సాక్షి, హైదరాబాద్: భారతీయులు వంటకాల్లో తరచూ ఉపయోగించే దాల్చిన చెక్క ప్రొస్టేట్ కేన్సర్ నివారణకు దోహదపడుతుందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) జరిపిన అధ్యయనం తేల్చింది. దాల్చిన చెక్కతో మన ఆరోగ్యానికి ఎన్నో మేళ్లు జరుగుతాయన్నది చాలాకాలంగా తెలిసిన విషయమే. ఎన్‌ఐఎన్ తాజా అధ్యయనం ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది.
దాల్చిన చెక్కలోని చైనామాల్డీహైడ్, ప్రొసైనాడిన్ బీ–2లను ఎలుకలకు అందించినప్పుడు ప్రాథమిక దశలోని ప్రొస్టేట్ కేన్సర్‌పై సానుకూల ప్రభావం చూపినట్లు తెలిసింది. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు ఎలుకలకు 16 వారాలపాటు దాల్చిన చెక్క, దాంతోపాటు చైనామాల్డీహైడ్, ప్రొసైనాడిస్ బీ–2లను అందించారు. ఆ తరువాత ఈ ఎలుకలకు ప్రొస్టేట్ కేన్సర్ వచ్చేలా చేశారు.
దాల్చిన చెక్క, దాంట్లోని రసాయనాలను ఆహారంగా తీసుకున్న 60–70 శాతం ఎలుకల్లో కేన్సర్ లక్షణాలేవీ కనిపించలేదు. ఈ పదార్థాలు శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను సమర్థంగా తట్టుకోగలగడం వల్లనే వాటికి కేన్సర్ సోకలేదని భావిస్తున్నట్లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ అయేశా ఇస్మాయిల్ తెలిపారు. ప్రొస్టేట్ గ్రంథిలో కేన్సర్ కణాల వ్యాప్తి కూడా తక్కువగా ఉన్నట్లు తమ పరిశీలనలో తెలిసిందన్నారు.
అంతేగాకుండా... ఎముకల్లోని ఖనిజాల మోతాదు ఎక్కువైందని, ఎముకలు బలహీనమయ్యే ప్రమాదం తగ్గిందని వివరించారు. ప్రొస్టేట్ కేన్సర్ నివారణలో దాల్చిన చెక్క ఉపయోగపడగలదన్న విషయం ఎలుకల్లో రుజువైనప్పటికీ మనుషుల్లో వాడకానికి సంబంధించి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. ‘కేన్సర్ ప్రివెన్షన్ రీసెర్చ్’జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment