పొడగరులకు ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు
పొడగరులకు ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఒక తాజా పరిశోధనలో తేలింది. ఐదున్నర అడుగుల పొడవు ఉండే వారితో పోలిస్తే ఆరడుగులకు పైబడి పొడవుగా ఉండే పురుషుల్లో ఈ ముప్పు 21 శాతం ఎక్కువగా ఉంటుందని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. పొడవుకు తోడు అధిక బరువు కూడా ఉన్నట్లయితే ఈ ముప్పు మరో 13 శాతం వరకు పెరుగుతుందని వారు అంటున్నారు. పొడవుగా ఉండేవారిలో నడి వయసులో నడుము చుట్టుకొలత నాలుగు అంగుళాలకు మించి పెరిగినట్లయితే ఈ ముప్పు మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయని, నడి వయసులో పెరిగే అదనపు బరువు వల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తిలో సంభవించే మార్పులే దీనికి కారణమని వారు వివరిస్తున్నారు. బ్రిటన్‌లో ప్రొస్టేట్ క్యాన్సర్ కారణంగా ఏటా 11 వేల మంది మరణిస్తున్నారని, వారిలో అధిక బరువు ఉన్న పొడగరులే ఎక్కువగా ఉంటున్నారని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ అరోరా పెరెజ్ కోర్నాగో తెలిపారు.