ఒక్క చూపుతో పెను ప్రమాదం తప్పించాడు
ముంబయి: ఆ యువ ఇంజినీర్. అతడికి రైలన్నా.. రైల్వే వ్యవస్థ అన్న ఎంతో ఆసక్తి. రైలుకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. అలా అతడు సహజంగా చేసుకున్న అలవాటే వేలమంది ప్రాణాలు కాపాడింది. పెద్ద రైల్వే ప్రమాదాన్ని నివారించగలిగేలా చేసింది. రెండు రైళ్లు ఢీకొట్టుకునే ప్రమాదం నుంచి తప్పించింది. జీ సక్పాల్ (23) అనే ఇంజినీర్ అంధేరిలోని తన ఆఫీసుకు వెళ్లేందుకు ఉదయం 7.30గంటలకు కుర్లా రైల్వే స్టేషన్కు రైలెక్కెందుకు వచ్చాడు.
7వ నెంబర్ ప్లాట్ పాంపై నిల్చుని అతడికి సహజంగానే ఉన్న అలవాటు ప్రకారం రైల్వే పట్టాల వైపు పరిశీలనగా చూస్తున్నాడు. హార్బర్ లైను వెంట ఉన్న పట్టాల్లో అతడికి సరిగ్గా మూడు నాలుగు మీటర్ల దూరంలో ఫిష్ ప్లేట్ ఊడిపోయి పైకి పొడుచుకొని కనిపించింది. దాని వల్ల జరిగే ఘోర విపత్తును ముందే ఊహించిన అతడు వెంటనే రైలు మోటర్ మేన్ కు సమాచారం అందించాడు. రైల్వే హెల్ప్ లైన్ కు ఫోన్ చేశాడు. అతడు అలా సమాచారం అందించగానే గ్యాంగ్ మెన్ ను అక్కడికి పంపించి ట్రాక్ ను సరిచేశారు.
అక్కడే వదులుగా ఉన్న మరో ఫిష్ ప్లేట్ ను సరి చేశారు. దీంతో ఆ లైన్ లో కాసేపు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ట్రాక్ సమస్య తెలిసిన తర్వాత అన్ని రైళ్లకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలని ఆదేశాలు జారీ చేశారు. తిరిగి ఉదయం ఎనిమిదిగంటల ప్రాంతంలో యథావిధిగా రైల్లు ప్రయాణం ప్రారంభించాయి. వందల ప్రాణాలు రక్షించడమే కాకుండా ఒక రోజు మొత్తాన్ని కాపాడాడంటూ పలువురు సక్పాల్ను అభినందించారు.