
న్యూఢిల్లీ: చిన్నారులకు సైతం కోవిడ్–19 వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అదొక గొప్ప ఘనత అవుతుందని, పాఠశాలలు మళ్లీ తెరవడానికి మార్గం సుగమమవుతుందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. పిల్లల కోసం టీకా వస్తే వారికి సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకా కోవాగ్జిన్‌ను 2–18 ఏళ్లలోపు వారిపై పరీక్షించారని, రెండో, మూడో దశ ట్రయల్స్ ఫలితాలు సెప్టెంబర్ నాటికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి రాగానే దేశంలో పిల్లలకు కరోనా టీకా అందుబాటులోకి వస్తుందన్నారు. అంతకంటే ముందే ఫైజర్ టీకాకు అనుమతి లభిస్తే పిల్లలకు అదికూడా ఒక ఆప్షన్ అవుతుందన్నారు.
జైడస్ క్యాడిలా సంస్థ జైకోవ్–డి పేరుతో కరోనా టీకాను అభివృద్ధి చేసిందని, భారత్‌లో ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం త్వరలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. జైకోవ్–డి టీకాను పెద్దలతోపాటు 12–18 ఏళ్లలోపు పిల్లలు సైతం తీసుకోవచ్చని గులేరియా తెలిపారు. చిన్నారులకు కరోనా వైరస్ సోకినప్పటికీ చాలామందిలో లక్షణాలు కనిపించడం లేదని, కొందరిలో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని చెప్పారు. ఇలాంటివారు కరోనా వాహకులుగా (క్యారియర్లు) మారుతున్నారని అన్నారు. దేశంలో 12 నుంచి 18 ఏళ్లలోపు వారు 13 కోట్ల నుంచి 14 కోట్ల మంది ఉంటారని, వీరందరికీ కరోనా టీకా ఇవ్వడానికి 25 కోట్ల నుంచి 26 కోట్ల డోసులు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment