fishplate
-
తొలగించింది వారే... హెచ్చరించింది వారే
సూరత్: నైట్ డ్యూటీలు ఉంటే.. రోజంతా కుటుంబంతో గడపవచ్చని భావించారు రైల్వేలైన్లను తనిఖీ చేసే ముగ్గురు ట్రాక్‌మెన్. దాంతో ఉద్దేశపూర్వకంగా ఫిష్‌ప్లేట్లను తొలగించి.. తామే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పెద్ద ప్రమాదాన్ని అరికట్టారనే పేరు వస్తుందని ఆశించారు. అధికారులు తమ అప్రమత్తతను మెచ్చునొని నైట్‌డ్యూటీలు వేస్తారనేది వారి ఆశ. కానీ రైల్వే నిపుణుల దర్యాప్తులో వారి నిర్వాకం బయటపడి అరెస్టయ్యారు. సూరత్ ఎస్పీ హోతేష్ జాయ్సర్ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. సుభాష్ పొద్దార్, మనీష్ మిస్త్రీ, శుభమ్ జైస్వాల్‌లు ట్రాక్‌మెన్‌గా పనిచేస్తున్నారు. కొసాంబా– కిమ్ స్టేషన్ల మధ్య దుండగులెవరో ఎలాస్టిక్ క్లిప్‌లను, రెండు ఫిష్పేట్లను తొలగించారని, వాటిని పక్కనున్న మరో ట్రాక్‌పై పెట్టి రైలు పట్టాలు తప్పేలా చేయాలని చూశారని ఈ ముగ్గురు శనివారం వేకువజామున 5:30 గంటలకు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. కిమ్ పోలీసుస్టేషన్లో కుట్ర కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రైల్వే ఉన్నతాధికారులను అప్రమత్తం చేయడానికి ట్రాక్‌మెన్ పట్టాల వీడియోను పంపించారు. అంతకు కొద్ది నిమిషాల ముందు ఆ ట్రాక్ మీదుగా ఒక రైలు వెళ్లిందని రైల్వే అధికారులు పోలీసులకు తెలిపారు. ట్రాక్‌మెన్ ఉన్నతాధికారులను అప్రమత్తం చేసిన సమయానికి, రైలు వెళ్లిన సమయానికి.. మధ్య అవధి చాలా తక్కువగా ఉంది. ఇంత తక్కువ సమయంలో ఫిష్‌ప్లేట్లను, ఎలాస్టిక్ క్లిప్‌లను తొలగించడం సాధ్యం కాదు. దాంతో పోలీసులు ట్రాక్‌మెన్ మొబైల్ ఫోన్లను పరిశీలించారు. శనివారం వేకువజామున 2:50 గంటలనుంచి 4:57 గంటలకు వరకు వీరు ట్రాక్ దృశ్యాలను చిత్రీకరించినట్లు తేలింది. దాంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయటపెట్టారు. రైలు ప్రమాదాన్ని నివారిస్తే.. అధికారులు సన్మానించి, ఇకపై కూడా నైట్‌డ్యూటీలో కొనసాగిస్తారని వీరు భావించారు. నైట్‌డ్యూటీలు ఉంటే.. మరుసటి రోజు ఆఫ్ దొరుకుతుందని.. రోజంతా కుటుంబంతో గడపొచ్చని వీరు భావించారు. వర్షాకాలానికి సంబంధించి తమవంతు నైట్‌డ్యూటీలు ముగింపునకు రావడంతో వీరి దుశ్చర్యకు పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరైన సుభాష్ పొద్దారు ఈ ఐడియా ఇచ్చాడు. -
ఎంత ప్రమాదం తప్పింది!
కోల్‌కతా: హౌరా-న్యూఢిల్లీ రైలు మార్గంలో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికుడొకరు చురుగ్గా స్పందించి రైలు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో ముప్పు వాటిల్లలేదు. పశ్చిమ బెంగాల్ బుర్ద్వాన్ జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. రైలు పట్టాలకు ఉండే ఫిష్‌ప్లేట్లు ఊడిపోవడాన్ని గమనించిన స్థానిడొకరు వెంటనే స్పందించి ఎరుపు రంగు వస్త్రాన్ని చేత్తో చూపిస్తూ అటుగా వస్తున్న రైలుకు ఎదురెళ్లాడు. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది. సడన్‌గా రైలు నిలిచిపోవడంతో ఏం జరిగిందోనని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పట్టా విరిగిన ప్రాంతానికి కొన్ని మీటర్ల దూరంలో రైలు ఆగడంతో ప్రమాదం తప్పిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి అప్రమత్తంగా వ్యవహరించిన స్థానికుడికి ప్రయాణికులు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఈ ఘటనపై రైల్వే శాఖ ఇంకా స్పందించలేదు. -
ఒక్క చూపుతో పెను ప్రమాదం తప్పించాడు
ముంబయి: ఆ యువ ఇంజినీర్. అతడికి రైలన్నా.. రైల్వే వ్యవస్థ అన్న ఎంతో ఆసక్తి. రైలుకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. అలా అతడు సహజంగా చేసుకున్న అలవాటే వేలమంది ప్రాణాలు కాపాడింది. పెద్ద రైల్వే ప్రమాదాన్ని నివారించగలిగేలా చేసింది. రెండు రైళ్లు ఢీకొట్టుకునే ప్రమాదం నుంచి తప్పించింది. జీ సక్పాల్ (23) అనే ఇంజినీర్ అంధేరిలోని తన ఆఫీసుకు వెళ్లేందుకు ఉదయం 7.30గంటలకు కుర్లా రైల్వే స్టేషన్‌కు రైలెక్కెందుకు వచ్చాడు. 7వ నెంబర్ ప్లాట్ పాంపై నిల్చుని అతడికి సహజంగానే ఉన్న అలవాటు ప్రకారం రైల్వే పట్టాల వైపు పరిశీలనగా చూస్తున్నాడు. హార్బర్ లైను వెంట ఉన్న పట్టాల్లో అతడికి సరిగ్గా మూడు నాలుగు మీటర్ల దూరంలో ఫిష్ ప్లేట్ ఊడిపోయి పైకి పొడుచుకొని కనిపించింది. దాని వల్ల జరిగే ఘోర విపత్తును ముందే ఊహించిన అతడు వెంటనే రైలు మోటర్ మేన్ కు సమాచారం అందించాడు. రైల్వే హెల్ప్ లైన్ కు ఫోన్ చేశాడు. అతడు అలా సమాచారం అందించగానే గ్యాంగ్ మెన్ ను అక్కడికి పంపించి ట్రాక్ ను సరిచేశారు. అక్కడే వదులుగా ఉన్న మరో ఫిష్ ప్లేట్ ను సరి చేశారు. దీంతో ఆ లైన్ లో కాసేపు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ట్రాక్ సమస్య తెలిసిన తర్వాత అన్ని రైళ్లకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలని ఆదేశాలు జారీ చేశారు. తిరిగి ఉదయం ఎనిమిదిగంటల ప్రాంతంలో యథావిధిగా రైల్లు ప్రయాణం ప్రారంభించాయి. వందల ప్రాణాలు రక్షించడమే కాకుండా ఒక రోజు మొత్తాన్ని కాపాడాడంటూ పలువురు సక్పాల్‌ను అభినందించారు.