Patent rights
-
పార్వతీపురం రైతుకు పేటెంట్ మంజూరు చేసిన భారత ప్రభుత్వం
బహుళ పంటలను ఒకేసారి విత్తుకునేందుకు అన్ని విధాలుగా రైతుకు ఉపయోగకరమైన వినూత్న పరికరం (డ్రమ్‌సీడర్)ను రూపొందించిన పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన గ్రామీణ ఆవిష్కర్త దమరసింగి బాబూరావుకు భారత ప్రభుత్వం పేటెంట్ మంజూరు చేసింది. తొలుత ఇనుముతో తయారు చేసిన ఈ పరికరంపై పేటెంట్‌కు 2015లోనే ఆయన దరఖాస్తు చేయగా, ఇటీవలే పేటెంట్ సర్టిఫికెట్ అందింది. తదనంతరం మరింత తేలిగ్గా ఉండాలన్న లక్ష్యంతో స్టెయిన్లెస్ స్టీల్‌తో తక్కువ బరువుతో ఉండేలా, ఎక్కువ కాలం మన్నిక ఉండేలా బాబూరావు దీన్ని మెరుగుపరిచారు. 2 ఎం.ఎం. సైజు నుంచి 16 ఎం.ఎం. సైజు వరకు ఎంత సైజు ఉన్న ఏ పంట విత్తనాలనైనా స్వయంగా రైతే స్వల్ప మార్పులు చేసుకోవటానికి, వరుసల మధ్య దూరాన్ని కూడా అనుకూలంగా సులువుగా మార్చుకోవటానికి ఈ డ్రమ్‌సీడర్ అనువుగా ఉంది. పత్తి, పెసలు, కందులు వంటి మూడు పంటలను ఒకేసారి విత్తుకోవడానికి ఈ ఆధునిక డ్రమ్‌సీడర్ ఉపయోగపడుతుండటం విశేషం. అన్ని రకాల చిరుధాన్యాలు, నువ్వులు, వేరుశనగ, బఠాణి, గోధుమ, వరి, పెసర, మినుము, పుల్లశనగ, పెద్ద బఠాణి, పెద్ద వేరుశనగలను సైతం దీనితో విత్తుకోవచ్చు. దీనికి ఏడు సీడ్ బాక్సులు అమర్చారు. రైతులే మార్పులు చేసుకోవచ్చు 2.5 అడుగులు (30 అంగుళాల) ఎత్తున ఇరువైపులా చక్రాలను అమర్చటం, 6 అంగుళాల వెడల్పు గల చక్రాలను అమర్చటంతో దీన్ని ఉపయోగించటం సులువు. పెద్ద చక్రాలను ఏర్పాటు చేయటం, పంటను బట్టి విత్తనం సైజును బట్టి, వరుసల మధ్య దూరాన్ని బట్టి మార్పులు చేసుకోవడానికి చక్రాలను ఇప్పి మార్పులు చేయాల్సిన అవసరం లేకుండా రెండు స్క్రూలు ఇప్పితే చాలు అవసరమైన మార్పులు మెకానెక్ అవసరం లేకుండా రైతే స్వయంగా చేసుకోవచ్చని, అందుకే ఈ డ్రమ్‌సీడర్ తక్కువ కాలంలోనే రైతుల ఆదరణ పొందిందని బాబూరావు ‘సాక్షి’తో చెప్పారు. నాలుగు వేరియంట్లు ఎకనామిక్ మల్టీపర్పస్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ అని పిలుస్తున్నారు. ఇందులో నాలుగు వేరియంట్లను బాబూరావు రైతులకు అందుబాటులోకి తెచ్చారు. పొలంలో యంత్రాలు అవసరం లేకుండా ఇద్దరు మనుషులు సులువుగా లాగుతూ విత్తనాలు వేసుకునే విధంగా, జోడెడ్లకు కట్టి లాక్కెళ్లేలా, ట్రాక్టర్‌కు వెనుక బిగించే విధంగా, 6.5 హెచ్‌పి హోండా ఇంజన్‌తో అనుసంధానం చేసి ఒక మనిషి నడిపే విధంగా స్టెయిన్లెస్ స్టీల్‌తో డ్రమ్సీడర్లను ఆయన రూపొందించారు. వేరియంట్‌ను బట్టి దాని ధర, బరువు ఆధారపడి ఉంటుంది. మనుషులు లక్కెళ్లే దాని బరువు 25 కిలోలు ఉంటుంది. ట్రాక్టర్‌కు అనుసంధానం చేసేది 80 కిలోల బరువు ఉంటుంది. ‘ఆంగ్రూ’ పోషణ్ ఇంక్యుబేషన్ సెంటర్ బాబూరావుకు రూ. 4 లక్షల గ్రాంటు ఇవ్వటం విశేషం. పల్లెసృజన తోడ్పాటుతో రాష్ట్రపతి భవన్‌లోని ఇన్నోవేషన్ ఫెస్టివల్‌తో పాటు అనేక మేళాల్లో బాబూరావు (94409 40025) ఈ డ్రమ్‌సీడర్‌ను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ప్రకృతి సేద్యంపై ఎన్‌ఐపిహెచ్‌ఎం సర్టిఫికెట్ కోర్సు ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం చేపట్టదలచిన/ చేపట్టిన కనీసం ఇంటర్ చదివిన యువతకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖకు అనుబంధ సంస్థ, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) సర్టిఫికెట్ కోర్సు నిర్వహించనుంది. ‘ప్రకృతి/సేంద్రియ వ్యవసాయంలో మొక్కల ఆరోగ్య యాజమాన్యం’ పేరుతో వచ్చే డిసెంబర్ నుంచి 3 నెలల సర్టిఫికెట్ కోర్సులో శిక్షణ ఇస్తారు. కోర్సు కాలపరిమితి డిసెంబర్ 6 నుంచి 2014 మార్చి 13 వరకు. యువతీ యువకులకు శిక్షణ ఇవ్వటం ద్వారా గ్రామస్థాయిలో మాస్టర్ ట్రైనర్లను తయారు చేయటం ఈ సర్టిఫికెట్ కోర్సు లక్ష్యం. తరగతి గదిలో పాఠాలతో పాటు పొలంలో పని చేస్తూ నేర్చుకునే పద్ధతులు కూడా ఈ కోర్సులో భాగం చేశారు. ఇంటర్ పూర్తి చేసిన లేదా వ్యవసాయ పాలిటెక్నిక్ పూర్తి చేసిన 18 ఏళ్లు నిండిన గ్రామీణ యువతకు ఈ కోర్సు అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యం ఇస్తారు. కోర్సు ఫీజు రూ. 7,500. ఎన్‌ఐపిహెచ్‌ఎంలో ఉండి శిక్షణ పొందే రోజుల్లో ఉచిత వసతి కల్పిస్తారు. భోజన ఖర్చులు అభ్యుర్థులే భరించాల్సి ఉంటుంది. కోర్సు డైరెక్టర్‌గా డా. ఒ.పి. శర్మ వ్యవహరిస్తున్నారు. ఇతర వివరాలకు కోర్సు కోఆర్డినేటర్ డా. కె. దామోదరాచారి (95426 38020)ని సంప్రదించవచ్చు. నవంబర్ 20లోగా ఫీజు చెల్లించి, దరఖాస్తులు పంపాలి. డిసెంబర్ 22 నుంచి ఏపీ పుష్ప ప్రదర్శన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి నాలుగో పుష్ప ప్రదర్శన, అమ్మకం కార్యక్రమాన్ని డిసెంబర్ 22 నుంచి 27 వరకు జరగనుంది. విజయవాడలోని (పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు) సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజి గ్రౌండ్లో జరుగుతుంది. వివరాలకు.. 93935 77018. -
పోటాపోటీగా పేటెంట్లు.. రాయితీలతో కేంద్రం వెన్నుదన్ను
సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జాతీయ ఉన్నత విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు యూనివర్సిటీలు, విద్యాసంస్థలు పేటెంట్ల విషయంలో పోటీపడుతున్నాయి. వీటిల్లో పరిశోధనా కార్యక్రమాలను మరింత పగడ్బందీగా కొనసాగిస్తుండడంతో కొత్త ఆవిష్కరణలతో స్వయం సమృద్ధికి వీలుగా మేథో సంపత్తి హక్కుల (ఇంటెలెక్యువల్ ప్రాపర్టీ రైట్స్) సాధనలో పురోగతి సాధిస్తున్నాయి. కేంద్రం కూడా ఈ ఉన్నత విద్యా సంస్థల్లో చేపట్టే ఆవిష్కరణలకు పేటెంట్లు కల్పించడంలో 80 శాతం ఫీజు రాయితీలు ఇవ్వడం కూడా నూతన ఆవిష్కరణలకు కారణమవుతున్నాయి. ఫలితంగా ఈ సంస్థలలో పేటెంట్ల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. నిజానికి.. ఏదైనా సంస్థ పేటెంట్ దాఖలు చేయాలంటే ముందుగా రూ.20వేల ఖర్చుపెట్టాలి. ఆ తరువాత వాటి పరిశీలన తదితర ప్రక్రియలలో మరికొంత మొత్తాన్ని ఛార్జీలుగా చెల్లించాలి. దీనికి అదనంగా.. పేటెంట్ చేసే వ్యక్తి 20 ఏళ్లపాటు దాని నిర్వహణ రుసుమును కూడా జమచేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఇప్పటివరకు ఉన్నత విద్యాసంస్థల్లో పేటెంట్లపై ఆసక్తి కనబర్చలేదు. అయితే, కేంద్ర ప్రభుత్వం పరిశోధన, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా చట్టాన్ని సవరించి 80 శాతం రాయితీలను ప్రకటించడంతో క్రమేణా పేటెంట్లు పెరిగేందుకు ఆస్కారమేర్పడుతోంది. నూతన జాతీయ విద్యావిధానం–2020లో కూడా ఉన్నత విద్యా సంస్థల్లో నూతన ఆవిష్కరణలకు పెద్దపీట వేయాలని.. వాటి ద్వారా ఆయా సంస్థలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రణాళికలు అమలుచేయాలని సూచించింది. సమగ్ర పరిశోధనలతో నూతన ఆవిష్కరణలు చేసే వారికి ఆర్థిక సహకారం కూడా అందించేలా మార్గనిర్దేశం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏటా అధ్యాపకులు, పరిశోధక అభ్యర్థులకు నిధులు కూడా ఇస్తోంది. ఇలా ఏటా 10వేల పేటెంట్ల లక్ష్యంగా ఈ ప్రోత్సాహకాలను అందిస్తోంది. పేటెంట్ల వాణిజ్యీకరణను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచ పేటెంట్ ర్యాంకింగ్స్‌లో స్థానాన్ని మెరుగుపర్చుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఏయూలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు ఈ పేటెంట్లను ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం తన క్యాంపస్‌లో మేథో సంపత్తి హక్కుల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఈ కేంద్రం డాక్యుమెంటేషన్ ప్రక్రియను పర్యవే„ìక్షించడంతో పాటు దాఖలుకు అయ్యే ఖర్చును కూడా భరిస్తోంది. అనేక విద్యాసంస్థల విద్యార్థులు తమ మెంటార్ల మార్గదర్శకత్వంలో వినూత్న ప్రాజెక్టుల పేటెంట్ల దాఖలుకు ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు.. 2020–21లో విద్యాసంస్థలు, ఇతర పరిశోధనా సంస్థలు అందించిన పేటెంట్ దరఖాస్తులు 58,503గా ఉన్నాయి. అందులో ప్రధానంగా మహారాష్ట్ర 4,214, తమిళనాడు 3,945, కర్ణాటక 2,784, యూపీ 2,317, తెలంగాణ 1,662, పంజాబ్ 1,650, ఢిల్లీ 1,608, గుజరాత్ 921, హర్యానా 765, ఆంధ్రప్రదేశ్ 709, పశ్చిమ బెంగాల్ 505 రాజస్థాన్ 449, కేరళ 426, మధ్యప్రదేశ్ 398, ఒడిశా 144, పాండిచ్చేరి నుంచి 139 దరఖాస్తులు వచ్చాయి. పేటెంట్లలో ముందున్నవి ఇవే.. ఇక కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వంటి పరిశోధనా సంస్థలు అత్యధిక సంఖ్యలో పేటెంట్లను దాఖలు చేయడంలో ముందున్నాయి. కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్, ట్రేడ్‌మార్క్ (సీజీపీడీటీఎం) నివేదిక ప్రకారం 2019–2020లో టాప్–10 విద్యాసంస్థలు అందించిన పేటెంట్ల సంఖ్య 2,533 కాగా.. 2020–21లో ఆ సంఖ్య 3,103కి పెరిగింది. 2019–20లో ఐఐటీలు 664 పేటెంట్లను దాఖలు చేశాయి. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, చండీగఢ్ వర్సిటీ వంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు తక్కిన పేటెంట్లకు దరఖాస్తు చేశాయి. అలాగే, 2020–21లో ఐఐటీలు 640 పేటెంట్లు ప్రకటించగా తక్కిన సంస్థల్లో అవి మరింత మెరుగుపడ్డాయి. ఈ వర్సిటీల్లో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్లను ఏర్పాటుచేసి ఈ పేటెంట్లను దాఖలు చేశాయి. ఇదీ చదవండి: AP: ఫ్యామిలీ డాక్టర్.. సరికొత్త ‘జీవన శైలి’ -
కరోనా టీకాలపై వివాదం.. కోర్టుకెక్కిన మోడెర్నా..
వాషింగ్టన్: కరోనా కోరల్లో చిక్కుకుని ప్రపంచం విలవిల్లాలాడినప్పుడు వ్యాక్సిన్లు సంజీవనిలా మారిన విషయం తెలిసిందే. ఈ టీకాల వల్ల కోట్ల మంది ప్రాణాలు నిలిచాయి. అయితే తమ టీకా సాంకేతికతను కాపీ కొట్టారాని మోడెర్నా సంస్థ ఆరోపించింది. ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫైజర్, బయోఎన్‌టెక్ ఏంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతను ఉపయోగించి తొలి కరోనా టీకాను తయారు చేశాయి. అయితే ఈ టెక్నాలజీకి సంబంధించి పేటెంట్ హక్కులు తమవని, 2010-2016 మధ్యే దీన్ని రిజిస్టర్ చేసుకున్నట్లు మోడెర్నా చెబుతోంది. ఈ విషయంపై కోర్టుకెక్కింది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే.. ఫైజర్, బయోఎన్‌టెక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎంఆర్ఎన్ఏ అనేది ప్రతి కణం ప్రోటీన్ తయారీకి డీఎన్ఏ సూచనలను కలిగి ఉండే జన్యు స్క్రిప్ట్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల తయారీలో ఈ సాంకేతికతనే ఉపయోగించారు. ఈ అధునాతన టెక్నాలజీతో తక్కువ సమయంలోనే వ్యాక్సిన్లను అభివృద్ధి చేయవచ్చు. చదవండి: లండన్‌లో గోమాతకు పూజలు.. రిషి సునాక్‌పై నెటిజెన్ల ప్రశంసలు.. -
11 ఏళ్లలో తొలిసారిగా రికార్డు సృష్టించిన భారత్..!
న్యూఢిల్లీ: దేశంలో పేటెంట్ దరఖాస్తుల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో 66,440 నమోదైంది. 2014–15లో ఈ సంఖ్య 42,763. మేధో సంపత్తి హక్కుల వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఈ వృద్ధికి కారణమని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ‘2020–21లో భారత్‌లో మంజూరైన పేటెంట్ల సంఖ్య 30,074 ఉంది. 2014–15లో ఇది కేవలం 5,978 మాత్రమే. పేటెంట్ దరఖాస్తుల పరిశీలనకు అయ్యే సమయం ఆరేళ్ల క్రితం 72 నెలలు ఉంటే.. ఇప్పుడు 5–23 నెలలకు వచ్చింది. 2022 జనవరి–మార్చిలో భారత్‌లో నమోదైన పేటెంట్ ఫైలింగ్స్ అంతర్జాతీయంగా నమోదవుతున్న దరఖాస్తులను మించిపోయాయి. భారత ఫైలింగ్స్ జోరు 11 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వచ్చిన 19,796 దరఖాస్తుల్లో భారతీయ సంస్థలు, వ్యక్తులకు చెందినవి 10,706 ఉన్నాయి’ అని వివరించింది. -
Lays Chips: పెప్సీకో కంపెనీకి భారత్‌లో ఎదురుదెబ్బ
Pepsico Lays Chips Potato Patent Rights Revoked In India: ప్రముఖ ఫుడ్ అండ్ స్నాక్ కంపెనీ ‘పెప్సీకో’కి భారత్‌లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చిప్స్ తయారీ కోసం ఉపయోగించే ప్రత్యేకమైన ఆలు వంగడంపై హక్కులు పూర్తిగా పెప్సీకో సొంతం మాత్రమే కాదనే తీర్పు వెలువడింది. ఈ మేరకు పెప్సీకో పేరిట ఉన్న రిజిస్ట్రేషన్ హక్కుల్ని రద్దు చేస్తూ.. మొక్కల రకాల పరిరక్షణ & రైతు హక్కుల అధికార సంఘం Protection of Plant Varieties and Farmers' Rights (PPVFR) Authority శుక్రవారం తీర్పు వెలువరించింది. లేస్ చిప్స్ తయారీకి ఉపయోగించే బంగాళదుంప వంగడంపై రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తమపేరిట ఉన్నందున పూర్తి హక్కులు తమవేనని, ఇతర రైతులెవరూ(ఒప్పంద పరిధిలో ఉన్నవాళ్లని మినహాయించి) వాటిని పండించడానికి వీల్లేదంటూ న్యూయార్క్‌కు చెందిన ఈ మల్టీనేషనల్ ఫుడ్ కంపెనీ మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది. అయితే కేవలం పరిమితులు ఉంటాయే తప్ప.. పూర్తిగా రైతుల్ని నిలువరించడం కుదరని, అందుకు చట్టం సైతం అంగీకరించదంటూ PPVFR తీర్పు వెలువరించింది. ఈ మేరకు పెప్సీకో కంపెనీకి గతంలో జారీ అయిన పేటెంట్ హక్కుల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రైతులు సంబురాలు చేసుకున్నారు. ‘రైతుల విత్తన స్వేచ్ఛ’ను ఉల్లంఘించకుండా ఇతర విత్తన, ఆహార సంస్థలను కూడా నిలువరించాలని ఈ సందర్భంగా PPVFRను రైతుల తరపున పిటిషన్ దాఖలు చేసిన కవిత కురుగంటి కోరుతున్నారు. ఇక ఈ వ్యతిరేక పరిణామంపై స్పందించేందుకు పెప్సీకో కంపెనీ నిరాకరించింది. ఏంటీ వంగడం.. ఎఫ్ఎల్-2027 (FC5) వెరైటీ పొటాటోలు. వీటిని లేస్ పొటాటో చిప్స్‌గా పేర్కొంటారు. చిప్స్ తయారీలో ఉపయోగించే ఈ వంగడాల్ని 2009లో భారత్‌లోకి తీసుకొచ్చింది పెప్సీకో కంపెనీ. సుమారు 12 వేల మంది రైతులకు వీటి విత్తనాల్ని అందించి.. తిరిగి దుంపల్ని చేజిక్కిచ్చుకునేలా ఒప్పందం ఆ సమయంలో కుదుర్చుకుంది. అంతేకాదు 2016లో ఈ వెరైటీ వంగడం మీద.. ‘పీపీవీ అండ్ ఎఫ్ఆర్ చట్టం 2001’ ప్రకారం అధికారికంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 2019లో తమ హక్కులకు భంగం కలిగిందంటూ పెప్సీకో కంపెనీ దావా వేయడం ద్వారా ఈ వంగడం గురించి బయటి ప్రపంచానికి బాగా తెలిసింది. తమ ఒప్పందం పరిధిలోని లేని తొమ్మిది మంది గుజరాత్ రైతులు ఈ వంగడం పండిస్తుండడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అందులో నలుగురు చిన్న రైతులపై 4.2 కోట్ల రూ.కు దావా వేసింది పెప్సీకో కంపెనీ. అయితే సార్వత్రిక ఎన్నికల సమయం కావడంతో ప్రభుత్వం ఈ వ్యవహారంలో కలగజేసుకుంది. దీంతో అదే ఏడాది మే నెలలో పెప్సీకో కంపెనీ కేసులు మొత్తం వెనక్కి తీసుకుంది. ఆ వెంటనే రైతు ఉద్యమకారిణి కవితా కురుగంటి.. పెప్సీకో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ PPVFR ముందు ఒక అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న పీపీవీఎఫ్‌ఆర్.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పెప్సీకో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను రద్దు చేసింది. ‘‘అనేక మంది రైతులు కష్టాల్లో కూరుకుపోయారు, వారు చేస్తున్న ఉద్దేశ్య ఉల్లంఘనపై భారీ జరిమానా చెల్లించే అవకాశం ఉంది! ఇది కచ్చితంగా ప్రజా ప్రయోజనాలను ఉల్లంఘించడమే అవుతుంది’’ అన్న కవిత వాదనలతో పీపీవీఎఫ్‌ఆర్ ఏకీభవించింది. ‘రిజిస్ట్రేటర్లు తమ హక్కులు తెలుసుకోవాలి అలాగే రైతులనూ ఇబ్బంది పెట్టకూడదు. ఇలాంటి వ్యవహారాల్లో హక్కులపై పరిమితులు ఉంటాయే తప్ప.. పూర్తి హక్కులుండవని చట్టంలో ఉంది. సీడ్ వెరైటీల మీద పేటెంట్లను చట్టం ఈ స్థాయిలో అనుమతించబోద’న్న విషయాన్ని గుర్తు చేశారు పీపీవీఎఫ్‌ఆర్ చైర్పర్సన్ కేవీ ప్రభు. చదవండి: బతుకు రోడ్డు పాలు.. జేబులో చిల్లిగవ్వ లేకున్నా కోటీశ్వరుడయ్యాడు -
ఇది స్మార్ట్‌ఫోనా..ల్యాప్‌ట్యాపా...! వివో నుంచి కళ్లుచెదిరే గాడ్జెట్..!
ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ భారీగా ఆదరణను నోచుకుంటున్నాయి. ఇప్పటికే శాంసంగ్ లాంటి కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల మార్కెట్లను యేలుతున్నాయి. ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లపై వస్తోన్న ఆదరణతో ఒప్పో, వివో లాంటి కంపెనీలు కూడా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను తయారుచేసే పనిలో నిమగ్నమైనాయి. ఇది స్మార్ట్‌ఫోనా..లేదా ల్యాప్‌ట్యాపా...! ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో అద్బుతమైన ఆవిష్కరణకు సిద్ధమైంది. ఫోల్టబుల్ స్మార్ట్ఫోన్లలో సరికొత్త ఆవిష్కరణతో వివో ముందుకురానుంది. స్మార్ట్‌ఫోనా లేదా ల్యాప్‌ట్యాపా అన్నట్లుగా వివో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఉండనుంది. సాధారణంగా మనం వాడే ల్యాప్‌ట్యాప్‌లో స్క్రీన్‌తో పాటుగా కీబోర్డు హింజ్ సహయంతో కనెక్ట్ అయ్యి ఉంటాయనే విషయం తెలిసిందే. ప్రస్తుతం వివో ఇలాంటి ఆవిష్కరణను ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో తెచ్చేందుకు సన్నాహాలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. వివో హింజ్లెస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..! వివో మూడు మడతలతో ఫోల్టబుల్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పేటెంట్ కోసం ఈ ఏడాది జూన్‌లో USPTO (యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్)కి ఫైల్ చేసినట్లు లెట్స్ గో డిజిటల్ వెల్లడించింది. ఇది మడతపెట్టినప్పుడు సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా కన్పిస్తూ టాబ్లెట్లా మారిపోతుంది. ఈ ఆవిష్కరణలో వర్చువల్ ప్రొజెక్షన్ కీబోర్డు హైలెట్‌గా నిలవనున్నుట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమర్చిన ప్రొజెక్టర్ ద్వారా వర్చువల్ కీబోర్డు కన్పించనుంది. లెట్స్‌గోడిజిటల్ భాగస్వామ్యంతో పర్వేజ్ ఖాన్ అనే గ్రాఫిక్ డిజైనర్ వివో పేటెంట్‌కు అప్లై చేసిన మోడల్ స్మార్ట్‌ఫోన్ వీడియోను తయారుచేశారు. చదవండి: అదిరిపోయే ఫీచర్లతో షావోమీ నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్..! -
ఆపిల్ కంపెనీకి భారీ షాక్..!
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రముఖ వైర్లెస్ స్పీకర్ల తయారీదారు సోనోస్ గూగుల్ కంపెనీపై యూఎస్ ఫెడరల్ కోర్టు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గూగుల్ హోమ్ స్మార్ట్ స్పీకర్స్ ఉత్పత్తుల విషయంలో ఐదు పేటెంట్ హక్కులను ఉల్లంఘించినట్లు ఫెడరల్ కోర్టు గుర్తించింది. అంతేకాకుండా 1930 ఫెడరల్ టారిఫ్ చట్టాలను గూగుల్ ఉల్లంఘించినట్లు కోర్టు నిర్దారించింది. కాగా గూగుల్‌పై భారీ జరిమానాలను విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆపిల్ కూడా అదే బాటలో.. తాజాగా ఆపిల్ కూడా గూగుల్ బాటలో నడుస్తూ హద్దు మీరుతుంది. యూఎస్ ఫెడరల్ కోర్టులో ఆపిల్ పేటెంట్ హక్కులపై జరుగుతున్న విచారణలో ఆపిల్ ఓడిపోయింది. ఆపిల్ ఇతర కంపెనీలకు చెందిన పేటెంట్ల హక్కులను కాలారాసినట్లు కోర్టు గుర్తించింది. కాగా ఆపిల్‌పై యూఎస్ ఫెడరల్ కోర్టు సుమారు 300 మిలియన్ల డాలర్ల జరిమానాను విధించింది. అప్టిస్ వైర్లేస్ టెక్నాలజీ కంపెనీకి చెందిన పేటెంట్ హక్కులను ఆపిల్ ఉల్లంఘించినట్లు ఫెడరల్ కోర్టు నిర్ధారించింది. పేటెంట్ హక్కుల ఉల్లంఘనలో భాగంగా ఆపిల్ కంపెనీ భారీ మొత్తాన్ని అప్టిస్ కంపెనీకు ముట్టజెప్పనుంది. ప్రముఖ బిగ్ టెక్ కంపెనీలు 2015 నుంచి పేటెంట్ హక్కులను కాలారాస్తన్నట్లు ఒక నివేదికలో తెలిపింది. ఆయా దిగ్గజ టెక్ కంపెనీలు పేటెంట్ హక్కుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ కేసులను ఓడిపోతున్నారు. -
హద్దుమీరిన గూగుల్..! భారీ మూల్యం తప్పదా..!
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రముఖ వైర్లెస్ స్పీకర్ల తయారీదారు సోనోస్ ఇంక్ స్మార్ట్ మ్యూజిక్ సంస్థ గూగుల్ కంపెనీపై యూఎస్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గూగుల్ హోమ్ స్మార్ట్ స్పీకర్స్ ఉత్పత్తుల విషయంలో ఐదు పేటెంట్లను ఉల్లంఘించిందనే కారణంతో ఫెడరల్ కోర్టులో సోనోస్ పిటిషన్‌ను వేసింది. సోనోస్ తన పిటిషన్లో గూగుల్ పేటెంట్స్ హక్కులను ఉల్లంఘించినందుకుగాను అమెరికాలో గూగుల్ స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్ అమ్మకాలను నిషేధించాలని, అంతేకాకుండా కంపెనీలకు నష్టపరిహరాన్ని కూడా అందించాలని కంపెనీ ఫెడరల్ కోర్టులో పేర్కొంది. తన కంపెనీ పేటెంట్లను గూగుల్ 2015 నుంచే ఉల్లంఘించడం మొదలుపెట్టిందని సోనోస్ వెల్లడించింది. తాజాగా పిటిషన్‌పై యూఎస్ ఫెడరల్ కోర్టులో విచారణ జరిగింది. విచారణలో గూగుల్ పేటెంట్ల హక్కులను ఉల్లఘించినట్లు కోర్టు నిర్థారించింది. 1930 ఫెడరల్ టారిఫ్ చట్టాన్ని గూగుల్ ఉల్లఘించిందని కోర్టు పేర్కొంది. గూగుల్‌పై దిగుమతి ఆంక్షలను కోర్టు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గూగుల్ పేటెంట్లను ఉల్లంఘణలకు పాల్పడిందని తెలిసిన క్షణంలో సోనోస్ షేర్లు 11.4 శాతం మేర ఎగబాకాయి. -
ఖాదీ బ్రాండ్‌కు బలం, ఆ మూడు దేశాల్లో..
న్యూఢిల్లీ: ఖద్దరు మీద పూర్తి పేటెంట్ హక్కులు మన దేశానివే. అందుకే ‘ఖాదీ’ అనే బ్రాండ్‌ను పరిరక్షించే పనిని బాధ్యతగా తీసుకుంది ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ). ఇతర దేశాల్లో ఖాదీ ఉత్పత్తుల అమ్మకానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా మూడు దేశాలు ఖాదీ ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ పరిధిలోకి వచ్చాయి. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో కేవీఐసీ పూర్తి వివరాలను తెలిపింది. భూటాన్, యూఏఈ తోపాటు మెక్సికో దేశాలు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు పేర్కొంది. అంతేకాదు మరో నలభై దేశాల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. అమెరికాతో పాటు ఖతర్, శ్రీలంక, ఇటలీ, జపాన్, న్యూజిల్యాండ్, సింగపూర్, బ్రెజిల్ సహా మరికొన్ని దేశాలు ట్రేడ్‌మార్క్ కోసం ఎదురు చూస్తున్నాయని కేవీఐసీ చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా వెల్లడించారు. ఖాదీ గుర్తింపు, గ్లోబల్ పాపులారిటీని కాపాడే ప్రయత్నంలో భాగంగానే ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేసింది కేవీఐసీ. ఇందులో భాగంగానే ఈ జూన్ 28న యూఏఈకి, జులై 9న భూటాన్‌లకు ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది. ఈ రెండుదేశాల కంటే ముందు పోయిన డిసెంబర్లోనే మెక్సికో ఖాదీ ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్‌తో అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ లేకపోతే.. ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలకు అనుమతి లేనట్లే. ఇంతకు ముందు జర్మనీ, యూకే, చైనా, రష్యా, ఆస్ట్రేలియా, ఈయూ దేశాలకు అనుమతి దొరికాయి. తాజాగా మూడు దేశాల అనుమతులతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. దీంతో ఆయా దేశాలు ఖాదీ ఫ్యాబ్రిక్, ఖాదీ రెడిమేడ్ గార్మెంట్స్, ఖాదీ సోప్‌లు, ఖాదీ కాస్మటిక్స్, అగరవత్తులు ఖాదీ ఉత్పత్తుల అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ దొరికినట్లయ్యింది. -
అందరికి ఆరోగ్యం... పేటెంట్లే అవరోధం
ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది కరోనా బాధితులు మరణించిన నేపథ్యంలో భారత్‌తో పాటు అనేక దేశాలు కోవిడ్–19 మహమ్మారి సెకండ్ వేవ్ కోరల్లో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పేటెంట్ హక్కుల రద్దుపై భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనను దాదాపు వందకుపైగా దేశాలు సమర్థించాయి. తాజా అంచనా ప్రకారం విశ్వవ్యాప్తంగా 70 శాతం జనాభాకు దాదాపు 1100 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరమవుతాయి. హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడానికి ఒక్కొక్కరికి రెండు డోసులు ఇవ్వడానికి ఇన్ని కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్లు అవసరం. అంటే నెలకు 150 కోట్ల చొప్పన వ్యాక్సిన్ ఉత్పత్తి జరగాలి. కానీ అతి కొద్ది సంస్థలు మాత్రమే ఇప్పుడు కోవిడ్–19 టీకాలను ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్లను భారీ స్థాయిలో తయారు చేసి సరఫరా చేయాలంటే కోవిడ్ వ్యాక్సిన్‌పై పేటెంట్ హక్కుల రక్షణను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈ కీలకమైన అంశంపై భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ వ్యతిరేకిస్తున్నప్పటికీ, అమెరికా బలపర్చడం ప్రపంచ వాణిజ్య సంస్థ తదుపరి చర్చల్లో మూలమలుపు కానుంది. కోవిడ్–19 మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రపంచ వాణిజ్య సంస్థలోని ట్రిప్స్ ఒడంబడికలోని కొన్ని నిబంధనలను రద్దుచేయాలంటూ 2020 అక్టోబర్ 2న భారత్, దక్షిణాఫ్రికా మొట్టమొదటగా ప్రతిపాదించాయి. మేధో సంపద హక్కుల వాణిజ్య సంబంధమైన అంశాలపై ఒడంబడిక (ట్రిప్స్) 1995 జనవరిలో ఉనికిలోకి వచ్చింది. ఇది ప్రధానంగా వ్యాపార రహస్యాలను అందరికీ తెలియపర్చడానికి వీలులేకుండా తమతమ ఉత్పత్తులపై కాపీరైట్, పేటెంట్లు తదితర మేధో సంపద హక్కులను పొందటానికి ఈ ఒçప్పందం వీలుకలిపిస్తుంది. కోవిడ్–19 సంబంధిత వ్యాక్సిన్లు, చికిత్స, ఔషధాలకు పోటెత్తుతున్న డిమాండ్‌ను తీర్చడానికి వీటి ఉత్పత్తిని భారీ స్థాయిలో వేగంగా చేయడం అనేది భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనకు కారణం. రోగులకు సరసమైన ధరలకు వైద్య ఉత్పత్తులను సకాలంలో అందించడానికి కంపెనీల మేధో హక్కులు అడ్డుగా ఉన్నాయని పలు నివేదికలు తెలుపుతున్నాయని భారత్, దక్షిణాప్రికా ప్రతిపాదన పేర్కొంది. ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత రాయబారి బ్రిజేంద్ర నవనీత్ వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించిన గణాంకాలను గమనిస్తే మేధో హక్కుల రద్దు ప్రాముఖ్యత అర్థమవుతుంది. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 70 శాతం జనాభాకు దాదాపు 1100 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరమవుతాయి. హెర్డ్ ఇమ్యూనిటీని సాధించ డానికి ఒక్కొక్కరికి రెండు డోసులు ఇవ్వడానికి ఇన్ని కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్లు అవసరం. అంటే నెలకు 150 కోట్ల చొప్పన వ్యాక్సిన్ ఉత్పత్తి జరగాలి. వయోజనులకు మాత్రమే వ్యాక్సిన్ వేయాలన్నా దానికి 500 కోట్ల డోసులు అవసరం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నెలకు 50 కోట్ల డోసుల ఉత్పత్తి కూడా సాధ్యం కావడం లేదు అని ఆమె చెప్పిన అంశం గమనించదగినది. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది కరోనా బాధితులు మరణించిన నేపథ్యంలో భారత్‌తో పాటు అనేక దేశాలు కోవిడ్–19 మహమ్మారి సెకండ్ వేవ్ కోరల్లో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ మేధో హక్కుల రద్దుపై భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనను దాదాపు వందకుపైగా దేశాలు సమర్థించాయి. అయితే ఈ ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ తదితర దేశాలు వ్యతిరేకించాయి. దీంతో భారత దక్షిణాఫ్రికాలు ఒక మంచి ప్రతిపాదన చేశాయి. దాని ప్రకారం పేటెంట్ హక్కుల రద్దు తాత్కాలికంగానే ఉంటుంది కానీ అది శాశ్వతం కాదు అని హామీ ఇస్తూ తమ ప్రతిపాదనలో మార్పులు చేయడానికి అంగీకరించాయి. అదే సమయంలో ట్రిప్స్ హక్కుల రద్దుకు సంబంధించి అభ్యంతరాలు తెలుపుతూ వస్తున్న అమెరికా పాలనా యంత్రాంగం మే 5న భారత్, దక్షిణాఫ్రికా దేశాలు చేసిన ప్రతిపాదనకు మద్దతు పలికింది. ఈ ప్రతిపాదనపై అమెరికా శాసన నిర్ణేతలు, అధికారులతో సమావేశంలో దక్షిణాఫ్రికా రాయబారులతోపాటు సమావేశమైన అమెరికాలో భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు జరిపిన చర్చల కారణంగా అమెరికా ఈ అంశంపై కాస్త చల్లబడింది. పైగా అమెరికా గనుక కోవిడ్ వ్యాక్సిన్‌ను మొదటగా రూపొందిస్తే దాని భారీ ఉత్పత్తికి అడ్డుపడుతూ పేటెంట్లను తాను అనుమతించబోనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ఎన్నికల ప్రచార సమయంలోనే వాగ్దానం చేశారు. వ్యాక్సిన్ టెక్నాలజీ భాగస్వామ్యంపై తీవ్రమైన ఒత్తిడి ఉంటున్నప్పటికీ మందుల కంపెనీలకు చెందిన ట్రేడ్ యూనియన్లు పేటెంట్ హక్కుల రద్దును వ్యతిరేకించడం గమనార్హం. సాంకేతిక జ్ఞాన భాగస్వామ్యంతోటే జీవనదానం ఆరోగ్య సంరక్షణను, వ్యాధి చికిత్సలను, మందులను సరసమైన ధరలకు అందరికీ సకాలంలో అందుబాటులోకి తీసుకురావడం చాలా అవసరమని గతానుభవాలు ఎన్నో చెబుతున్నప్పటికీ మేధో హక్కుల రక్షణ హక్కును రద్దు చేయాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకత పొడసూపుతుండటం గమనించాల్సిన విషయం. ఉదాహరణకు పెన్సిలిన్ వైద్యరంగంలో సాధించిన మూలమలుపును చూద్దాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యాంటీబయొటిక్ ఔషధం ఉత్పత్తిని భారీ ఎత్తున సాగించాల్సిన అవసరం వచ్చిపడింది. నాటి అమెరికన్ ప్రభుత్వం, అమెరికన్ ఔషధ కంపెనీల మధ్య సహకారం కారణంగా పెన్సిలిన్ మందు ఉత్పత్తిని భారీ స్థాయిలో పెంచగలిగారు. ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. పెన్సిలిన్‌ను మొట్టమొదటగా వేరుపర్చి, చికిత్సపరంగా దాని సమర్థతను నిరూపించిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దేశీయంగా కానీ, అంతర్జాతీయంగా కానీ తన ఆవిష్కరణపై ఎలాంటి పేటెంట్ హక్కును కోరలేదు. తీసుకోలేదు కూడా. ఇటీవల కాలంలో హెచ్ఐవీ ఎయిడ్స్ మహమ్మారి విజృంభించిన సమయంలో ఏఆర్వీ(యాంటీరెట్రోవైరల్) జెనెరిక్ ఔషధాన్ని సరసమైన ధరవద్ద భారీగా ఉత్పత్తి చేయడం కారణంగా ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు అది ఎంతగా ఉపయోగపడిందో మనందరం చూశాం. ట్రిప్స్, ప్రజారోగ్యంపై దోహా ప్రకటన వెలువడిన దశాబ్దం తర్వాత అంటే 2003–2005 మధ్యలో హెచ్ఐవీ ఎయిడ్స్ సంబంధిత ఔషధాల కోసం ప్రపంచంలోని 17 ఎగువ, మధ్య ఆదాయ దేశాలు 24 తప్పనిసరి లైసెన్సులను ఆహ్వానించాయి. భారత్‌లో అయితే ప్రముఖ ఫార్మా దిగ్గజం సిప్లా అసాధారణమైన ధరలున్న అనేక మందులను దేశీయంగా అతితక్కువ ధరల వద్దే తయారు చేయడం కోసం రివర్స్ ఇంజనీరింగ్‌ని సమర్థంగా నిర్వహించిన విషయం కూడా తెలిసిందే. ఈ సంస్థ ఎయిడ్స్ నివారణ కోసం సరసమైన ధరవద్ద ఏఆర్వీ ఔషధాన్ని కూడా తయారు చేసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న కోవిడ్–19 మహమ్మారిని అరికట్టాలంటే లక్షలాది ప్రజల ప్రాణాలను కాపాడటమొక్కటే ఇప్పుడు యావత్ ప్రపంచ కర్తవ్యంగా మారిందని చౌకగా అందుబాటులో ఉండే ప్రజారోగ్యం, ఔషధాల సమర్థకులు నొక్కి చెబుతున్నారు. కాబట్టి కరోనా సెకండ్ వేవ్ నివారణకు మనకు మరిన్న వ్యాక్సిన్లు ఇంకా వేగంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. కోవిడ్–19 ఇప్పుడొక విశ్వవ్యాప్త సమస్య. కాబట్టి దానికి మనం విశ్వవ్యాప్త పరిష్కారాన్నే కోరుకోవాలి. చాలా దేశాలు ఇందుకు పూనుకోకుంటే మనం ఇప్పటి దుస్థితి నుంచి, మహమ్మారి నుంచి బయటపడటం చాలా కష్టం. ఉదాహరణకు కరోనా కోరల్లో చిక్కుకున్న భారతదేశాన్ని వేరుపర్చి, భారతీయుల ప్రయాణాలను అడ్డుకుని, వాణిజ్య సంబంధాలను తెంచేసుకుని ముందుకు సాగటం ప్రపంచానికి మంచిది కాదు. అది అసాధ్యం కూడా అని స్వతంత్ర లాభార్జనా రహిత అంతర్జాతీయ పరిశోధనా సంస్థ టిడబ్లు్యఎన్ లీగల్ సలహాదారు కేఎమ్ గోపకుమార్ స్పష్టంగా చెప్పారు. కోవిడ్ వ్యాప్తి నిరోధకతలో భాగంగా అనేక దేశాలు తమ సొంత సరఫరాలను వేగవంతం చేయడానికి ప్రస్తుతం ఉన్న మందుల సరఫరాను షేర్ చేయడం, టెక్నాలజీని బదిలీ చేయడం అత్యవసరం. కొన్ని కంపెనీల సొంత ఆస్తిలా కోవిడ్–19 వ్యాక్సిన్లు ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగకూడదు. అది యావత్ ప్రపంచ ఆరోగ్యాన్నికి ఉమ్మడి వ్యాక్సిన్‌గా రూపొందాలి అని డాక్టర్ టొర్రీల్ వక్కాణించారు. భారీస్థాయి మందుల కంపెనీలలో ఉత్పత్తి, పరిశోధనకోసం భారీగా పెట్టుబడులు పెట్టిన ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యాక్సిన్ మేధో హక్కులను పంచుకునేలా ఆ మందుల కంపెనీలపై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మహమ్మారి. యావత్ ప్రపంచం కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవలసి ఉంది. వ్యాపార లాభాలకు, దురాశకు, జాతీయవాదానికి ఇప్పుడు ఏమాత్రం చోటు లేదని అందరూ గ్రహించాల్సి ఉంది. వ్యాసకర్త: గీతికా మంత్రి జర్నలిస్టు -
వ్యాక్సిన్ పేటెంట్ ఎత్తివేతకు అగ్రరాజ్యం మద్దతు
వాషింగ్టన్: ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ మహమ్మారిని అడ్డుకట్టకు టీకాతోనే సాధ్యమని భావించి ఆయా దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ల తయారీ, ఉత్పత్తిలో నిమగ్నమైయ్యాయి. అయితే పేటెంటు ఫీజుల కారణంగా టీకాల ధర పెరగుతుండడంతో ఈ ప్రభావం పేద దేశాలపై పడుతుంది. దీంతో ఖరీదైన టీకాలు కొనలేక వారు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ప్రస్తుత విశ్వవ్యాప్త సంక్షోభం దృష్ట్యా ఈ ఫీజుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఇప్పటికే భారత్ సహా దక్షిణాఫ్రికా దేశాలు అమెరికాకు విజ్ఞప్తి చేశాయి. తాజాగా ఈ విషయం పై అగ్రరాజ్యం సానుకూలంగా స్పందించింది. అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభం.. మేధో సంపత్తి హక్కులు ముఖ్యమే అయినప్పటికీ మహమ్మారిని అందరూ కలిసి అంతం చేయాల్సి ఉన్నందున పేటెంట్ మినహాయింపును వైట్‌హౌస్ వర్గాలు సమర్థిస్తున్నట్లు అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరిన్ టాయ్ ప్రకటించారు. “ఇది అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభం. అసాధారణ పరిస్థితుల్లో మనమంతా ఉన్నాం. అందుకు మన ప్రతిస్పందన చర్యలు కూడా అసాధారణంగానే ఉండాలి” అని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ జరిపే ఏకాభిప్రాయ సాధన కృషికి కొంత సమయం పట్టవచ్చని ఆమె గుర్తు చేశారు. అమెరికాకు సరిపడా సరఫరాలు సమకూరినందున ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం టీకాల ఉత్పాదన, పంపిణీ విస్తరణపై దృష్టి పెట్టిందని ఆమె వివరించారు. అలాగే టీకా ముడి పదార్థాల ఉత్పత్తి పెంచేందుకు కూడా కృషి చేస్తుందని టాయ్ తెలిపారు. ఓ కోణంలో ధనిక దేశాలు వ్యాక్సిన్లను నిల్వ చేస్తున్నాయనే విమర్శలు బైడెన్ ప్రభుత్వాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేశాయనే చెప్పాలి. భారత్‌కు సానుకూలంగా స్పందిస్తున్న అగ్రరాజ్యం కరోనాను ఎదుర్కొనే విషయంలో ప్రస్తుతం భారత్‌కు తోడుగా ఉండాల్సిన అవసరం చాలా ఉందని ఇటీవల శ్వేతసౌధం ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ చెప్పారు. ఔషధాలు, పరికరాలు, ప్రాణ వాయువు సిలిండర్లతో కూడిన మరికొన్ని విమానాలను భారత్‌కు పంపుతామని ప్రకటించారు. ఇదే కాక భారత్‌కు అమెరికా ఎంతో సహాయం చేస్తోంది. ప్రస్తుతం విజ్ఞప్తికి మద్దతు పలకడం చూస్తే బైడెన్ ప్రభుత్వం భారత్‌కు సానుకూలంగా స్పందిస్తోందని తెలుస్తోంది. ( చదవండి: భారత్‌కు ఎంతో సహాయం చేస్తున్నాం.. మరింత చేస్తాం ) -
విదేశాల్లో పేటెంట్లే ఎక్కువ..
న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన పరిశోధకులు, సైటింస్టులు, ఆవిష్కరణకర్తలకు భారత్‌లో కంటే విదేశాల్లోనే వేగంగా పేటెంట్ హక్కులు వస్తున్నాయని తేలింది. గడచిన పదేళ్ల కాలంలో విదేశాల్లో భారతీయులు దాఖలు చేసిన ప్రతి 10 పేటెంట్లలో నాలుగు పేటెంట్లు అనుమతులు పొందగా, భారత్‌లో భారతీయులే దాఖలు చేసిన ప్రతి 10 పేటెంట్లలో ఒక్కటి మాత్రమే అనుమతి పొందింది. భారత్‌లో పేటెంట్లు దాఖలు చేసిన విదేశీయులకు ఎక్కువ శాతం అనుమతులు రావడం కూడా గమనార్హం. ఈ వివరాలన్నింటిని వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (విపో) వెల్లడించింది. పేటెంట్ డేటా ఇదీ.. విపో వెల్లడించిన వివరాల ప్రకారం 2010 నుంచి 2019 మధ్య 1.2లక్షల మంది భారతీయులు మన దేశంలో పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకోగా వాటిలో కేవలం 13,670 మాత్రమే అనుమతులు పొందాయి. అయితే భారతీయులు విదేశాల్లో 1.07 లక్షల దరఖాస్తులు పేటెంట్ల కోసం పెట్టుకోగా వాటిలో ఏకంగా 44,477 దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. గత పదేళ్లలో విదేశీయులు భారత్‌లో 3.2లక్షల దరఖాస్తులు పెట్టుకున్నారు. వాటిలో ఏకంగా 76,637 పేటెంట్లకు అనుమతి లభించింది. అంటే భారత్‌లో పేటెంట్లు దాఖలు చేసుకునే భారతీయుల్లో కేవలం 10.8శాతం మందికి అనుమతులు వస్తుంటే, భారత్‌లో పేటెంట్లు దాఖలు చేసే విదేశీయులకు 23.4 శాతం అనుమతులు లభిస్తున్నాయి. ఖర్చు కూడా ఓ కారణమే.. పేటెంట్ల కంట్రోల్ జనరల్ రాజేంద్ర రత్నూ ఈ విషయంపై స్పందిస్తూ.. భారత్‌లో పేటెంట్ దరఖాస్తుకు అయ్యే ఖర్చు రూ. 10 వేల లోపే ఉంటుందని, అయితే ఇదే అమెరికాలో రూ. 1.5లక్షల వరకూ ఉంటుదన్నారు. ధర తక్కువగా ఉంటడంతో ఎక్కువ మంది దరఖాస్తు చేస్తున్నారని, అమెరికాలో మాత్రం ఖర్చు అధికం కావడంతో పూర్తిస్థాయిలో పరిశోధన చేపట్టిన వారే దరఖాస్తు చేసుకుంటూ ఉంటారని అన్నారు. అందుకే పేటెంట్లు దరఖాస్తు చేసుకునే సమయంలో పూర్తి స్థాయిలో పరిశీలించుకోవాలని చెప్పారు. -
రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై పేటెంట్ ఉల్లంఘన కేసు
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల తయారీ సంస్థ ఫ్లాష్ ఎలక్ట్రానిక్స్ ఇండియా, ఐచర్ మోటార్స్‌కు చెందిన రాయల్‌ఎన్‌ఫీల్డ్‌కు వ్యతిరేకంగా అమెరికా న్యాయ స్థానంలో పేటెంట్ ఉల్లంఘన కేసు దాఖలు చేసింది. ద్విచక్ర వాహనంలో వినియోగించే ఓ ఉపకరణం పేటెంట్‌ను రాయల్ ఎన్ఫీల్డ్ ఉల్లంఘించినట్టు ఆరోపించింది. ఫ్లాష్ ఎలక్ట్రానిక్స్‌కు రెగ్యులేటర్ రెక్టిఫయర్ డివైజ్, అవుట్‌పుట్ ఓల్టేజ్ రెగ్యులేటింగ్ విధానానికి అమెరికా పేటెంట్, ట్రేడ్ మార్క్ ఆఫీసు జారీ చేసిన పేటెంట్ ఉంది. దీన్ని రాయల్ ఎన్ఫీల్డ్ ఉల్లంఘించినట్టు ఫ్లాష్ ఎలక్ట్రానిక్స్ తన వ్యాజ్యంలో పేర్కొంది. యూరోప్‌లోని జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, నెదర్లాండ్స్, స్వీడన్, స్పెయిన్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, టర్కీలోనూ ఈ ఉపకరణంపై తమకు పేటెంట్ ఉన్నందున ఈ దేశాల్లోనూ రాయల్ ఎన్ఫీల్డ్కు వ్యతిరేకంగా ఇదే తరహా వ్యాజ్యాలను దాఖలు చేయనున్నట్టు ఫ్లాష్ ఎలక్ట్రానిక్స్ ఇండియా తెలిపింది. ఆటోమొబైల్ రంగంలో ప్రతిష్టాత్మక సంస్థ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ ఈ తరహా అనూహ్యమైన, అసాధారణ చర్యకు పాల్పడడం, దానిపై తాము పోరడాల్సి రావడం దురదృష్టకరంగా ఫ్లాష్ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఎండీ సంజీవ్ వాసుదేవ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్నేహపూర్వకంగా పరిష్కరించుకుందామని 2018 అక్టోబర్ 12న రాయల్ ఎన్ఫీల్డ్కు చెందిన ముగ్గురు ఉద్యోగులను సంప్రదించినప్పటికీ పరిష్కారం లభించలేదన్నారు. పేటెంట్ ఉల్లంఘనకు ముగింపు పలికి, తమకు పరిహారం చెల్లించే వరకు ప్రపంచవ్యాప్తంగా దీనిపై పోరాడతామన్నారు. -
పేటెంట్ హక్కుల్లో చైనా ప్రపంచ రికార్డు
వాషింగ్టన్: ప్రపంచంలో అమెరికాను అధిగమించి నెంబర్ వన్ స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో ఆర్థికరంగంలో అతివేగంగా దూసుకెళుతున్న చైనా ఓ ఆరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పడమే కాకుండా ఎవరికి అందనంత ఎత్తుకు దూసుకుపోయింది. మేధోసంపన్న హక్కులకు సంబంధించి ఒక్క 2015 సంవత్సరంలోనే పేటెంట్ హక్కుల కోసం ఏకంగా 11 లక్షల దరఖాస్తులు దాఖలు చేసింది. ఆ తర్వాత స్థానాల్లో ఉన్న మూడు దేశాలు ఎన్ని దరఖాస్తులు చేశాయో అన్ని ఒక్క చైనానే చేయడం గమనార్హం. అమెరికా 5,78,000 దరఖాస్తులతో రెండో స్థానంలో, 3,25,000 దరఖాస్తులతో జపాన్ మూడోస్థానంలో, 2,14,000 దరఖాస్తులతో దక్షిణ కొరియా నాలుగో స్థానంలో నిలిచిందని ఐక్యరాజ్య సమితి మేధో సంపన్న హక్కుల సంఘం అధిపతి ఫ్రాన్సిస్ గర్రీ వార్షిక నివేదిక విడుదల సందర్భంగా వెల్లడించారు. ఏ ఉత్పత్తులనైనా ఇట్టే కాపికొట్టడం ఒక్క చైనాకే చెల్లుతుందని గతంలో భావించేవారు. కానీ సృజనాత్మకత శక్తిలో గత కొన్నేళ్లుగా ప్రపంచంతో పోటీపడి ముందుకు దూసుకెళుతోంది. ఓ దేశ ఆర్థిక పురోగతికి పేటెంట్ల సంఖ్య ప్రమాణం కాకపోయినప్పటికీ ఆధునిక సాంకేతిక రంగంలో అభివృద్ధికి, పేటెంట్లకు అవినాభావ సంబంధం ఉందనే విషయం అందరికి తెల్సిందేనని ఫ్రాన్సిస్ వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాల నుంచి 2015 సంవత్సరానికి మొత్తం 29 లక్షల పేటెంట్ దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది ఎనిమిదిశాతం అధికం. మొత్తం పేటెంట్ దరఖాస్తుల్లో కంప్యూటర్ సాంకేతిక రంగానికి సంబంధించి 7.9 శాతం, ఎలక్ట్రానిక్ మెషినరీకి 7.3 శాతం, డిజిటల్ కమ్యూనికేషన్ రంగానికి సంబంధించి 4.9 శాతం ఉన్నాయని ఆయన వివరించారు. -
పేటెంటు హక్కుల పరిరక్షణలో అట్టడుగున భారత్
38 దేశాల జాబితాలో 37వ ర్యాంకు వాషింగ్టన్: అంతర్జాతీయ విధానాలకు భిన్నమైన ప్రమాణాలను పాటిస్తూ పేటెంటు హక్కుల పరిరక్షణలో భారత్ అట్టడుగున ఉంది. 38 దేశాల జాబితాలో ఆఖరు నుంచి రెండో స్థానం దక్కించుకుంది. 37వ స్థానంలో నిల్చింది. అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ (యూఎస్‌సీసీ) ఇందుకు సంబంధించి నాలుగో ఐపీ సూచీ వివరాలను విడుదల చేసింది. భారత ఐపీ పరిస్థితులను మెరుగుపరుస్తామంటూ మోదీ సర్కారు చెబుతున్నప్పటికీ.. అవి చేతల్లో ఇంకా కనిపించాల్సి ఉందని యూఎస్‌సీసీ పేర్కొంది. ఐపీ వాతావరణాన్ని మెరుగుపర్చుకోవడానికి ‘అపరిమిత అవకాశాలను’ నివేదికలో పొందుపర్చింది. మూడో వార్షిక సూచీలో 7.23గా ఉన్న భారత్ స్కోరు తాజాగా 7.05కి తగ్గింది. సూచీలో అమెరికా అగ్రస్థానంలోనూ, వెనెజులా ఆఖరు స్థానంలోనూ ఉన్నాయి. -
రసగుల్లా మాదే...కాదు మాదే!
రసగుల్లా... ఈ పేరు వింటేనే నోరూరుతుంది. ఆ మిఠాయి కోసం ఇప్పుడు రెండు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. నీళ్లు, సరిహద్దు సమస్యలతో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు నెలకొంటే ఇక్కడ మాత్రం రసగుల్లా మాదంటే ...మాదని వాదిస్తున్నాయి. రసగుల్లాపై పేటెంట్ తమకే దక్కాలని ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. ఇందుకోసం ఆ స్వీట్ తమ ప్రాంతానిదని చెప్పే ఆధారాల కోసం వెదుకుతున్నాయి. రసగుల్లా తమ ప్రాంతంలో పుట్టిందంటే తమ ప్రాంతంలో పుట్టిందని ఒడిశా, పశ్చిమ బెంగాల్ వాదిస్తు...హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. ఏదైనా ప్రాంతంలో ఒక వంటకానికి బాగా పేరొస్తే అది ఆ ప్రాంతానికే చెందింది అని నిరూపించుకునేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం మేథోహక్కుల విభాగంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ కింద అనుమతి తీసుకోవాలి. అలా అనుమతి వచ్చిన తర్వాత ఆ ప్రాంతం, రాష్ట్రానికి మాత్రమే ఆ వంటకంపై పూర్తి హక్కులు చెందుతాయి. అలా జరిగితే మరే ఇతర ప్రాంతం ఆ వంటకం తమదిగా చెప్పుకోడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు అందరికీ సుపరిచితమైన రసగుల్లా మిఠాయిపై ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు హక్కు తమదంటే తమదని గొడవకు దిగుతున్నాయి. మిఠాయి పుట్టింది తమ దగ్గరకే కాబట్టి అది తమ రాష్ట్ర వంటకం కింద గుర్తించాలని పట్టుబడుతున్నాయి. జీఐ హక్కు, గుర్తింపు తమకే చెందుతాయని వాదులాడుకుంటున్నాయి. ప్రఖ్యాత పూరి జగన్నాథస్వామి ఆలయంలో రసగుల్లా 12వ శతాబ్దంలో ప్రసాదంగా పుట్టిందని, ఆ తర్వాత మిఠాయి ఒడిశా రాష్ట్ర ప్రజల్లోను, చరిత్ర, సంస్కృతి, జీవన విధానంలో భాగమైందని ఒడిశా ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది. అందుకే జీఐ హక్కులు తమకే ఇవ్వాలని చెబుతోంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ కూడా అదేరీతిలో వాదనలు వినిపిస్తోంది. ఈ మిఠాయి తమ వద్దే పుట్టిందని, జీఐ హక్కులు కూడా వచ్చాయని పేచీ పెడుతోంది. దీంతో ఇప్పుడు ఈ మిఠాయి చరిత్ర, నేపథ్యానికి సంబంధించిన ఆధారాలు వెదికే పనిలో పడ్డాయి. మరి చివరకు రసగుల్లా ఎవరికి దక్కుతుందో చూడాలి. -
ఆవిష్కరణలపై హక్కులకు.. పేటెంట్ అటార్నీ
ఏదైనా కొత్త వస్తువును/ సాంకేతిక పరిజ్ఞానాన్ని కనిపెట్టగానే దానిపై సర్వ హక్కులు, గుర్తింపు పొందాలంటే వెంటనే చేయాల్సిన పని.. పేటెంట్ రైట్స్ సొంతం చేసుకోవడం. ఇందుకోసం పేటెంట్ అటార్నీని సంప్రదించాలి. క్లయింట్ల తరఫున న్యాయస్థానంలో పోరాడి, పేటెంట్ హక్కులు సాధించి పెట్టే బాధ్యత పేటెంట్ అటార్నీదే. మన దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పరిశోధనలకు ప్రోత్సాహం లభిస్తుండడంతో ప్రతిరోజూ వివిధ నూతన ఆవిష్కరణలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేటెంట్ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. పేటెంట్లపై జనంలో అవగాహన అధికమవుతోంది. భారత్‌లో పేటెంట్ రంగం ఎమర్జింగ్ కెరీర్. ఇందులో అభివృద్ధికి లెక్కలేనన్ని అవకాశాలున్నాయి. దీన్ని కెరీర్‌గా మార్చుకుంటే ఉపాధి అవకాశాలకు, ఆకర్షణీయమైన ఆదాయాలకు ఢోకా లేదని నిస్సందేహంగా చెప్పొచ్చు. కార్పొరేట్ సంస్థల్లో కొలువులు సైన్స్, న్యాయశాస్త్రం.. పూర్తిగా భిన్నమైన సబ్జెక్ట్‌లు. కానీ, ఈ రెండింటిని అభ్యసించినవారు అద్భుతమైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చని మీకు తెలుసా? పేటెంట్ రంగంలోనే అది సాధ్యం. వ్యక్తులు లేదా సంస్థలు తమ పరిశోధన ద్వారా కనిపెట్టిన వస్తువుకు ఒక ప్రాంత/దేశ పరిధిలో ప్రభుత్వ గుర్తింపు, చట్టపరంగా రక్షణ కావాలంటే దానిపై పేటెంట్ హక్కులు పొందాలి. ఈ హక్కులను సాధించేది పేటెంట్ అటార్నీలే. సాధారణంగా పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు దానిపై అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. వ్యాజ్యాలు దాఖలవుతుంటాయి. ఆ వస్తువును తామే రూపొందించామంటూ ఇతరులు కోర్టుకెక్కే అవకాశాలుంటాయి. పేటెంట్ అటార్నీలు న్యాయపరంగా వీటిని పరిష్కరించి, పేటెంట్‌ను సాధించాల్సి ఉంటుంది. సదరు ఆవిష్కరణ తమ క్లయింట్ సొంతమంటూ ఆధారాలతో సహా రుజువు చేయాలి. ఇందుకు న్యాయ శాస్త్రంతోపాటు సబ్జెక్ట్ పరిజ్ఞానం కూడా ఉండాలి. పేటెంట్ అనేది మన దేశంలో డిమాండింగ్ ప్రొఫెషన్ అని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో నూతన వస్తువులు/ఆవిష్కరణలకు మేధో సంపత్తి హక్కులు(ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) కూడా పొందడం క్రమంగా పెరుగుతోంది. ఇందుకోసం పేటెంట్ అటార్నీలను ఆశ్రయిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు పేటెంట్ నిపుణులను నియమించుకుంటున్నాయి. సొంతంగా అటార్నీగా పనిచేసుకొనే వీలుంది. ఈ రంగంలో జీతభత్యాలు అధికంగానే అందుతాయి. కావాల్సిన నైపుణ్యాలు: అన్ని రంగాలపై కనీస అవగాహన పెంచుకోవాలి. సమాచారాన్ని సరిగ్గా విశ్లేషించే నేర్పు ఉండాలి. అనలిటికల్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. ఏదైనా కొత్త ఆవిష్కరణను మరింత మెరుగుపర్చగల సృజనాత్మకత ప్రధానం. ఇన్వెన్షన్, డిజైన్, సాఫ్ట్వేర్లలో నైపుణ్యం ఉండాలి. వృత్తిలో ఎదురయ్యే సవాళ్లు, ఒత్తిళ్లను తట్టుకొని పనిచేయాలి. అర్హతలు: పేటెంట్ అటార్నీగా స్థిరపడాలనుకుంటే మెకానిక్స్, ఫార్మాస్యూటికల్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, సాఫ్ట్వేర్.. ఇలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టులతో కనీసం బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేయాలి. మాస్టర్స్ డిగ్రీ ఉంటే ఇంకా మంచిది. అనంతరం ఇంటలెక్చువల్ పేటెంట్ రైట్స్‌లో డిప్లొమా కోర్సులో చేరొచ్చు. ఈ కోర్సును విజయవంతంగా పూర్తిచేస్తే న్యాయ సేవా సంస్థల్లో పేటెంట్ డిపార్ట్మెంట్లో ట్రైనీగా చేరేందుకు అవకాశం ఉంటుంది. ఏడాదిపాటు పనిచేసి, పేటెంట్ ఏజెంట్స్ ఎగ్జామ్ రాయాలి. ఇందులో అర్హత సాధిస్తే పేటెంట్ ప్రొఫెషనల్‌గా వృత్తిలో అడుగుపెట్టొచ్చు. వేతనాలు: పేటెంట్ ప్రొఫెషనల్ ట్రైనీకి ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వేతనం అందుతుంది. కొంత అనుభవంతో రెగ్యులర్ ఉద్యోగిగా మారిన తర్వాత నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు అందుకోవచ్చు. వృత్తిలో మూడు నాలుగేళ్ల అనుభవం సంపాదిస్తే నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు పొందొచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా-హైదరాబాద్ వెబ్సైట్: http://nalsar.ac.in/ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.ignou.ac.in ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ స్టడీస్ వెబ్సైట్: http://iips.nmims.edu/ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటటెక్చువల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్-నాగపూర్ వెబ్సైట్: www.ipindia.nic.in/niipm/ అకాడమీ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా వెబ్సైట్: www.academyipl.com