పురుషుల్లో వచ్చే అత్యంత సాధారణమైన కేన్సర్లలో ప్రోస్టేట్ కేన్సర్ కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వచ్చే కేన్సర్లలో దీనిది రెండోస్థానం. వీలైనంత త్వరగా దీన్ని గుర్తించి, ప్రస్తుతం లభిస్తున్న అధునాతనమైన చికిత్స పద్ధతుల ద్వారా వైద్యం చేయించగలిగినట్లయితే చాలా మంచి ఫలితాలుంటాయి. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు నెలను ప్రోస్టేట్ కేన్సర్ అవగాహన మాసంగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా ప్రోస్టేట్ కేన్సర్‌పై అవగాహన కోసం ఈ కథనం.
ప్రోస్టేట్ గ్రంథిని తెలుగులో పురుష గ్రంథి అని పిలుస్తారు. ఇది మూత్రకోశం (యూరినరీ బ్లాడర్)కు దిగువన ఉండి, అక్కడ మొదలైన మూత్రనాళం (యురెథ్రా) ఈ గ్రంథిలోంచే బయటకు వచ్చి, పురుషాంగం ద్వారా వెలుపలకు వస్తుంది. మూత్రనాళం చుట్టూ ప్రోస్టేట్ గ్రంథి ఉండటంతో మూత్రకోశం నుంచి మూత్రాన్ని బయటకు రాకుండా అది నిలువరిస్తుంది. కేవలం మూత్ర విసర్జన సమయంలో మాత్రమే ఇది తెరచుకుంటుంది. ఇది చేసే మరో ముఖ్యమైన పనేమిటంటే... ఇది స్రవించే స్రావం పురుషుల వీర్యకణాలకు పోషకపదార్థంగా పనిచేస్తుంది.
ప్రోస్టేట్ కేన్సర్ అంటే...?
ప్రోస్టేట్ గ్రంథి కణాలలోని జన్యువుల్లో మ్యూటేషన్ జరిగినప్పుడు అది కేన్సర్‌కు దారితీస్తుంది. సరైన సమయంలో వ్యాధిని నిర్ధారణ చేసి చికిత్స చేయించకపోతే, ఈ కేన్సరే ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది.
ముఖ్యంగా గమనించాల్సిందేమిటంటే...
హార్మోన్ల అసమతౌల్యత వల్ల 50 ఏళ్లు పైబడిన కొందరిలో ఈ గ్రంథి పరిమాణం పెరగవచ్చు. దీన్నే బినైన్ ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ అని పిలుస్తారు. ఇది కేన్సర్ కాదు.
ప్రమాద సూచికలు ఏమిటి?
ఈ కేన్సర్‌లో ప్రోస్టేట్ పరిమాణం పెరగడం వల్ల మూత్రవిసర్జన సమయంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఉదాహరణకు... ∙మూత్రధార సన్నబడటం, ముక్కాల్సి రావడం
రాత్రుళ్లు మాటిమాటికీ నిద్రలేచి మూత్రవిసర్జనకు వెళ్లాల్సిరావడం
మూత్రవిసర్జన తర్వాత కొంత లోపలే మిగిలిపోవడం
అప్పుడప్పుడూ మూత్రంలో రక్తం కనిపించడం.
ఒకవేళ కేన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించినప్పుడు ఎముకల్లో నొప్పులు, బరువు తగ్గడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాల విషయంలో రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది... తొలిదశలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. రెండో అంశమేమి టంటే... ఇవే లక్షణాలు హానికరం కాని బినైన్ ఎన్‌లార్ట్‌మెంట్‌లోనూ కనిపించవచ్చు.
రిస్క్ ఫ్యాక్టర్స్?
వయసు పెరుగుతుండటం: పెరిగే వయసు ఒక నివారించలేని ముప్పు. నాలుగింట మూడొంతుల మందిలో 65 ఏళ్లు దాటిన వారిలోనే ఈ సమస్య కనిపిస్తుంది.
వంశపారంపర్యంగా: కుటుంబాల్లో ఎవరైనా ప్రోస్టేట్ కేన్సర్ బారిన పడితే... వారి సంతానానికి / సోదరులకు ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువ.
