
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను కేంద్ర న్యాయశాఖ గురువారం విడుదల చేసింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరీ బదిలీపై కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చల అనంతరం రాష్ట్రపతి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏపీ హైకోర్టు, సిక్కిం హైకోర్టు అధికారులకు జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలు ఇందులో పొందుపరిచారు. సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించాలని జస్టిస్ మహేశ్వరీకి సూచించారు.(చదవండి: నన్ను తప్పుకోమని కోరటం ధిక్కారపూర్వక చర్యే! )
కాగా జస్టిస్ అరూప్ గోస్వామి 1961 మార్చి 11న అసోంలోని జోర్హాట్‌లో జన్మించారు. గువాహటి ప్రభుత్వ న్యాయకళాశాల నుంచి 1985లో న్యాయశాస్త్ర పట్టా పొందారు.1985 ఆగస్టు 16న న్యాయవాదిగా తన పేరు నమోదు చేసుకున్నారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగం, ఉద్యోగ సేవలకు సంబంధించిన విభిన్న కేసులను ఆయన వాదించారు. గువాహటి హైకోర్టులో 2011లో అదనపు న్యాయమూర్తిగా, 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 అక్టోబరు 15న పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2004 డిసెంబరు 21న గువాహటి హైకోర్టు నుంచి సీనియర్ అడ్వొకేట్ హోదా పొందారు. 2011 నుంచి 2013 వరకు నాగాలాండ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2018 నుంచి రెండుసార్లు గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment