విటమిన్ ‘డి’ లోపం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ తీవ్రతరం!
మెడి క్షనరీ
విటమిన్ ‘డి’ లోపం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ మరింత తీవ్రతరం అవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ’ అనే మెడికల్ జర్నల్‌లో ఈ విషయం ప్రచురితమైంది. ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చి ‘రాడికల్ ప్రొస్టెటెక్టమీ’ అనే శస్త్రచికిత్స చేయించుకున్న 190 మంది పురుషులను ఈ అధ్యయనం కోసం ఎంచుకున్నారు. వీళ్లందరి సగటు వయసు 64 ఏళ్లు. వారిలో దాదాపు సగం మందికి ప్రొస్టేట్ క్యాన్సర్ మరింత తీవ్రతరమైందని గుర్తించారు.
వాళ్లందరికీ రెండు నెలల ముందు ఓసారి, రెండు నెలల తర్వాత మరోసారి విటమిన్ -డి పాళ్లు పరీక్షించారు. ఈ అధ్యయనం ద్వారా తేలిన సంగతేమిటంటే ప్రొస్టేట్ క్యాన్సర్ తీవ్రతరమైన వారందరిలోనూ విటమిన్-డి పాళ్లు చాలా తక్కువని తేలింది. దాంతో విటమిన్-డి తగ్గడం ప్రొస్టేట్ క్యాన్సర్‌ను మరింత ప్రేరేపిస్తుందని తెలిసింది.