
న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన పరిశోధకులు, సైటింస్టులు, ఆవిష్కరణకర్తలకు భారత్‌లో కంటే విదేశాల్లోనే వేగంగా పేటెంట్ హక్కులు వస్తున్నాయని తేలింది. గడచిన పదేళ్ల కాలంలో విదేశాల్లో భారతీయులు దాఖలు చేసిన ప్రతి 10 పేటెంట్లలో నాలుగు పేటెంట్లు అనుమతులు పొందగా, భారత్‌లో భారతీయులే దాఖలు చేసిన ప్రతి 10 పేటెంట్లలో ఒక్కటి మాత్రమే అనుమతి పొందింది. భారత్‌లో పేటెంట్లు దాఖలు చేసిన విదేశీయులకు ఎక్కువ శాతం అనుమతులు రావడం కూడా గమనార్హం. ఈ వివరాలన్నింటిని వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (విపో) వెల్లడించింది.
పేటెంట్ డేటా ఇదీ..
విపో వెల్లడించిన వివరాల ప్రకారం 2010 నుంచి 2019 మధ్య 1.2లక్షల మంది భారతీయులు మన దేశంలో పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకోగా వాటిలో కేవలం 13,670 మాత్రమే అనుమతులు పొందాయి. అయితే భారతీయులు విదేశాల్లో 1.07 లక్షల దరఖాస్తులు పేటెంట్ల కోసం పెట్టుకోగా వాటిలో ఏకంగా 44,477 దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. గత పదేళ్లలో విదేశీయులు భారత్‌లో 3.2లక్షల దరఖాస్తులు పెట్టుకున్నారు. వాటిలో ఏకంగా 76,637 పేటెంట్లకు అనుమతి లభించింది. అంటే భారత్‌లో పేటెంట్లు దాఖలు చేసుకునే భారతీయుల్లో కేవలం 10.8శాతం మందికి అనుమతులు వస్తుంటే, భారత్‌లో పేటెంట్లు దాఖలు చేసే విదేశీయులకు 23.4 శాతం అనుమతులు లభిస్తున్నాయి.
ఖర్చు కూడా ఓ కారణమే..
పేటెంట్ల కంట్రోల్ జనరల్ రాజేంద్ర రత్నూ ఈ విషయంపై స్పందిస్తూ.. భారత్‌లో పేటెంట్ దరఖాస్తుకు అయ్యే ఖర్చు రూ. 10 వేల లోపే ఉంటుందని, అయితే ఇదే అమెరికాలో రూ. 1.5లక్షల వరకూ ఉంటుదన్నారు. ధర తక్కువగా ఉంటడంతో ఎక్కువ మంది దరఖాస్తు చేస్తున్నారని, అమెరికాలో మాత్రం ఖర్చు అధికం కావడంతో పూర్తిస్థాయిలో పరిశోధన చేపట్టిన వారే దరఖాస్తు చేసుకుంటూ ఉంటారని అన్నారు. అందుకే పేటెంట్లు దరఖాస్తు చేసుకునే సమయంలో పూర్తి స్థాయిలో పరిశీలించుకోవాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment