సాక్షి, న్యూ ఢిల్లీ, అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అరూప్ గోస్వామి నియమితులయ్యారు. ప్రస్తుతం సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న ఆయనను ఏపీకి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ మహేశ్వరిని సిక్కింకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. జస్టిస్ గోస్వామి 1961 మార్చి 11న అసోంలోని జోర్హాట్‌లో జన్మించారు. 1985లో గువాహటి ప్రభుత్వ న్యాయకళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు.1985 ఆగస్టు 16న న్యాయవాదిగా నమోదయ్యారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగం, ఉద్యోగ సేవలకు సంబంధించిన విభిన్న కేసులను వాదించారు. గువాహటి హైకోర్టులో 2011లో అదనపు న్యాయమూర్తిగా, 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
2019 అక్టోబరు 15న పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2004 డిసెంబరు 21న గువాహటి హైకోర్టు నుంచి సీనియర్ అడ్వొకేట్ హోదా పొందారు. 2011 నుంచి 2013 వరకు నాగాలాండ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2018 నుంచి రెండుసార్లు గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment