ సర్జరీలో డాక్టర్ తన చేతులతో చేసినట్లు ఇక్కడ రోబో చేతులు ఆపరేషన్ చేస్తాయి. మన చేతులను ఎలా పడితే అలా తిప్పగలిగినట్లే, రోబో చేయి కూడా 360 డిగ్రీలలో తిప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే మానవ హస్తం కంటే మరింత మిన్నగా ఆపరేషన్ జరుగుతుంది. అంటే ఉదాహరణకు ఒక్కోసారి మానవహస్తం కాస్తంతైనా వణికే అవకాశమైనా ఉందేమోగానీ రోబో చేయి అలా వణకదు. లాపరోస్కోపీ అయితే ఒకరు కెమరా పట్టుకొని ఉండాలి. కానీ ఇందులో రోబో యంత్రానికే కెమెరా ఉంటుంది. ఈ సర్జరీలు చాలా సురక్షితం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లు ఉండవు. లోతుగా ఉండే అవయవాలకు చేయాల్సిన సర్జరీలు కూడా చాలా సులువుగా జరిగిపోతాయి. స్థూలకాయులకు కూడా చాలా సులువుగా సర్జరీలు చేయవచ్చు. కాబట్టి మీరు ఏమాత్రం ఆందోళన పడకండి.
డా. వి. సూర్యప్రకాశ్, సీనియర్ యూరాలజిస్ట్ అండ్ రొబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్,
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment