Justice Arup Kumar Goswami
-
కోవిడ్ టీకాలపై పేటెంట్లు రద్దు చేస్తే మేలు
సబ్బవరం (పెందుర్తి): ప్రపంచ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కోవిడ్ టీకాలపై పేటెంట్ హక్కులను రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి అభిప్రాయపడ్డారు. వర్సిటీ మేధో సంపత్తి హక్కుల కేంద్రం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు వర్చువల్ విధానంలో నిర్వహించిన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మినిస్టీరియల్ నమూనా సమావేశాలు శనివారం ముగిసాయి. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి మాట్లాడుతూ.. కోవిడ్–19ను ఎదుర్కొనేందుకు వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం ఒక మార్గం కాగా.. టీకా తీసుకోవడం మరో మార్గమన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత.. ప్రజలకు దాన్ని అందించే క్రమంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఆయా ఉత్పత్తి కంపెనీలు తమ పేటెంట్ హక్కులను సరళం చేసినప్పుడే అన్ని దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు. కోవిడ్–19 కారణంగా ఛిన్నాభిన్నమైన పేద దేశాలు వ్యాక్సిన్ కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్, దక్షిణాఫ్రికా సూచించిన తాత్కాలిక పేటెంట్ హక్కుల రద్దు ప్రతిపాదనకు అనేక దేశాలు మద్దతు పలికినప్పటికీ, ధనిక దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయన్నారు. అన్ని దేశాలు, ఆయా కంపెనీలు ప్రజా రక్షణ దృష్ట్యా కొంత కాలమైనా పేటెంట్ హక్కుల రద్దు అమలయ్యేలా చొరవ చూపాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచిన జేఎస్ఎస్ లా కళాశాల, పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను వర్సిటీ ఉపకులపతి ఆచార్య డాక్టర్ ఎస్.సూర్యప్రకాష్ అభినందించారు. -
న్యాయవ్యవస్థ విమర్శలు ఎదుర్కొంటోంది
సాక్షి, అమరావతి: సమర్థవంతమైన న్యాయం అందించే విషయంలో న్యాయవ్యవస్థ ఇటీవల కాలంలో విమర్శలు ఎదుర్కొంటోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి అన్నారు. ఏపీ హైకోర్టులో మంగళవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జస్టిస్ గోస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. అంకిత భావంతో పనిచేసినప్పుడే ఇలాంటి విమర్శలను ఆధిగమించడం సాధ్యమవుతుందని, ప్రజల విశ్వాసాన్ని చూరగొని విమర్శలకు సమాధానం ఇద్దామని న్యాయవాదులకు పిలుపునిచ్చారు. ఈ దిశగా మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, విధి నిర్వహణలో రాజీ లేకుండా పనిచేద్దామన్నారు. న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కొరత, సిబ్బంది లేమి, పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడం వంటివి న్యాయవ్యవస్థకు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఏ న్యాయవ్యవస్థపై లేనంత భారం మనదేశ న్యాయవ్యవస్థపై ఉందన్నారు. ఏపీ హైకోర్టు మంచి సంప్రదాయాలను పాటిస్తోందని, ఇప్పుడు జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా కేసుల విచారణ తనకు ఎంతో గొప్ప అనుభూతిని ఇస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏజీ ఎస్.శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి జేయూఎంవీ ప్రసాద్ ప్రసంగించారు. లోకాయుక్తలో గణతంత్ర వేడుకలు లోకాయుక్త కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి జెండా ఎగుర వేసి∙పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, రిజి్రస్టార్ విజయలక్ష్మి, లోకాయుక్త డైరెక్టర్ (ఇన్వెస్టిగేషన్) కె.నర్సింహారెడ్డి, డైరెక్టర్ (లీగల్) టి.వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
రాజ్యాంగంతోనే సంపూర్ణ స్వరాజ్యం: ఏపీ హైకోర్టు సీజే
సాక్షి, అమరావతి: రాజ్యాంగం రూపకల్పన తోనే భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యం లభించిందని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి అన్నారు. అమరావతిలోని హైకోర్టులో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు భద్రతా సిబ్బంది నుంచి చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి గౌరవ వందనం స్వీకరించారు. హైకోర్టు ప్రాంగణంలో భారీ జాతీయ జెండాను చీఫ్ జస్టిస్ ఆవిష్కరించారు. ఎందరో మేధావులు కృషి ఫలితంగా సమున్నతమైన రాజ్యాంగం ఆవిష్కృతమైందన్నారు. చదవండి: అధికార వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఏపీ గవర్నర్ 1947 ఆగస్ట్ 15వ తేదీన భారతదేశానికి స్వతంత్రం వచ్చినా.. రాజ్యాంగం రూపకల్పనతోనే సంపూర్ణ స్వరాజ్యం లభించిందన్నారు. ఎన్నో వ్యవస్థలు మాదిరిగానే న్యాయ వ్యవస్థలోనూ ఎన్నో చాలెంజ్‌లు ఉన్నాయన్నారు. ఇప్పటికీ కొన్ని లోపాలు ఉన్నా.. అందరి సహకారంతో వాటిని అధిగమిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ప్రపంచంలోనే భారత న్యాయవ్యవస్థ ఉన్నతమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆచారాలు, సాంప్రదాయాలు తననెంతో ఆకట్టుకున్నాయని సీజే తెలిపారు. చదవండి:రాజ్యాంగం ఇప్పటికీ మార్గనిర్దేశం చేస్తూ ఉంది: సీఎం జగన్ -
ఏపీ హైకోర్టు సీజేగా అరూప్ గోస్వామి ప్రమాణం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ గోస్వామిచే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీజేగా ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సీజే అరూప్ కుమార్ గోస్వామితో కలిసి సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కలిసి తేనీటి విందులో పాల్గొన్నారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి తాడేపల్లిలోని నివాసానికి సీఎం వైఎస్ జగన్ పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సహా పలువురు న్యాయమూర్తులు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా సీజేగా హిమా కోహ్లి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ హిమా కోహ్లి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా బదిలీపై వెళ్తున్నారు. గత 15 రోజుల క్రితం సుప్రీంకోర్టు కొలిజీయం వీరి బదిలీలను కేంద్రానికి సిఫార్సు చేయగా.. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదించడంతో అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి విధులు నిర్వహిస్తున్నారు. ఆమె 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించారు. ప్రాథమిక విద్యను సెయింట్ థామస్ పాఠశాలలో, ఉన్నత విద్యాభ్యాసాన్ని సెయింట్ స్టీఫెన్ కళాశాలలో పూర్తి చేశారు. న్యాయవిద్యను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పూర్తి చేశారు. ఢిల్లీ బార్కౌన్సిల్లో 1984లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1999–2004 మధ్య ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు న్యాయసలహాదారుగా, హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలు అందించారు. అనేక ప్రజాహిత వ్యాజ్యాల్లో ఢిల్లీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలితోపాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థల తరఫున వాదించారు. 2006లో తాత్కాలిక న్యాయమూర్తిగా.. 2006 మే 29న ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా హిమా కోహ్లి నియమితులయ్యారు. 2007 ఆగస్టు 28న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ రాష్ట్ర న్యాయసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా, నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలిగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ చైర్‌పర్సన్‌గా, పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సెన్సెస్ జనరల్ కౌన్సిల్ సభ్యురాలిగా, జాతీయ న్యాయసేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో వస్తున్న న్యాయదీప్ పత్రిక సంపాదక వర్గ సభ్యురాలిగా సేవలు అందిస్తున్నారు. కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను జస్టిస్ కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ధర్మాసనం ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీచేసింది. 2018 నవంబర్‌లో బాధ్యతలు చేపట్టిన చౌహాన్.. రాజస్తాన్‌కు చెందిన జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ కర్ణాటక హైకోర్టు నుంచి 2018 నవంబర్ 8న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2019 ఏప్రిల్ 3న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అదే ఏడాది జూన్ 22న పూర్తికాలం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. న్యాయశాఖలో సిబ్బంది కొరతను నివారించేందుకు భారీగా నియామకాలు చేపట్టారు. అలాగే న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చేందుకు కృషి చేశారు. ఏపీ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామిని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, మధ్యప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మహ్మద్ రఫీఖ్, ఒడిశా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్.మురళీధర్, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీబ్ బెనర్జీలు బాధ్యతలు స్వీకరించాలని రాష్ట్రపతి ఆదేశించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించినట్లు వెల్లడించింది. జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి -
ఏపీ హైకోర్టు సీజే నియామకం; నోటిఫికేషన్ జారీ
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను కేంద్ర న్యాయశాఖ గురువారం విడుదల చేసింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరీ బదిలీపై కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చల అనంతరం రాష్ట్రపతి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏపీ హైకోర్టు, సిక్కిం హైకోర్టు అధికారులకు జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలు ఇందులో పొందుపరిచారు. సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించాలని జస్టిస్ మహేశ్వరీకి సూచించారు.(చదవండి: నన్ను తప్పుకోమని కోరటం ధిక్కారపూర్వక చర్యే! ) కాగా జస్టిస్ అరూప్ గోస్వామి 1961 మార్చి 11న అసోంలోని జోర్హాట్లో జన్మించారు. గువాహటి ప్రభుత్వ న్యాయకళాశాల నుంచి 1985లో న్యాయశాస్త్ర పట్టా పొందారు.1985 ఆగస్టు 16న న్యాయవాదిగా తన పేరు నమోదు చేసుకున్నారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగం, ఉద్యోగ సేవలకు సంబంధించిన విభిన్న కేసులను ఆయన వాదించారు. గువాహటి హైకోర్టులో 2011లో అదనపు న్యాయమూర్తిగా, 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 అక్టోబరు 15న పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2004 డిసెంబరు 21న గువాహటి హైకోర్టు నుంచి సీనియర్ అడ్వొకేట్ హోదా పొందారు. 2011 నుంచి 2013 వరకు నాగాలాండ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2018 నుంచి రెండుసార్లు గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. -
9 రాష్ట్రాలకు కొత్త సీజేలు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు (సీజే) రానున్నారు. వీరిలో నలుగురు సీజేలు బదిలీపై రానుండగా.. ఐదుగురు న్యాయమూర్తులకు సీజేగా పదోన్నతి లభించింది. అలాగే మరో ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులు ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా సీజేలు, న్యాయమూర్తులు కలిపి 14 మందికి బదిలీ అయింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ హిమా కోహ్లి.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత సీజే జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ సీజేగా బదిలీ అయ్యారు. ఇక ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిక్కిం హైకోర్టు సీజే జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి రానుండగా.. ఏపీ ప్రస్తుత సీజే జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం సీజేగా బదిలీ అయ్యారు. అలాగే కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి.. ఏపీ హైకోర్టుకు బదిలీపై రానున్నారు. జస్టిస్ హిమా నేపథ్యం ఇదీ.. తెలంగాణ హైకోర్టుకు సీజేగా రానున్న జస్టిస్ హిమా కోహ్లి ఢిల్లీలో 1959 సెప్టెంబర్ 2న జన్మించారు. ఢిల్లీలోని సెయింట్ థామస్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి బీఏ గ్రాడుయేట్ పట్టా పొందారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. 1984లో లా పట్టా అందుకుని ఢిల్లీ బార్ కౌన్సిల్లో నమోదయ్యారు. 1999 నుంచి 2004 వరకు ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌కు స్టాండింగ్ కౌన్సెల్‌గా, న్యాయ సలహాదారుగా పనిచేశారు. 2006 మే 29న ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007 ఆగస్టు 29న పూర్తికాలం న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ రాష్ట్ర న్యాయసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా, నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలిగా, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ చైర్‌పర్సన్‌గా సేవలు అందిస్తున్నారు. కరోనా పరీక్షల వెనుక ఆమె.. ఢిల్లీలో కరోనా పరీక్షలు ఎక్కువగా నిర్వహించడానికి ప్రయోగశాలలు పెంచడం, ఫలితాలు ఒకే రోజులో వచ్చేలా చేయడం వంటి ఆదేశాలు జస్టిస్ హిమా కోహ్లి ఇచ్చినవే. ప్రస్తుతం ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యనిర్వాహక చైర్‌పర్సన్‌గానూ ఆమె వ్యవహరిస్తున్నారు. న్యాయమూర్తిగా అధికారిక విధులు నిర్వర్తించడంతో పాటు ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం ఫోరమ్‌గా మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడంపై ఆమె ఆసక్తి కనబరుస్తారు. పర్యావరణ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ పాత్ర, కుటుంబ వివాదాల పరిష్కారంలోనూ ఆమె తనదైన ముద్ర వేసుకున్నారు. కాగా, జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ కర్ణాటక హైకోర్టు నుంచి 2018 నవంబర్ 8న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2019 ఏప్రిల్ 3న తెలంగాణ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జూన్ 22న పూర్తికాలం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆమె చేపట్టిన బాధ్యతలు.. 2017 ఆగస్టు 8 నుంచి పశ్చిమ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సైన్సెస్‌కు సభ్యురాలుగా ఉన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రచురించే న్యాయ దీప్ ఎడిటోరియల్ కమిటీ సభ్యురాలుగా 7.5.2019 నుంచి ఉన్నారు. ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ కమిటీ చైర్‌పర్సన్‌గా 2020 మార్చి 11 నుంచి ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు మిడిల్ ఇన్‌కం గ్రూప్ లీగల్ ఎయిడ్ సొసైటీ చైర్‌పర్సన్‌గా 2020 జూన్ 29 నుంచి ఉన్నారు. నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలిగా 2020 జూన్ 30 నుంచి ఉన్నారు. బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తులు.. ప్రధాన న్యాయమూర్తి పేరు ప్రస్తుత హైకోర్టు బదిలీ స్థానం జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ తెలంగాణ ఉత్తరాఖండ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ఆంధ్రప్రదేశ్ సిక్కిం జస్టిస్ మహమ్మద్ రఫీఖ్ ఒడిశా మధ్యప్రదేశ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి సిక్కిం ఆంధ్రప్రదేశ్ సీజేలుగా పదోన్నతి పొందిన న్యాయమూర్తులు.. న్యాయమూర్తి పేరు ప్రస్తుత హైకోర్టు బదిలీ స్థానం జస్టిస్ హిమా కోహ్లి ఢిల్లీ తెలంగాణ జస్టిస్ ఎస్.మురళీధర్ పంజాబ్, హర్యానా ఒడిశా జస్టిస్ సంజీబ్ బెనర్జీ కోల్కత్తా మద్రాస్ జస్టిస్ పంకజ్ మిత్తల్ అలహాబాద్ జమ్ముకశ్మీర్ జస్టిస్ సుధాంశు ధులియా ఉత్తరాఖండ్ గౌహతి బదిలీ అయిన న్యాయమూర్తులు న్యాయమూర్తి పేరు ప్రస్తుత హైకోర్టు బదిలీ స్థానం జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి కోల్‌కతా ఆంధ్రప్రదేశ్ జస్టిస్ సంజయ్యాదవ్ మధ్యప్రదేశ్ అలహాబాద్ జస్టిస్ రాజేష్ బిందాల్ జమ్ము కశ్మీర్ కల్కత్తా జస్టిస్ వినీత్ కొఠారి మద్రాస్ గుజరాత్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ మధ్యప్రదేశ్ కర్ణాటక -
ఏపీ హైకోర్టు సీజేగా అరూప్ గోస్వామి
-
ఏపీ హైకోర్టు సీజేగా అరూప్ గోస్వామి
సాక్షి, న్యూ ఢిల్లీ, అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అరూప్ గోస్వామి నియమితులయ్యారు. ప్రస్తుతం సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న ఆయనను ఏపీకి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ మహేశ్వరిని సిక్కింకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. జస్టిస్ గోస్వామి 1961 మార్చి 11న అసోంలోని జోర్హాట్లో జన్మించారు. 1985లో గువాహటి ప్రభుత్వ న్యాయకళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు.1985 ఆగస్టు 16న న్యాయవాదిగా నమోదయ్యారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగం, ఉద్యోగ సేవలకు సంబంధించిన విభిన్న కేసులను వాదించారు. గువాహటి హైకోర్టులో 2011లో అదనపు న్యాయమూర్తిగా, 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 అక్టోబరు 15న పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2004 డిసెంబరు 21న గువాహటి హైకోర్టు నుంచి సీనియర్ అడ్వొకేట్ హోదా పొందారు. 2011 నుంచి 2013 వరకు నాగాలాండ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2018 నుంచి రెండుసార్లు గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.