రోబో సర్జరీలకు భారత్ దే అగ్రస్థానం
న్యూఢిల్లీ: ప్రాణాపాయమైన కేన్సర్‌లకు రోబోల సహాయంతో అత్యాధునిక చికిత్స అందించడంలో భారత్ కేంద్రబిందువుగా మారింది. మన దేశంలో రోబో సర్జరీలు.. చౌక ధర కావచ్చు, చికిత్స సమయంలో తక్కువ నొప్పి ఉండటం, శస్త్రచికిత్స అనంతరం తొందరగా కోలుకోవడం.. అవగాహన పెరగడం ఇలా ఏమైనా కావచ్చు.. భారత్‌ను మాత్రం ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టిందని కొందరు రోబో శస్త్రచికిత్స నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఇటీవల నమోదైన తాజా సమాచారం ప్రకారం.. 2015 ముంబైలో 70వేల రోబొటిక్ సర్జరీలు జరిగినట్టు అంచనా. అయితే సర్జరీలు చేయించుకున్న వారిలో ఎక్కువమంది విదేశీయులే ఉండటం గమనార్హం. ఇక దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలలో 20 నుంచి 25 వేల వరకు రోబో శస్త్రచికిత్సలు జరిగినట్టు రికార్డుల్లో వెల్లడయ్యాయి. ప్రత్యేకంగా.. రోగుల్లో దాదాపు చాలామంది మధ్య తూర్పు ఆఫ్రికా దేశీయులే భారత్‌లో సర్జరీలు చేయించుకున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే వారి స్వదేశాల్లో అడ్వాన్స్ రోబో సర్జీరీలు అందుబాటులో లేకపోవడం, ఒకవేళ ఉన్నా, చాలా ఖర్చుతో కూడినవి అయి ఉండవచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు. ముంబైలోని షఫీ ఆస్పత్రి, బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి కన్సల్టెంట్ రోబొటిక్ సర్జన్ డాక్టర్ అనూప్ రమణి ఐఏఎన్‌ఎస్‌తో మాట్లాడుతూ.. తాను ప్రతివారం కనీసం ఒకటి నుంచి రెండు రోబో సర్జరీ రోగులను పరీక్షిస్తాననీ, వచ్చే వారిలో మధ్య తూర్పు ఆఫ్రికా నుంచి ఎక్కువ మంది వస్తున్నారని చెప్పారు.
గత రెండునెలల క్రితం ప్రోస్టేట్ గ్రంథి కేన్సర్‌తో బాధపడుతున్న ఏడుగురు విదేశీయులకు తాను ఒంటిరిగా రోబో సర్జరీ చేశాననీ పేర్కొన్నారు. ప్రారంభ దశలో ఉన్న ప్రోస్టేట్ గ్రంథి కేన్సర్‌కు రోబో సర్జరీ ద్వారా శస్త్రచికిత్స చేయించుకోవడం ఉత్తమమైనదిగా చెప్పారు. భారత్‌లో ప్రోస్టేట్ కేన్సర్.. పేద, ధనికుల్లో ఎక్కువ పెరిగిపోయిందన్నారు. కావునా 50 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి ఒక్కరు సంవత్సరంలో ఒక్కసారైనా ప్రోస్టేట్ నిర్దిష్ట యాంటిజెన్(పీఎస్‌ఏ) పరీక్ష చేయించుకోవాలని రమణి సూచించారు.