ఫిష్‌పేట్లను తొలగించి.. అధికారులకు సమాచారం
నైట్ డ్యూటీల కోసం ముగ్గురు ట్రాక్‌మెన్ దుశ్చర్య
సూరత్: నైట్ డ్యూటీలు ఉంటే.. రోజంతా కుటుంబంతో గడపవచ్చని భావించారు రైల్వేలైన్లను తనిఖీ చేసే ముగ్గురు ట్రాక్‌మెన్. దాంతో ఉద్దేశపూర్వకంగా ఫిష్‌ప్లేట్లను తొలగించి.. తామే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పెద్ద ప్రమాదాన్ని అరికట్టారనే పేరు వస్తుందని ఆశించారు. అధికారులు తమ అప్రమత్తతను మెచ్చునొని నైట్‌డ్యూటీలు వేస్తారనేది వారి ఆశ. కానీ రైల్వే నిపుణుల దర్యాప్తులో వారి నిర్వాకం బయటపడి అరెస్టయ్యారు.
సూరత్ ఎస్పీ హోతేష్ జాయ్‌సర్ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. సుభాష్ పొద్దార్, మనీష్ మిస్త్రీ, శుభమ్ జైస్వాల్‌లు ట్రాక్‌మెన్‌గా పనిచేస్తున్నారు. కొసాంబా– కిమ్ స్టేషన్ల మధ్య దుండగులెవరో ఎలాస్టిక్ క్లిప్‌లను, రెండు ఫిష్‌పేట్లను తొలగించారని, వాటిని పక్కనున్న మరో ట్రాక్‌పై పెట్టి రైలు పట్టాలు తప్పేలా చేయాలని చూశారని ఈ ముగ్గురు శనివారం వేకువజామున 5:30 గంటలకు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు.
కిమ్ పోలీసుస్టేషన్‌లో కుట్ర కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రైల్వే ఉన్నతాధికారులను అప్రమత్తం చేయడానికి ట్రాక్‌మెన్ పట్టాల వీడియోను పంపించారు. అంతకు కొద్ది నిమిషాల ముందు ఆ ట్రాక్ మీదుగా ఒక రైలు వెళ్లిందని రైల్వే అధికారులు పోలీసులకు తెలిపారు. ట్రాక్‌మెన్ ఉన్నతాధికారులను అప్రమత్తం చేసిన సమయానికి, రైలు వెళ్లిన సమయానికి.. మధ్య అవధి చాలా తక్కువగా ఉంది. ఇంత తక్కువ సమయంలో ఫిష్‌ప్లేట్లను, ఎలాస్టిక్ క్లిప్‌లను తొలగించడం సాధ్యం కాదు. దాంతో పోలీసులు ట్రాక్‌మెన్ మొబైల్ ఫోన్లను పరిశీలించారు.
శనివారం వేకువజామున 2:50 గంటలనుంచి 4:57 గంటలకు వరకు వీరు ట్రాక్ దృశ్యాలను చిత్రీకరించినట్లు తేలింది. దాంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయటపెట్టారు. రైలు ప్రమాదాన్ని నివారిస్తే.. అధికారులు సన్మానించి, ఇకపై కూడా నైట్‌డ్యూటీలో కొనసాగిస్తారని వీరు భావించారు. నైట్‌డ్యూటీలు ఉంటే.. మరుసటి రోజు ఆఫ్ దొరుకుతుందని.. రోజంతా కుటుంబంతో గడపొచ్చని వీరు భావించారు. వర్షాకాలానికి సంబంధించి తమవంతు నైట్‌డ్యూటీలు ముగింపునకు రావడంతో వీరి దుశ్చర్యకు పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరైన సుభాష్ పొద్దారు ఈ ఐడియా ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment