ఆళ్లగడ్డ: ఇతడి పేరు షేక్ షఫీ. పాతమసీదు వీధిలో నివాసం ఉంటున్నాడు. అందరిలాగే అతడి జీవితంగా ఆనందంగా గడిచేది. కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే రెండేళ్ల కిత్రం గొంతుకు క్యాన్సర్ సోకడంతో అతడి జీవితంలో పెనుమార్పులు వచ్చాయి. మాట్లాడటానికి మాటలు రావు. తినడానికి గొంతు సహకరించడం లేదు. దీంతో తన బాధను పేపర్‌పై రాసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. పగవాడికి ఈ కష్టం వద్దు అంటూ అతడు తన బాధను వెళ్లబోసుకుంటున్నాడు.
రెండేళ్లుగా నరకయాతన
రెండేళ్ల క్రితం షఫీ గొంతుకు క్యాన్సర్ సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అప్పటి నుంచి పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నాడు. ఇప్పటికే దాదాపు రూ.2.5 లక్షల దాకా ఖర్చు చేశాడు. వ్యాధి తీవ్రతకు మాటలు పడిపోయాయి. అలాగే తినేందుకు గొంతు సహకరించకపోవడంతో డాక్టర్లు ప్రత్యేక పైపు ద్వారా ఆహారం తీసుకునేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కర్నూలులోని ఓమెగా వైద్యశాలలో చికిత్స పొందుతూ ఇంటికి వచ్చాడు. మందులకు నెలకు రూ.25వేలు, కీమోథెరఫీకి నెలకు రూ.5 వేల వరకు ఖర్చు అవుతోంది. రెక్కాడితే డొక్కాడని ఈ కుటుంబానికి వైద్య ఖర్చులు భారమయ్యాయి. ప్రస్తుతం షఫీ తల్లి కూలీనాలీ చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.
సాయం చేయండయ్యా..
నేను కూలీపని చేసుకుని జీవనం సాగిస్తుండేవాడిని. రెండేళ్లక్రితం నాకు క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఎన్ని వైద్యశాలలు తిరిగినా ఫలితం లేదు. ప్రస్తుతం మందులు వాడుతున్నా. దాతలు సాయం చేస్తే తప్ప నాప్రాణాలు నిలబడవు. ఇంటి వద్ద వసతి సరిగ్గా లేకపోవడంతో శిరివెళ్ల మండలం యర్రగుంట్లలోని అత్తమామల ఇంట్లో ఉంటున్నా. – షఫీ
అంధురాలితో ప్రేమపెళ్లి..
షఫీ జీవితంలో అందరిలాగే సరదాగా గడిచేది. కూలి పనులు చేసుకునే అతడికి ఫోన్‌లో ఓ అమ్మాయి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో అమెకున్న వినికిడి లోపం, అంధత్వం ప్రేమ ముందు నిలవలేకపోయాయి. అతడి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించారు. అలా ఎనిమిదేళ్ల క్రితం వారికి పెళ్లయింది. వారికి తీపి గుర్తులుగా సమీర్, అష్రఫ్, ఆయూస్ అనే ముగ్గురు పిల్లలు కలిగారు. ఇలా వారి సంసారం హాయిగా సాగిపోయేది. ఈ తరుణంలో క్యాన్సర్ మహమ్మారి వారి జీవితాలను కష్టాల్లోకి నెట్టింది.
పేరు : షేక్ కపిజా (షఫీ తల్లి)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆళ్లగడ్డ : IFSC Code : SBIN0014171
A/ C : 86736956084
PH : 7259957001
Comments
Please login to add a commentAdd a comment