మెటబాలిక్ సిండ్రోమ్: సిండ్రోమ్ అంటే వివిధ రకాల శారీరక రుగ్మతల సమాహారం. అంటే... హై బ్లడ్ ప్రెషర్, అధిక కొలెస్ట్రాల్, ఉబకాయం, నియంత్రణ లేని మధుమేహం... ఈ అంశాల సమాహారం వేరువేరు కేన్సర్లతో పాటు ప్రోస్టేట్ కేన్సర్‌కూ కారణమయ్యే అవకాశాలు ఎక్కువ.
పొగతాగడం: ఇది పరోక్షంగా ప్రోస్టేట్ కేన్సర్ రిస్క్‌ను అధికం చేస్తుంది.
నిర్ధారణ ఎలా?
యాభై ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ముందుజాగ్రత్తగా ప్రోస్టేట్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. దీని నిర్ధారణ కోసం యూరాలజిస్టులు పీఎస్‌ఏ (ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్) అనే రక్తపరీక్ష చేయిస్తారు. ఆ విలువ ఉండాల్సిన దానికంటే పెరిగినట్లయితే ప్రోస్టేట్ బయాప్సీ ద్వారా వ్యాధిని నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాత ఎమ్మారై, పెట్‌స్కాన్ అనే పరీక్షలతో క్యాన్సర్ ఏ దశలో ఉన్నదో అంశాన్ని తెలుసుకుంటారు.
చికిత్స :
కేన్సర్ కేవలం ప్రోస్టేట్ గ్రంథికే పరిమితమై ఉంటే, శస్త్రచికిత్స చేసి తొలగిస్తారు. దాంతో వ్యాధి పూర్తిగా మటుమాయమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్ సాంకేతికత ద్వారా ఈ శస్త్రచికిత్స చేస్తున్నారు. దీన్ని ‘రోబోటిక్ రాడికల్ ప్రోస్టెక్టమీ’ అంటారు. రోబోటిక్ శస్త్రచికిత్సలో పెద్ద గాట్లు అవసరం లేకుండా, కేవలం చిన్న చిన్న రంధ్రాలతో అధునాతమైన పరికరాల ద్వారా ఆపరేషన్ చేస్తారు. దీనివల్ల రక్తస్రావం, నొప్పి తక్కువ, కోలుకోవడమూ వేగంగా జరుగుతుంది. ప్రోస్టేట్ చుట్టూ ఉండే చిన్న చిన్న నరాలకు ఎలాంటి దెబ్బా తగలకుండా ఆపరేషన్ చేయవచ్చు. ఈ నరాలు అంగస్తంభనకు అవసరమవుతాయి. ఈ పద్ధతిని ‘నర్వ్ స్పేరింగ్ ప్రోస్టెక్టమీ’ అంటారు.
ఎవరైనా శస్త్రచికిత్స వద్దనుకున్నా లేదా వారికి ఫిట్‌నెస్ లేకపొయినా రేడియోథెరపీ మంచి ప్రత్యామ్నాయం. దురదృష్టవశాత్తూ ఈ జబ్బును లేట్ స్టేజెస్‌లో కనుగొన్నట్లయితే... అంటే కేన్సర్ ఇతర అవయవాలకు తాకినప్పుడు వారిలోని టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను తగ్గించడం ద్వారా ఈ కేన్సర్‌ను తగ్గించవచ్చు. దీన్ని ‘హార్మోన్ థెరపీ’ అంటారు దీనికి అదనంగా ఇప్పుడు ఎబిరటారోన్ లేదా ఎంజాలుటమైడ్ వంటి అధునాతనమైన మందులూ, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, రేడియోన్యూక్లైడ్ థెరపీ ఉన్నాయి.
నివారణ ఎలా?
ప్రోస్టేట్ కేన్సర్‌కు నివారణ అంటూ ఏమీ లేదు. అయితే దీనికి కచ్చితమైన చికిత్స పొందవచ్చు. కొంతవరకు జీవనసరళిలో మార్పులూ, ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం ద్వారా కొంత నివారణ సాధ్యమవుతూ ఉండవచ్చు. ఉదాహరణకు ఆహారంలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్, ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవడం, అలాగే శరీర బరువును నియంత్రించడం, రోజూ వ్యాయామం చేయడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లతో కొంతవరకు నియంత్రించవచ్చు.
డా. రాజేశ్ కుమార్ రెడ్డి అడపాల, కన్సల్టెంట్ యూరో ఆంకాలజిస్ట్
(చదవండి: పిక్కకు ఓ లెక్కుంది..! హార్ట్ పంపింగ్‌లో కింగ్..!)
Comments
Please login to add a commentAdd a comment