తిరువనంతపురం: భారతదేశ ప్రభుత్వ టీవీ ఛానెల్ దూరదర్శన్‌పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ది కేరళ స్టోరీ చిత్రాన్ని ప్రసారం చేయాలని డీడీ నేషనల్ నిర్ణయించడమే అందుకు కారణం.
పలు వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన ది కేరళ స్టోరీ చిత్రాన్ని దూరదర్శన్ ఛానెల్‌లో ప్రసారం చేయడం సరికాదని కేరళ సీఎం పినరయి విజయన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా లోక్‌సభ ఎన్నికల వేళ ఈ చర్య మతపరమైన ఉద్రిక్తతలకు కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారయన. బీజేపీ, ఆరెస్సెస్‌లకు ప్రచార యంత్రంగా మారొద్దంటూ డీడీ నేషనల్‌కు హితవు పలికారాయన. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారాయన.
The decision by @DDNational to broadcast the film 'Kerala Story', which incites polarisation, is highly condemnable. The national news broadcaster should not become a propaganda machine of the BJP-RSS combine and withdraw from screening a film that only seeks to exacerbate…
— Pinarayi Vijayan (@pinarayivijayan) April 4, 2024
ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని శుక్రవారం ప్రదర్శించేలా దూరదర్శన్ ఏర్పాట్లు చేసుకుంది. మరోవైపు సీపీఐ(ఎం) కూడా డీడీ చర్యను తప్పుబట్టింది. సెక్యులర్ రాష్ట్రంగా ఉన్న కేరళలో అలజడులు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ విమర్శలు గుప్పించింది. ‘‘ఈ సినిమా విడుదల సమయంలో కేరళలో నిరసనలు జరిగాయి. సెన్సార్ బోర్డు సైతం పది సీన్లకు కత్తెర విధించింది. అలాంటి చిత్రాన్ని జాతీయ ఛానెల్‌లో ప్రదర్శించాలని నిర్ణయించడం ముమ్మాటికీ రెచ్చ గొట్టే చర్య అని ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.
కిందటి ఏడాది ఈ చిత్రం విడుదలకాగా.. ఆ సమయంలో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఇక ఈ చిత్రాన్ని కేరళ థియేటర్లలో ప్రదర్శించకుండా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ అనధికార నిషేధంపై బీజేపీ కోర్టులను ఆశ్రయించింది. ఇక కోర్టు మాత్రం చిత్ర విడుదలను అడ్డుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సినిమా అభ్యంతరకరంగా ఉంటే సెన్సార్ బోర్డు కళ్లు మూసుకుని ఉండదు కదా అని ఆ సమయంలో చిత్ర రిలీజ్‌కు క్లియరెన్స్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment