ఆవిష్కరణలపై హక్కులకు.. పేటెంట్ అటార్నీ | Growing demand for patent professionals | Sakshi
Sakshi News home page

ఆవిష్కరణలపై హక్కులకు.. పేటెంట్ అటార్నీ

Published Tue, Oct 14 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 PM

ఆవిష్కరణలపై హక్కులకు.. పేటెంట్ అటార్నీ

ఆవిష్కరణలపై హక్కులకు.. పేటెంట్ అటార్నీ

ఏదైనా కొత్త వస్తువును/ సాంకేతిక పరిజ్ఞానాన్ని కనిపెట్టగానే దానిపై సర్వ హక్కులు, గుర్తింపు పొందాలంటే వెంటనే చేయాల్సిన పని.. పేటెంట్ రైట్స్ సొంతం చేసుకోవడం. ఇందుకోసం పేటెంట్ అటార్నీని సంప్రదించాలి. క్లయింట్ల తరఫున న్యాయస్థానంలో పోరాడి, పేటెంట్ హక్కులు సాధించి పెట్టే బాధ్యత పేటెంట్ అటార్నీదే.

మన దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పరిశోధనలకు ప్రోత్సాహం లభిస్తుండడంతో ప్రతిరోజూ వివిధ నూతన ఆవిష్కరణలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేటెంట్ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. పేటెంట్లపై జనంలో అవగాహన అధికమవుతోంది. భారత్‌లో పేటెంట్ రంగం ఎమర్జింగ్ కెరీర్. ఇందులో అభివృద్ధికి లెక్కలేనన్ని అవకాశాలున్నాయి. దీన్ని కెరీర్‌గా మార్చుకుంటే ఉపాధి అవకాశాలకు, ఆకర్షణీయమైన ఆదాయాలకు ఢోకా లేదని నిస్సందేహంగా చెప్పొచ్చు.
 
 
కార్పొరేట్ సంస్థల్లో కొలువులు  
సైన్స్, న్యాయశాస్త్రం.. పూర్తిగా భిన్నమైన సబ్జెక్ట్‌లు. కానీ, ఈ రెండింటిని అభ్యసించినవారు అద్భుతమైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చని మీకు తెలుసా? పేటెంట్ రంగంలోనే అది సాధ్యం. వ్యక్తులు లేదా సంస్థలు తమ పరిశోధన ద్వారా కనిపెట్టిన వస్తువుకు ఒక ప్రాంత/దేశ పరిధిలో ప్రభుత్వ గుర్తింపు, చట్టపరంగా రక్షణ కావాలంటే దానిపై పేటెంట్ హక్కులు పొందాలి. ఈ హక్కులను సాధించేది పేటెంట్ అటార్నీలే. సాధారణంగా పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు దానిపై అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. వ్యాజ్యాలు దాఖలవుతుంటాయి. ఆ వస్తువును తామే రూపొందించామంటూ ఇతరులు కోర్టుకెక్కే అవకాశాలుంటాయి.

పేటెంట్ అటార్నీలు న్యాయపరంగా వీటిని పరిష్కరించి, పేటెంట్‌ను సాధించాల్సి ఉంటుంది. సదరు ఆవిష్కరణ తమ క్లయింట్ సొంతమంటూ ఆధారాలతో సహా రుజువు చేయాలి. ఇందుకు న్యాయ శాస్త్రంతోపాటు సబ్జెక్ట్ పరిజ్ఞానం కూడా ఉండాలి. పేటెంట్ అనేది మన దేశంలో డిమాండింగ్ ప్రొఫెషన్ అని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో నూతన వస్తువులు/ఆవిష్కరణలకు మేధో సంపత్తి హక్కులు(ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) కూడా పొందడం క్రమంగా పెరుగుతోంది. ఇందుకోసం పేటెంట్ అటార్నీలను ఆశ్రయిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు పేటెంట్ నిపుణులను నియమించుకుంటున్నాయి. సొంతంగా అటార్నీగా పనిచేసుకొనే వీలుంది. ఈ రంగంలో జీతభత్యాలు అధికంగానే అందుతాయి.
 
కావాల్సిన నైపుణ్యాలు: అన్ని రంగాలపై కనీస అవగాహన పెంచుకోవాలి. సమాచారాన్ని సరిగ్గా విశ్లేషించే నేర్పు ఉండాలి. అనలిటికల్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. ఏదైనా కొత్త ఆవిష్కరణను మరింత మెరుగుపర్చగల సృజనాత్మకత ప్రధానం. ఇన్వెన్షన్, డిజైన్, సాఫ్ట్‌వేర్‌లలో నైపుణ్యం ఉండాలి. వృత్తిలో ఎదురయ్యే సవాళ్లు, ఒత్తిళ్లను తట్టుకొని పనిచేయాలి.
 
అర్హతలు: పేటెంట్ అటార్నీగా స్థిరపడాలనుకుంటే మెకానిక్స్, ఫార్మాస్యూటికల్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, సాఫ్ట్‌వేర్.. ఇలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టులతో కనీసం బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేయాలి. మాస్టర్స్ డిగ్రీ ఉంటే ఇంకా మంచిది. అనంతరం ఇంటలెక్చువల్ పేటెంట్ రైట్స్‌లో డిప్లొమా కోర్సులో చేరొచ్చు. ఈ కోర్సును విజయవంతంగా పూర్తిచేస్తే న్యాయ సేవా సంస్థల్లో పేటెంట్ డిపార్ట్‌మెంట్‌లో ట్రైనీగా చేరేందుకు అవకాశం ఉంటుంది. ఏడాదిపాటు పనిచేసి, పేటెంట్ ఏజెంట్స్ ఎగ్జామ్ రాయాలి. ఇందులో అర్హత సాధిస్తే పేటెంట్ ప్రొఫెషనల్‌గా వృత్తిలో అడుగుపెట్టొచ్చు.
 
వేతనాలు:  పేటెంట్ ప్రొఫెషనల్ ట్రైనీకి ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వేతనం అందుతుంది. కొంత అనుభవంతో రెగ్యులర్ ఉద్యోగిగా మారిన తర్వాత నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు అందుకోవచ్చు. వృత్తిలో మూడు నాలుగేళ్ల అనుభవం సంపాదిస్తే నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు పొందొచ్చు.
 
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా-హైదరాబాద్
వెబ్‌సైట్: http://nalsar.ac.in/
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం
వెబ్‌సైట్: www.ignou.ac.in
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ స్టడీస్
వెబ్‌సైట్: http://iips.nmims.edu/
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటటెక్చువల్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్-నాగపూర్
వెబ్‌సైట్: www.ipindia.nic.in/niipm/
అకాడమీ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా
వెబ్‌సైట్: www.academyipl.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement