వర్చువల్ సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి
సబ్బవరం (పెందుర్తి): ప్రపంచ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కోవిడ్ టీకాలపై పేటెంట్ హక్కులను రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి అభిప్రాయపడ్డారు. వర్సిటీ మేధో సంపత్తి హక్కుల కేంద్రం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు వర్చువల్ విధానంలో నిర్వహించిన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మినిస్టీరియల్ నమూనా సమావేశాలు శనివారం ముగిసాయి. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి మాట్లాడుతూ.. కోవిడ్–19ను ఎదుర్కొనేందుకు వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం ఒక మార్గం కాగా.. టీకా తీసుకోవడం మరో మార్గమన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత.. ప్రజలకు దాన్ని అందించే క్రమంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు.
ఆయా ఉత్పత్తి కంపెనీలు తమ పేటెంట్ హక్కులను సరళం చేసినప్పుడే అన్ని దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు. కోవిడ్–19 కారణంగా ఛిన్నాభిన్నమైన పేద దేశాలు వ్యాక్సిన్ కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్, దక్షిణాఫ్రికా సూచించిన తాత్కాలిక పేటెంట్ హక్కుల రద్దు ప్రతిపాదనకు అనేక దేశాలు మద్దతు పలికినప్పటికీ, ధనిక దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయన్నారు. అన్ని దేశాలు, ఆయా కంపెనీలు ప్రజా రక్షణ దృష్ట్యా కొంత కాలమైనా పేటెంట్ హక్కుల రద్దు అమలయ్యేలా చొరవ చూపాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచిన జేఎస్‌ఎస్ లా కళాశాల, పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను వర్సిటీ ఉపకులపతి ఆచార్య డాక్టర్ ఎస్.సూర్యప్రకాష్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment