అందరికి ఆరోగ్యం... పేటెంట్లే అవరోధం | Geethika Mantri Article On Corona Vaccine Patent | Sakshi
Sakshi News home page

అందరికి ఆరోగ్యం... పేటెంట్లే అవరోధం

Published Tue, May 18 2021 12:48 AM | Last Updated on Tue, May 18 2021 12:49 AM

Geethika Mantri Article On Corona Vaccine Patent - Sakshi

ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది కరోనా బాధితులు మరణించిన నేపథ్యంలో భారత్‌తో పాటు అనేక దేశాలు కోవిడ్‌–19 మహమ్మారి సెకండ్‌ వేవ్‌ కోరల్లో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ పేటెంట్‌ హక్కుల రద్దుపై భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనను దాదాపు వందకుపైగా దేశాలు సమర్థించాయి. తాజా అంచనా ప్రకారం విశ్వవ్యాప్తంగా 70 శాతం జనాభాకు దాదాపు 1100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అవసరమవుతాయి. హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించడానికి ఒక్కొక్కరికి రెండు డోసులు ఇవ్వడానికి ఇన్ని కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్‌లు అవసరం. అంటే నెలకు 150 కోట్ల చొప్పన వ్యాక్సిన్‌ ఉత్పత్తి జరగాలి. కానీ అతి కొద్ది సంస్థలు మాత్రమే ఇప్పుడు కోవిడ్‌–19 టీకాలను ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌లను భారీ స్థాయిలో తయారు చేసి సరఫరా చేయాలంటే కోవిడ్‌ వ్యాక్సిన్‌పై పేటెంట్‌ హక్కుల రక్షణను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈ కీలకమైన అంశంపై భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనను యూరోపియన్‌ యూనియన్‌ వ్యతిరేకిస్తున్నప్పటికీ, అమెరికా బలపర్చడం ప్రపంచ వాణిజ్య సంస్థ తదుపరి చర్చల్లో మూలమలుపు కానుంది.

కోవిడ్‌–19 మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రపంచ వాణిజ్య సంస్థలోని ట్రిప్స్‌ ఒడంబడికలోని కొన్ని నిబంధనలను రద్దుచేయాలంటూ 2020 అక్టోబర్‌ 2న భారత్, దక్షిణాఫ్రికా మొట్టమొదటగా ప్రతిపాదించాయి. మేధో సంపద హక్కుల వాణిజ్య సంబంధమైన అంశాలపై ఒడంబడిక (ట్రిప్స్‌) 1995 జనవరిలో ఉనికిలోకి వచ్చింది. ఇది ప్రధానంగా వ్యాపార రహస్యాలను అందరికీ తెలియపర్చడానికి వీలులేకుండా తమతమ ఉత్పత్తులపై కాపీరైట్, పేటెంట్లు తదితర మేధో సంపద హక్కులను పొందటానికి ఈ ఒçప్పందం వీలుకలిపిస్తుంది.

కోవిడ్‌–19 సంబంధిత వ్యాక్సిన్లు, చికిత్స, ఔషధాలకు పోటెత్తుతున్న డిమాండ్‌ను తీర్చడానికి వీటి ఉత్పత్తిని భారీ స్థాయిలో వేగంగా చేయడం అనేది భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనకు కారణం. రోగులకు సరసమైన ధరలకు వైద్య ఉత్పత్తులను సకాలంలో అందించడానికి కంపెనీల మేధో హక్కులు అడ్డుగా ఉన్నాయని పలు నివేదికలు తెలుపుతున్నాయని భారత్, దక్షిణాప్రికా ప్రతిపాదన పేర్కొంది.

ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత రాయబారి బ్రిజేంద్ర నవనీత్‌  వ్యాక్సిన్‌ ఉత్పత్తికి సంబంధించిన గణాంకాలను గమనిస్తే మేధో హక్కుల రద్దు ప్రాముఖ్యత అర్థమవుతుంది. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 70 శాతం జనాభాకు దాదాపు 1100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అవసరమవుతాయి. హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించ డానికి ఒక్కొక్కరికి రెండు డోసులు ఇవ్వడానికి ఇన్ని కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్‌లు అవసరం. అంటే నెలకు 150 కోట్ల చొప్పన వ్యాక్సిన్‌ ఉత్పత్తి జరగాలి. వయోజనులకు మాత్రమే వ్యాక్సిన్‌ వేయాలన్నా దానికి 500 కోట్ల డోసులు అవసరం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో    నెలకు 50 కోట్ల డోసుల ఉత్పత్తి కూడా సాధ్యం కావడం లేదు అని ఆమె చెప్పిన అంశం గమనించదగినది.

ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది కరోనా బాధితులు మరణించిన నేపథ్యంలో భారత్‌తో పాటు అనేక దేశాలు కోవిడ్‌–19 మహమ్మారి సెకండ్‌ వేవ్‌ కోరల్లో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ మేధో హక్కుల రద్దుపై భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనను దాదాపు వందకుపైగా దేశాలు సమర్థించాయి. అయితే ఈ ప్రతిపాదనను  యూరోపియన్‌ యూనియన్‌ తదితర దేశాలు వ్యతిరేకించాయి. దీంతో భారత దక్షిణాఫ్రికాలు ఒక మంచి ప్రతిపాదన చేశాయి. దాని  ప్రకారం పేటెంట్‌ హక్కుల రద్దు తాత్కాలికంగానే ఉంటుంది కానీ అది శాశ్వతం కాదు అని హామీ ఇస్తూ తమ ప్రతిపాదనలో మార్పులు చేయడానికి అంగీకరించాయి.

అదే సమయంలో ట్రిప్స్‌ హక్కుల రద్దుకు సంబంధించి అభ్యంతరాలు తెలుపుతూ వస్తున్న అమెరికా పాలనా యంత్రాంగం మే 5న భారత్, దక్షిణాఫ్రికా దేశాలు చేసిన ప్రతిపాదనకు మద్దతు పలికింది. ఈ ప్రతిపాదనపై అమెరికా శాసన నిర్ణేతలు, అధికారులతో సమావేశంలో దక్షిణాఫ్రికా రాయబారులతోపాటు సమావేశమైన అమెరికాలో భారత రాయబారి తరణ్‌ జిత్‌ సింగ్‌ సంధు జరిపిన చర్చల కారణంగా అమెరికా ఈ అంశంపై కాస్త చల్లబడింది. పైగా అమెరికా గనుక కోవిడ్‌ వ్యాక్సిన్‌ను మొదటగా రూపొందిస్తే దాని భారీ ఉత్పత్తికి అడ్డుపడుతూ పేటెంట్లను తాను అనుమతించబోనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన ఎన్నికల ప్రచార సమయంలోనే వాగ్దానం చేశారు. వ్యాక్సిన్‌ టెక్నాలజీ భాగస్వామ్యంపై తీవ్రమైన ఒత్తిడి ఉంటున్నప్పటికీ మందుల కంపెనీలకు చెందిన ట్రేడ్‌ యూనియన్లు పేటెంట్‌ హక్కుల రద్దును వ్యతిరేకించడం గమనార్హం.

సాంకేతిక జ్ఞాన భాగస్వామ్యంతోటే జీవనదానం
ఆరోగ్య సంరక్షణను, వ్యాధి చికిత్సలను, మందులను సరసమైన ధరలకు అందరికీ సకాలంలో అందుబాటులోకి తీసుకురావడం చాలా అవసరమని గతానుభవాలు ఎన్నో చెబుతున్నప్పటికీ మేధో హక్కుల రక్షణ హక్కును రద్దు చేయాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకత పొడసూపుతుండటం గమనించాల్సిన విషయం. ఉదాహరణకు పెన్సిలిన్‌ వైద్యరంగంలో సాధించిన మూలమలుపును చూద్దాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యాంటీబయొటిక్‌ ఔషధం ఉత్పత్తిని భారీ ఎత్తున సాగించాల్సిన అవసరం వచ్చిపడింది. నాటి అమెరికన్‌ ప్రభుత్వం, అమెరికన్‌ ఔషధ కంపెనీల మధ్య సహకారం కారణంగా పెన్సిలిన్‌ మందు ఉత్పత్తిని భారీ స్థాయిలో పెంచగలిగారు. ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. పెన్సిలిన్‌ను మొట్టమొదటగా వేరుపర్చి, చికిత్సపరంగా దాని సమర్థతను నిరూపించిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ దేశీయంగా కానీ, అంతర్జాతీయంగా కానీ తన ఆవిష్కరణపై ఎలాంటి పేటెంట్‌ హక్కును కోరలేదు. తీసుకోలేదు కూడా.

ఇటీవల కాలంలో హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ మహమ్మారి విజృంభించిన సమయంలో ఏఆర్‌వీ(యాంటీరెట్రోవైరల్‌) జెనెరిక్‌ ఔషధాన్ని సరసమైన ధరవద్ద భారీగా ఉత్పత్తి చేయడం కారణంగా ఎయిడ్స్‌ వ్యాధి నియంత్రణకు అది ఎంతగా ఉపయోగపడిందో మనందరం చూశాం. ట్రిప్స్, ప్రజారోగ్యంపై దోహా ప్రకటన వెలువడిన దశాబ్దం తర్వాత అంటే 2003–2005 మధ్యలో హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ సంబంధిత ఔషధాల కోసం ప్రపంచంలోని 17 ఎగువ, మధ్య ఆదాయ దేశాలు 24 తప్పనిసరి లైసెన్సులను ఆహ్వానించాయి. భారత్‌లో అయితే ప్రముఖ ఫార్మా దిగ్గజం సిప్లా అసాధారణమైన ధరలున్న అనేక మందులను దేశీయంగా అతితక్కువ ధరల వద్దే తయారు చేయడం కోసం రివర్స్‌ ఇంజనీరింగ్‌ని సమర్థంగా నిర్వహించిన విషయం కూడా తెలిసిందే. ఈ సంస్థ ఎయిడ్స్‌ నివారణ కోసం సరసమైన ధరవద్ద ఏఆర్‌వీ ఔషధాన్ని కూడా తయారు చేసింది.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న కోవిడ్‌–19 మహమ్మారిని అరికట్టాలంటే లక్షలాది ప్రజల ప్రాణాలను కాపాడటమొక్కటే ఇప్పుడు యావత్‌ ప్రపంచ కర్తవ్యంగా మారిందని చౌకగా అందుబాటులో ఉండే ప్రజారోగ్యం, ఔషధాల సమర్థకులు నొక్కి చెబుతున్నారు. కాబట్టి కరోనా సెకండ్‌ వేవ్‌ నివారణకు మనకు మరిన్న వ్యాక్సిన్‌లు ఇంకా వేగంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. కోవిడ్‌–19 ఇప్పుడొక విశ్వవ్యాప్త సమస్య. కాబట్టి దానికి మనం విశ్వవ్యాప్త పరిష్కారాన్నే కోరుకోవాలి. చాలా దేశాలు ఇందుకు పూనుకోకుంటే మనం ఇప్పటి దుస్థితి నుంచి, మహమ్మారి నుంచి బయటపడటం చాలా కష్టం. ఉదాహరణకు కరోనా కోరల్లో చిక్కుకున్న భారతదేశాన్ని వేరుపర్చి, భారతీయుల ప్రయాణాలను అడ్డుకుని, వాణిజ్య సంబంధాలను తెంచేసుకుని ముందుకు సాగటం ప్రపంచానికి మంచిది కాదు. అది అసాధ్యం కూడా అని స్వతంత్ర లాభార్జనా రహిత అంతర్జాతీయ పరిశోధనా సంస్థ టిడబ్లు్యఎన్‌ లీగల్‌ సలహాదారు కేఎమ్‌ గోపకుమార్‌ స్పష్టంగా చెప్పారు. 

కోవిడ్‌ వ్యాప్తి నిరోధకతలో భాగంగా అనేక దేశాలు తమ సొంత సరఫరాలను వేగవంతం చేయడానికి ప్రస్తుతం ఉన్న మందుల సరఫరాను షేర్‌ చేయడం, టెక్నాలజీని బదిలీ చేయడం అత్యవసరం. కొన్ని కంపెనీల సొంత ఆస్తిలా కోవిడ్‌–19 వ్యాక్సిన్‌లు ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగకూడదు. అది యావత్‌ ప్రపంచ ఆరోగ్యాన్నికి ఉమ్మడి వ్యాక్సిన్‌గా రూపొందాలి అని డాక్టర్‌ టొర్రీల్‌ వక్కాణించారు. భారీస్థాయి మందుల కంపెనీలలో ఉత్పత్తి, పరిశోధనకోసం భారీగా పెట్టుబడులు పెట్టిన ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యాక్సిన్‌ మేధో హక్కులను పంచుకునేలా ఆ మందుల కంపెనీలపై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మహమ్మారి. యావత్‌ ప్రపంచం కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవలసి ఉంది. వ్యాపార లాభాలకు, దురాశకు, జాతీయవాదానికి ఇప్పుడు ఏమాత్రం చోటు లేదని అందరూ గ్రహించాల్సి ఉంది.

వ్యాసకర్త: గీతికా మంత్రి 
జర్నలిస్టు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement